జూన్‌ నాటికి రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ పరార్!

ఆంధ్రప్రదేశ్‌ను వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Update: 2025-12-20 12:36 GMT
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న సీఎం చంద్రబాబు

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా తాత్కాలికమని, ప్రజల భాగస్వామ్యంతో చేస్తేనే శాశ్వతంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం జయప్రదం కాదన్నారు. శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభనుద్దేశించి ఏం మాట్లాడారంటే?

ఆలోచనలూ స్వచ్ఛంగా ఉండాలి..
ఇళ్లు, ఊళ్లు, కార్యాలయాలే కాదు.. మన ఆలోచనలూ స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛతలో భాగంగా నెలనెలా ఒక థీమ్‌ తీసుకుంటున్నాం. వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, కంపోస్టు, హరిత ఉత్పత్తులు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం. ఇదంతా మన భావితరాల ఆరోగ్యం కోసం చేస్తున్నాం. ఒక సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తోంది. అన్ని రంగాల నుంచి వస్తున్న వ్యర్థాలను తీసుకొని యూజ్, రికవర్, రీయూజ్‌ లక్ష్యంతో పనిచేస్తున్నాం. వ్యర్థాలను వనరుల ఆస్తిగా మారుస్తున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రంలో 86 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను గుట్టలుగా పోసి ప్రజల మధ్యనే ఉంచేసింది. దానిని గత అక్టోబర్‌ 2 నాటికి చెత్త తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుని తొలగించాం. మనింట్లో ఒక అలవాటుంది. ఇంట్లో చెత్త రోడ్లపై వేస్తాం. ఇల్లూ, రోడ్డు మనదేనని గుర్తించాలి. మనలో సామాజిక స్పృహ రావాలి. వచ్చే జనవరి 26 నాటి రాష్ట్రంలో రోడ్లపై చెత్త కనిపించకూడదు. త్వరలో కొత్తగా వంద స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తెస్తాం.
ప్రతి పనికీ ఒక నిర్దిష్ట గడువు..
రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమానికీ ఒక నిర్ధిష్టమైన గడువునిస్తాం. ఫిబ్రవరి 14కి ఇంటింటికి చెత్త వసూలు చేసే కార్యక్రమం పూర్తవ్వాలి. పొడి, తడి చెత్తలు వేరు చేసే కార్యక్రమం అక్టోబర్‌ 2కి పూర్తి చేయాలి. హోం కంపోస్టు తయారు చేసి కిచెన్‌ గార్డులకు వాడుకోవాలి. అర్బన్‌లో 5 లక్షల ఇళ్లలో కంపోస్టు తయారు కేంద్రాల లక్ష్యం పెట్టుకోగా 3.91 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షలకు 3.30 లక్షల ఇళ్లలోనూ పూర్తయ్యాయి.
ఇంటి పంటలకు ప్రాధాన్యం..
ప్రజలు తమ ఇంటి పక్కన /టెర్రస్‌పైన ఇంటి పంటలు పండించడానికి ప్రాధాన్యమివ్వాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 3.65 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 9,37 లక్షల మంది ఇంటి పంటలు పండిస్తున్నారు. త్వరలోనే ఎవరింట్లో వారే కూరగాయలు పండించుకునే రోజులు వస్తాయి.
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం..
రాష్ట్రంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కఠినతరం చేస్తాం. వచ్చే అక్టోబర్‌ నాటికి ఇది వినియోగంలో ఉండడానికి వీల్లేదు. 123 పట్టణ ప్రాంతాల్లో ఎల్రక్ట్రానిక్‌ వ్యర్థాల కలెక్షన్‌ చేపడతాం. మన పాత పుస్తకాలిచ్చి పిల్లలకు కొత్త పుస్తకాలిచ్చేలా చర్యలు చేపట్టాం.
సుపరిపాలన గురించే నా ఆలోచన..
కూటమి పాలనపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నాను. మీరు ఆఫీసులకు వెళ్లకుండా మీ ఫోన్‌ ద్వారా మీ ఇంట్లో నుంచే పొందేలా చర్యలు తీసుకుంటున్నాను. సుపరిపాలన గురించే నా ఆలోచన. ప్రభుత్వ సేవలను ఎంత వేగంగా, అవినీతి లేకుండా ఎలా అందించాలనే ఆలోచిస్తున్నాను. నాది ఎప్పుడూ ఉడుంపట్టు.. దేనిని ఒకటి అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టను. దేశ, ప్రపంచ పరిపాలన ఎలా ఉండాలంటే దాని చిరునామాగా ఏపీ ఉంటుంది. నేనిప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నేను ఎంత బాగా చేశానో న న్ను నేనే బేరీజు వేసుకుంటున్నాను. కలెక్టర్లు, ఎస్పీల నుంచి కింది స్థాయి అధికారుల పనితీరును పరిశీలిస్తున్నాను. ఒకట్రెండు సార్లు చెప్పి మారకకోతే ఏం చేయాలో ఆలోచిస్తాను.
ఆర్గానిక్‌ బెల్లం తయారు చేయండి..
ప్రజలు చాలామంది ఇప్పుడు పంచదారకు బదులు బెల్లం వాడుతున్నారు. అదే ఆర్గానిక్‌ బెల్లం అయితే మంచింది. అందుకే అనకాపల్లి రైతులు ఆర్గానిక్‌ బెల్లం తయారు చేస్తే ప్రపంచానికే ఎగుమతి చేయొచ్చు. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని అధిగమిస్తున్నాం. రెండు నెలల్లో పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయి. పోలవరం కాలువను వంశధారలో అనుసంధానం చేస్తాం. రెండు మూడేళ్లలో ఉత్తరాంద్రలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
ప్రపంచం విశాఖ వైపు చూస్తోంది..
ఇప్పుడు ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది. విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని వస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ వస్తుంది. అక్కడే స్టీల్‌ సిటీని తయారు చేస్తున్నారు. మరోపక్క అల్యూమినియం సిటీ వస్తుంది. రాష్ట్రానికి పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మేం అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే కొందరు రాక్షసులు మా యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వివిధ రూపాల్లో వస్తున్నారు. ఐటీ కంపెనీలొస్తే కేసులేస్తామంటున్నారు. ఒకపక్క పనులు చేస్తుంటా మరోపక్క కేసులను ఎదుర్కొంటున్నాను. నా లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించను.
యోగానూ ఆక్షేపిస్తున్నారు..
యోగా మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ప్రపంచం మొత్తం యోగాను అనుసరిస్తున్నారు. విశాఖలో నిర్వహించిన యోగా డేకి రెండు గిన్నిస్‌ రికార్డులొచ్చాయి. దాన్ని విమర్శిస్తున్నారు. యోగాను ప్రజా ఉద్యమంగా తయారు చేస్తాం. గత పాలకులు విశాఖను గంజాయి, డ్రగ్స్‌ను కేపిటల్‌గా చేస్తే మేం ఏఐ, డేటా, యోగా కేపిటల్‌గా చేస్తున్నాం. మా పాలనలో దందాలు, భూకబ్జాలు లేవు. రుషికొండకు గుండు కొట్టిస్తే దానిని కాపాడే బాద్యతను తీసుకున్నాం. రూ.500 కోట్లు రుషికొండ ప్యాలెస్‌కు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు సర్వేరాళ్ల వెచ్చించారు. వాటిని ఏంచేయాలో ఆలోచిస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Tags:    

Similar News