సింగపూర్‌ నుంచి సీఎం ఏమి సాధిస్తారు

సింగపూర్‌ ప్రభుత్వం అమరావతిపై సానుకూలంగా ఉందా? అక్కడి పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తారా?;

Update: 2025-07-13 13:32 GMT

సింగపూర్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను సాధిస్తారా? అనేది చర్చగా మారింది. గతంలో చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు సింగపూర్‌లోని నాటి సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలతోను, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతోను చర్చలు జరిపి, అమరావతికి పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు. సింగపూర్‌ కన్సార్టియం పేరుతో కొన్ని సంస్థలు ముందుకొచ్చినా.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ సంస్థలు వెనకడు వేశాయి. గత ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టడం వల్ల సింగపూర్‌ కన్సార్టియం వంటి సంస్థలు ఏమి చేయాలో దిక్కుతోచక వెనుదిరిగాయి. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నందున సింగపూర్‌ కన్సార్టియంతో మాట్లాడి అమరావతి నిర్మాణంలో భాగస్వామిని చేశారు. కొన్ని అంశాలపై సలహాలు, సూచనలు అందించడంతో పాటుగా డీపీఆర్‌లను సిద్ధం చేయడం వంటి పనుల్లో కన్సార్టియం నిమగ్నమైంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మొదటి సారి సింగపూర్‌ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవడం, పెట్టుబడులే లక్ష్యంగా అడుగులు వేస్తుండటం, ఆయనతో పాటు మరి కొంత మంది మంత్రులు, అధికారులను తీసుకెళ్లేందుకు రెడీ అవ్వడం చూస్తోంటే.. ఎలాగైనా నిధులు రాబట్టాలనే ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతోంది.
అయితే అక్కడి సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టిస్తారా? లేదా? అప్పులు తీసుకోవాడానికైనా అడుగులు వేస్తారా? సింగపూర్‌లోని కంపెనీలు కానీ, బ్యాంకులు కానీ అమరావతిపై గతంలో చూపిన శ్రద్ధ ఈ సారి చూపిస్తాయా? అనేది కూడా చర్చగానే ఉంది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సింగపూర్‌ ప్రభుత్వంలోని ఈశ్వరన్‌ అనే మంత్రితో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ఆయనతో చేసుకున్న కొన్ని ఒప్పందాలను సింగపూర్‌ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ మంత్రి సింగపూర్‌ ప్రభుత్వానికి దూరంగా ఉన్నారని, ఆయనకు సంబంధించిన సంస్థలపై చంద్రబాబు దృష్టి పెట్టే ఆలోచనలో లేరనే చర్చ కూడా జరుగుతోంది.
ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారులు కాటమినేని భాస్కర్, ఎన్‌ యువరాజ్, కార్తికేయ మిశ్రా, కె కన్నబాబు, సాయికాంత్‌ వర్మలు కూడా సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.
Tags:    

Similar News