ఏకంగా 22 కార్లను దొంగతనం చేసిన ఏఎస్సై కుమారుడు

పల్నాడులో 'ఖాకీ' పుత్రుడి అరాచక సామ్రాజ్యం!

Update: 2025-12-20 12:06 GMT
అతనో బాధ్యతాయుతమైన పోలీసు అధికారి కుమారుడు. తండ్రి అధికారాన్ని, ఖాకీ చొక్కా అండను అడ్డుపెట్టుకుని సమాజంలో రక్షణ కల్పించాల్సింది పోయి.. ఏకంగా నేర సామ్రాజ్యాన్నే సృష్టించాడు. దారి దోపిడీలు, గంజాయి విక్రయాలు మాత్రమే కాకుండా, ఏకంగా 23 ఖరీదైన కార్లను చోరీ చేసిన వైనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది.
ఐదుగురు విద్యార్థుల బలితో బయటపడ్డ బాగోతం
ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అయితే, ఇది సాధారణ ప్రమాదం కాదని పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు వెంకటనాయుడు తన ముఠాతో కలిసి 'నకిలీ బ్రేక్ ఇన్‌స్పెక్టర్' అవతారమెత్తి, డబ్బులు వసూలు చేసేందుకు హైవేపై ఓ భారీ లారీని ఆపాడు. ఆ లారీని వెనుక నుంచి వచ్చిన విద్యార్థుల కారు ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు వెంకటనాయుడి అసలు రంగు బయటపడింది.
23 కార్ల చోరీ.. నకిలీ నంబర్లతో దందా
వెంకటనాయుడు ఒక భారీ ముఠాను ఏర్పాటు చేసుకుని కార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా నరసరావుపేట పోలీసులు 8 కార్లను స్వాధీనం చేసుకోగా, గతంలోనే మరో 10 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మొత్తంగా 23 కార్లను చోరీ చేసినట్లు నిర్ధారణ అయింది.
ఎలా చోరీ చేస్తారంటే..
ఫైనాన్స్ కార్లను లేదా దొంగిలించిన కార్లను తీసుకువచ్చి, వాటికి ఫేక్ నంబర్ ప్లేట్లు తగిలించి ఇతరులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
తండ్రి అండతో 15 ఏళ్ల అరాచకం...
నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాసరావు, తన కుమారుడు చేస్తున్న అరాచకాలకు అండగా నిలిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2023లో కోటప్పకొండ వద్ద రూ.2వేల నోట్ల మార్పిడి పేరుతో రూ.50 లక్షలు దోచుకున్న కేసులోనూ వెంకట నాయుడు ప్రధాన నిందితుడు. కుమారుడిపై కేసులు నమోదు కాకుండా తండ్రి తన అధికారంతో ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నట్లు తేలడంతో, పల్నాడు ఎస్పీ తీవ్రంగా పరిగణించి ఏఎస్సై శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. ఏఎస్సై 15 ఏళ్లుగా నరసరావుపేటలోనే పనిచేస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు వెంకటనాయుడు దందాలు చేసినట్లు, ఫైనాన్స్‌ కార్లను తీసుకొచ్చి ఫేక్‌ నంబర్లతో ఇతరులకు తక్కువ ధరకే అమ్మడం, గంజాయి క్రయవిక్రయాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి విషయంలో కుమారుడిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ.. అరాచకాలకు అండగా నిలిచినట్లు తేలడంతో ఏఎస్సైని మొదట వెల్దుర్తి ఠాణాకు బదిలీ చేశారు. ఇటీవల సస్పెండ్‌ చేశారు.
Tags:    

Similar News