తిరుపతిలో ఆంక్షలు కఠినం.. బైక్ పై వెళ్లే ఇద్దరికీ హెల్మెట్ ఉండాల్సిందే

తక్కువ ధరకు హెల్మెట్ల విక్రయకేంద్రం ప్రారంభంలో ఎస్పీ మాట ఇదీ..

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-20 15:45 GMT
బైక్ రైడర్ కు హెల్మెట్ అమరుస్తున్న తిరుపతి జల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు

రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. ద్విచక్ర వాహనదారుల కోసం తిరుపతిలో శుక్రవారం పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఐఎస్ఐ (ISI) హెల్మెట్ స్టాల్‌ ప్రారంభించారు. సబ్సిడీతో నాలుగు రకాల హెల్మెట్లు విక్రయిస్తున్నారు. ఈ స్టాల్ ప్రారంభించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఏమన్నారంటే..

"ఈ స్టాల్‌లో ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన హెల్మెట్లనే తక్కువ ధరకు అందుబాటులో ఉంచాం. నాసిరకం హెల్మెట్లు వాడితే దండన తప్పదు. బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చొన్న వారు కూడా ఐఎస్ఐ మార్కు హెల్మెట్లు ధరించాలి" అని తేల్చి చెప్పారు.

తిరుపతి జిల్లాలో ఈ నెల 15 వ తేదీ నుంచి నో హెల్మెట్.. నో పెట్రోల్ ( No helmet, no petrol ) ఆంక్షలు అమలులోకి తెచ్చారు. అంతకు పది రోజుల ముందు నుంచే జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు, మండల కేంద్రాల్లో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంధన సంస్థల ప్రతినిధులకు కూడా సూచనలు చేశారు. పెట్రోల్ బంకుల వద్ద సీఐ స్థాయి అధికారి సారధ్యంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు.
తిరుపతి నగరంతో పాటు జిల్లాలో కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేకంగా ప్రసారాలు కూడా చేశారు. ఈ విధానానికి స్పందన లభించింది. పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్ లేకుండా, ఇంధన నింపకుండా అక్కడి సిబ్బంది వాహనదారులను తిప్పి పంపుతున్నారు. ఈ ఆంక్షలు బలంగా అమలు కావడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఫ్యాషన్ కోసం బైక్ కు వేలాడదీసుకుని ప్రయాణించే వారు జరిమానా తప్పదని ఇప్పుడు తలపై ధరిస్తున్నారు.
"ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని విధించిన ఆంక్షలు వేధించడానికి కాదు. ప్రాణాలు కాపాడేందుకే" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మరోసారి స్పష్టం చేశారు.
పెరిగిన ధరలు
జిల్లాలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్న నేపథ్యంలో హెల్మెట్ వాడకం పెరిగింది. దుకాణాల్లో హెల్మెట్ కు గిరాకీ ఏర్పడి, ధర కూడా పెంచారు. ఒక రకం హెల్మెట్ రూ. 900 నుంచి 12 వందల వరకు విక్రయిస్తున్నారు. వాటిలో ఐఎస్ఐ మార్కు మాత్రం ఉండడం లేదు. నాసిరకం హెల్మెట్ల వల్ల బైక్ వెళుతున్న వారు ప్రమాదానికి గురైతే, గాయాలకు గురికారనే నమ్మకం లేదు. ఈ పరిస్థితి నివారించడానికి తిరుపతి పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
హెల్మెట్ల విక్రయ కేంద్రం ప్రారంభం

వాహనదారుల ప్రాణాలు కాపాడేందుకు ఆంక్షలు అమలు చేస్తున్న పోలీసులు, హెల్మెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఐఎస్ఐ మార్కు కలిగిన వివిధ రకాల హెల్మెట్ల విక్రయానికి తిరుపతి పోలీస్ పెట్రోల్ బంకు వద్ద ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఓ కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి , డీఎస్పీలు రామక్రిష్ణచారి (ట్రాఫిక్ ), భక్తవత్సలం (తిరుపతి డీఎస్పీ), చంద్రశేఖర్ ( ఏఆర్), సీఐలు, ఎస్ఐలు హాజరయ్యారు.
ఈ కేంద్రంలో నాలుగు బ్రాండెడ్ సంస్థల ఐఎస్ఐ మార్కుతో ఉన్న హెల్మెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో రూ. 889 హెల్మెట్ రూ. 663 అందుబాటులో ఉంచారు. రూ.1.099 విలువైన హెల్మెట్ రాయితీ ధరకు రూ. 780 కు విక్రయిస్తున్నారు.
"వాహనదారుల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యం. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణనష్టం నివారించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశాం" అని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు.
"హెల్మెట్ బరువు కాదు. అది ఒక బాధ్యత. ఈ బాధ్యత మన కోసం మాత్రమే కాకుండా, మన కుటుంబం కోసం కూడా" అని ఎస్పీ సుబ్బారాయుడు గుర్తు చేశార. ప్రతి వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
ఇద్దరికీ హెల్మెట్ ఉండాలి..
జిల్లాలో ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించకుంటే దండన కఠినంగా ఉంటుందని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.
"ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు తప్పవు. జైలుశిక్ష కూడా ఉంటుంది" అని ఆయన తేల్చి చెప్పారు. హెచ్చరించారు.
"తిరుపతిలో శుక్రవారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. వారిలో లో ఒక వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరో వ్యక్తి హెల్మెట్ ధరించని కారణంగా మరణించాడు" అని గుర్తు చేసిన ఎస్పీ సుబ్బారాయుడు.. ఇకపై బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి ( Pillion ) కూడా హెల్మెట్ ధరించాల్సిందే అని తేల్చి చెప్పారు.
Tags:    

Similar News