అస్సాంలోనూ వేంకటేశ్వర ఆలయం, 25 ఎకరాల భూమి కేటాయింపు
ఆంధ్రప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఈ భూ కేటాయింపు జరిగింది.
By : The Federal
Update: 2025-12-20 12:23 GMT
తిరుమల శ్రీవేంకటేశుని ప్రభావం మారుమూల అస్సాం వరకు విస్తరించింది. ఈశాన్య భారతదేశంలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వైభవాన్ని చాటేలా అస్సాం రాజధాని గౌహతి నగరంలో దివ్యక్షేత్రం ఏర్పాటుకు అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేటాయించిన 10.8 ఎకరాల స్థానంలో ఇప్పుడు ఏకంగా 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా ఈ భూ కేటాయింపు జరిగింది.
గౌహతి సమీపంలోని (Kamrup) కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో తొలుత 10.8 ఎకరాలను టీటీడీకి ఇచ్చేందుకు అస్సాం ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, అదే ప్రాంతంలోని గర్చుక్ వద్ద ఉన్న స్థానిక ఆలయ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు, టీటీడీ ఆలయాన్ని సిల్చార్ లేదా డిబ్రూగఢ్ నగరాలకు మార్చాలని అస్సాం ప్రభుత్వం సూచించింది. ఈ విషయాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
ఏపీ సీఎం విజ్ఞప్తికి సానుకూల స్పందన
డిసెంబర్ 18న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఏపీ సీఎం లేఖ రాశారు. అమరావతిలో స్వామివారి ఆలయానికి 25 ఎకరాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన గౌహతిలోనే 25 ఎకరాల భూమిని టీటీడీకి ఇవ్వాలని కోరారు. భక్తుల వసతులు, నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలకు ఈ భూమి అవసరమని వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అస్సాం సీఎం, భూమితో పాటు ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించేందుకు కూడా అంగీకరించారు.
త్వరలో నిర్మాణ పనులు
ఈ సమస్యను పరిష్కరించిన ఇరువురు ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే గౌహతిలో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.