ఇంతకీ రేవంత్ రహస్య స్నేహితుడు ఎవరు ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినట్లుగా రేవంత్ రెడ్డి రహస్య ఫ్రెండ్ ఎవరనే విషయంలో అన్నీపార్టీల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి;
ఇపుడీ విషయమే టాక్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినట్లుగా రేవంత్ రెడ్డి రహస్య ఫ్రెండ్ ఎవరనే విషయంలో అన్నీపార్టీల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రెండురోజుల క్రితం కేటీఆర్(KTR) మాట్లాడుతు హెచ్సీయూ(HCU lands) 400 ఎకరాల వివాదం వెనుక పెద్ద కుంభకోణముందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా 400 ఎకరాలను తాకట్టుపెట్టి రేవంత్(Revanth) ప్రభుత్వం రు. 10 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు చెప్పారు. 10 వేల కోట్లరూపాయలు అప్పు తెచ్చుకోవటంలో ముంబాయ్(Mumbai) కి చెందిన బ్రోకర్ కంపెనీ కీలకపాత్ర పోషించినట్లు ఆరోపించారు. ముంబాయ్ కంపెనీ ద్వారా ప్రభుత్వం అప్పు తీసుకోవటంలో బీజేపీ ఎంపీ కీలకపాత్ర పోషించారని మరో ఆరోపణ చేశారు. బ్రోకర్ కంపెనీ ద్వారా అప్పు ఇప్పించినందుకు రు. 170 కోట్లు కమీషన్ కూడా ముట్టినట్లు కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ ఆరోపించినట్లుగా సదరు బీజేపీ(BJP) ఎంపీ ఎవరనే విషయంలో ఇపుడు పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ పేరును బయటపెట్టమని మీడియా అడిగినా కేటీఆర్ చెప్పలేదు. సమయం వచ్చినపుడు అన్నీ వివరాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ఇంతకీ ఆ సమయం ఎప్పుడు వస్తుంది ? ఎప్పుడంటే ఫ్యూచర్ సిటిలో(Future city) పెద్ద భూకుంభకోణం జరగబోతోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఎంపీకి చాలా తక్కువ ధరకే భూములను కట్టబెట్టేందుకు రేవంత్ అంగీకరించిన తర్వాతే ముంబాయ్ కంపెనీ రంగంలోకి దిగి ప్రభుత్వానికి 10 వేల కోట్లరూపాయల అప్పు ఇప్పించిందని కేటీఆర్ ఆరోపణలుచేశారు.
ఫ్యూచర్ సిటీలో భూముల ట్రాన్స్ ఫర్ కూడా అయిపోయిన తర్వాత ఆధారాలతో సహా బీజేపీ ఎంపీ ఎవరన్న విషయాన్ని మీడియా ముందు ఉంచుతానని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తాజా ఆరోపణలతో బీజేపీ, కాంగ్రెస్ లో ఇదే విషయమై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ ఎవరోతెలీక మీడియా కూడా జుట్టుపీక్కుంటోంది. కేటీఆర్ ఆరోపణలు చేసినట్లుగా అసలు బీజేపీ ఎంపీ పాత్రుందా ? అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ చెప్పిన బీజేపీ తెలంగాణ ఎంపీయేనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ? లోక్ సభ ఎంపీయా లేకపోతే రాజ్యసభ ఎంపీయా అన్నచర్చలు రాజకీయపార్టీల్లోను, మీడియాలో కూడా జరుగుతున్నాయి.
మధ్యవర్తుల అవసరం ఉందా ?
కేటీఆర్ చేసిన ఆరోపణల్లో కొన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవేమిటంటే ఒక బ్యాంకునుండికాని లేదా ఆర్ధికసంస్ధనుండి కాని ప్రభుత్వం అప్పుతీసుకోవాలంటే మధ్యలో బ్రోకర్ సంస్ధ అవసరం ఏముంటుంది ? ప్రభుత్వాలు అడిగితే అప్పు ఇవ్వని బ్యాంకులు, ఆర్ధికసంస్ధలుంటాయా ? తీసుకునే అప్పునుబట్టి ప్రభుత్వం ఏదో ఒక ఆస్తిని తనఖా పెడుతుంది, లేకపోతే అత్యంత విలువైన భూములను తాకట్టుగా చూపిస్తుంది. బ్యాంకులు లేదా ఆర్ధికసంస్ధలు తనఖాపెట్టిన ఆస్తి లేకపోతే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తాయి. మార్కెట్లో వాటి విలువను మదింపుచేస్తాయి. అడిగే అప్పుకన్నా ఆస్తుల మార్కెట్ విలువ ఎక్కువగా ఉందని అనుకుంటే వెంటనే అప్పు మంజూరైపోతుంది.
అయినా, ప్రభుత్వ ఆదాయం వేలకోట్లరూపాయలు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపాల్లో ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం కొన్ని బ్యంకుల ద్వారానే లావాదేవీలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వం కావాలని అనుకుంటే అప్పు ఇవ్వను అనిచెప్పే ధైర్యం ఏ బ్యాంకు కూడా చేయదు. బ్యాంకుకు ప్రభుత్వానికి సరిపడనపుడు ప్రభుత్వం గనుక సదరు బ్యాంకులో ఖాతాను మూసేస్తే ఆబ్యాంకుకు వేలకోట్లరూపాయల బిజినెస్ ఒక్కసారిగా దెబ్బతినేస్తుంది. ప్రభుత్వాలు తలచుకోవటం ఆలస్యం వెంటనే బ్యాంకులు అప్పులు మంజూరు చేసేస్తాయి. కాబట్టి బ్యాంకునుండి ప్రభుత్వం రు. 10 వేల కోట్ల అప్పును తీసుకోవాలంటే మధ్యలో బ్రోకర్ సంస్ధ అవసరం పెద్దగా ఉండదనే అనిపిస్తోంది.
కేటీఆర్ చేసిన మరోఆరోపణ ఏమిటంటే 400 ఎకరాల అటవీభూములను తాకట్టుపెట్టేందుకు లేదా అమ్మేందుకు ప్రభుత్వానికి అధికారంలేదని. అటవీభూములని కేటీఆర్, బీజేపీ నేతలంటున్నారు కాని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. అలాగే ఈమధ్య సుప్రింకోర్టు తీర్పులో కూడా 400 ఎకరాలు ప్రభుత్వ భూమని చెప్పిందే కాని 400 ఎకరాల అటవీభూములని ఎక్కడా చెప్పలేదు. 400 ఎకరాలను ప్రభుత్వం కుదవపెట్టి వేలకోట్లరూపాయల అప్పుతెచ్చుకున్నదే అనుకుందాం. ప్రభుత్వం కుదవపెట్టినపుడు ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూమేకాని అటవీభూములు ఎంతమాత్రం కావు. ఆభూములు అటవీభూములనే వివాదం ఇపుడు మొదలైంది. నిజంగానే 400 ఎకరాలు అటవీభూములే అయితే కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు ఎవరిపైనా ఎందుకని యాక్షన్ తీసుకోలేదు ? 400 ఎకరాల్లో వేలాది చెట్లున్నంత మాత్రాన అది అటవీభూములు అయిపోతాయా ? దశాబ్దాల పాటు ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉన్న వందలఎకరాల్లో చెట్లు పెరగకుండానే ఉంటాయా ? ఆ పెరిగిన చెట్లను చూపించి అదంతా అటవీభూములే అంటే అడవి అయిపోతుందా ?
ఇంతకీ బ్యాంకు అప్పు ఇచ్చిందా ?
కేటీఆర్ చేస్తున్న ఆరోపణ ఏమిటంటే 400 ఎకరాలను కుదవపెట్టి రేవంత్ ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంకులో రు. 10 వేల కోట్లు అప్పు తెచ్చుకుందని. అయితే సదరు బ్యాంకేమో తామసలు ప్రభుత్వానికి అప్పే ఇవ్వలేదని చెబుతోంది. భూములు తాకట్టుపెట్టుకోలేదు..అప్పు ఇవ్వనూలేదని బ్యాంకు బహిరంగ ప్రకటన చేయటం ద్వారా కేటీఆర్ ఆరోపణలను ఖండించింది. అప్పు ఇవ్వలేదని బ్యాంకే స్వయంగా చెప్పినపుడు ఇక కేటీఆర్ ఆరోపించినట్లుగా రు. 10 వేల కోట్లు అప్పు ఎక్కడిది ? బ్రోకర్ సంస్ధ పాత్రేముంది ? రేవంత్ రహస్య మిత్రుడైన బీజేపీ ఎంపీ ఎవరు ?
బీఆర్ఎస్ కూడా ఇదేపనిచేసిందా ?
పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ కూడా వందల ఎకరాలను కుదవపెట్టి లేదా వేలంలో అమ్మి నిధులు సమీకరించింది. భూములను కుదవపెట్టినపుడు లేదా వేలంలో అమ్మినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఎవరైనా బ్రోకర్లు పనిచేశారా అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala) ప్రశ్నించారు. కేసీఆర్(KCR) ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అత్యంత విలువైన 180 ఎకరాలను అమ్మేసినట్లుగా ఎంపీ ఆరోపించారు. తమ హయాంలో భూములు అమ్మి నిధులు సమీకరించటం తప్పుకానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదేపనిచేస్తే తప్పు ఎలాగవుతుందని ఎంపీ గట్టిగానే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ కౌంటర్ కు కేటీఆర్ నుండి సమాధానంలేదు.