అమరావతి కడతామంటే అంత కుళ్లు ఎందుకు?
ఆవేళ మోదీని తిట్టి మేం తప్పు చేశాం, ఇప్పుడు తెల్సుకున్నాం!! తండ్రి చంద్రబాబుకు కితాబిచ్చిన కుమారుడు లోకేశ్;
By : The Federal
Update: 2025-09-09 06:42 GMT
‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దాన్ని కడతామంటే కొందరు అసూయపడుతున్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఈ దేశానికి 100 అమరావతులు కావాలి. చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు నేటి అవసరం. 35 వేల ఎకరాల్లో మంచి నగరం నిర్మిస్తున్నాం. ఫలితాలను భవిష్యత్తులో చూడబోతున్నారు’’ అంటున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా లోకేశ్. ఒకప్పుడు రాజధాని అమరావతికి మద్దతు పలికిన వారే ఇప్పుడు ద్వేషిస్తున్నారు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా? అని ప్రశ్నించారు లోకేశ్.
తమిళనాడు కోయంబత్తూరులో ‘ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ 2025’లో ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ బదులిస్తూ.. అనేక విషయాలపై తమ పార్టీ విధానాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ప్రత్యేక సంస్కరణలు తెస్తోందన్నారు.
లోకేశ్ ఇంకా ఏమన్నారంటే...
అమరావతి గురించి మాట్లాడుతూ మంచి నగరాన్ని నిర్మిస్తున్నాం, అమరావతి సుస్థిరంగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మా నాయకుడు చంద్రబాబు డ్రీమ్ అండ్ ప్యూచర్ సిటీ అది.
టీసీఎస్‌కు తక్కువ రేటుకు భూములిచ్చిన వ్యవహారంపై స్పందిస్తూ.. టీసీఎస్ 25 వేల ఉద్యోగాలిస్తే అది ఆంధ్రప్రదేశ్‌కే ఉపయోగం. వారు అలాంటి వాతావరణాన్ని తెస్తున్నారు. హైదరాబాద్‌లో 5వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఎందుకని అప్పట్లో కొందరు విమర్శించారు. ఇప్పుడు బెంగళూరు లాంటి నగరాల్లో రెండో విమానాశ్రయానికి వెళ్తున్నారు. .
త్రిభాషా విధానంపై ఏమన్నారంటే.. మాతృభాష ప్రధానమైనదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. మేం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. భారతీయులుగా హిందీ నేర్చుకుంటున్నాం. నా కుమారుడు సైతం 3 భాషలు నేర్చుకుంటున్నాడు. ఏపీలో ప్రస్తుతం జర్మన్, జపనీస్ కూడా నేర్చుకుంటున్నారు. విదేశాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. భాషలు నేర్చుకునే అంశంలో పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి.
ఎన్డీయేకు మద్దతుపై మాట్లాడుతూ... 2029లో ఎన్నికల వరకే కాదు, ఆ తర్వాత కూడా మద్దతుగా నిలుస్తాం. 2019లో ఎందుకు వ్యతిరేకించారని అడిగినప్పుడు.. మేం మనుషులం. తప్పుచేశాం, వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్తున్నాం.
మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని 30 రోజులు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనేదానికి మీరు మద్దతిస్తారా అని అడిగినపుడు.. దేశంలో అవినీతి పోవాలి. రాజకీయ నేపథ్యమున్న అవినీతి కేసుల్లో ఏడాదిలో తీర్పులివ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది జరగలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలు అవసరం. మా సూచనలు కూడా చెప్పాం.
చంద్రబాబును జగన్ జైల్లో పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి జగన్‌ను జైలుకు పంపుతారా అని ప్రశ్నించగా.. అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ధి. నాతోపాటు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పుచేస్తే మా నాన్నే నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచనే లేదు.
కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించిన తర్వాతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ను ఏపీకి ఆహ్వానించాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు ఇతర ప్రముఖ సంస్థలూ ఏపీవైపు చూస్తున్నాయి.
పెట్టుబడుల ఆకర్షణ విషయంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లతో పోటీపడేందుకు పరిశ్రమలకు తక్కువ ధరకే భూములు, మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. దాంతోనే దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వచ్చాయి. స్పేస్ సెక్టార్ అభివృద్ధికి ఇటీవల 200 ఎకరాలను మేం కేటాయించాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇది దోహదపడుతుంది.
రాజకీయాలంటే నాకు ఇష్టం. నన్ను ఎవరూ బలవంతంగా రాజకీయాల్లోకి లాగలేదు. ప్రజలంటే ఇష్టంతో వచ్ను. సంస్కరణలు తెచ్చేందుకు రాజకీయాల్లోకి యువత రావాలి అని లోకేశ్ చెప్పారు.