నిన్ను మేమేమీ అనం లేబ్బా... నేను కూడా రానులేప్పా..

అడ్డగిస్తామన్నళ్లే వెనకగడుగు వేశారు. జగన్ కూడా అదే చేశారు. చూశారా.. ప్రమాణపత్రం ఇవ్వాల్సొస్తుందని తగ్గాడు. అని కొత్తపాట అందుకుంటే, యాత్రికుల తీరు మరోలా ఉంది.

Update: 2024-09-29 08:26 GMT

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) రంగంలోకి దిగింది. ఈ నెల 18వ తేదీ నుంచి తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారం దేశవ్యాపిత చర్చకు దారితీసింది.

తిరపతిలో జగన్ ను అడుగు పెట్టనివ్వం. ఆయనతోనే పవిత్రత గబ్బుగబ్బయ్యింది. ఆయన ఈడికి వస్తే అడ్డుకుంటామబ్బా. దేవుడిపై నమ్మకం ఉండాదని ఆయన రాసియ్యాల. అని టీడీపీ నేతలు హెచ్చరించారు. అధికార పార్టీలో ఉండే బీజేపీ, జనసేన వాళ్లు కూడా గర్జించారు.

"మీరు ఎన్నైనా చెప్పండి ప్పా. నేను తిరుపతి వస్తా. తిరమలకు పోతా. వెంకటేశ్వరసామిని చూసి, దండం పెట్టుకుని వస్తా. మీరు ఏం చేస్తారో చేసుకోండి ప్పా" అని వైస్. జగన్ మొండిపట్టు పట్టారు. ఆయన పార్టీ వైఎస్సార్ ఓళ్లు కూడా యాడేడి నుంచో బయలుదేరినారు. వాళ్లందరినీ యాడికాడ పోలీసోళ్లు అడ్డగించినారు. ఇదంతా జరగతానే ఉండాది.. రెండు రోజుల కిందట ఆ టైం రానే వచ్చింది.

ఏమైందో ఏమోబ్బా.. ఉన్నట్టుండి

కోడిపుంజు పందేనికి కాలుదువ్వినట్టు రచ్చకు రెడీగా ఉన్నోళ్లందరూ ఉన్నట్టుండి మాట మార్చినారు.

"జగన్.. నిన్ను మేమే ఏమీ అనంలేబ్బా. దేవుడి కాడికి వచ్చి దండం పెట్టుకోని పోబ్బా. నువ్వు పోయేటప్పుడు నిన్ను చూసి గెట్టిగా అరుస్తాం. అంతే ఇంకేమీ చేయంలేబ్బో" అని చెప్పినారు. దీంతో వాళ్ల మధ్య సాగిన మాటలన్నీ పాలపొంగులా చల్లారాయి. చిటపటలు మాత్రం ఆగడం లేదు.

ఏమి జరిగిందో ఏమో అంతా ఆ కొండ దేవుడికే తెలియాల!

ఆయన జగనేమి తక్కువ తిన్నాడా? ఆయన అంతే చేసినాడు. సరేలో అన్న..! నేను కూడా తిరపతి రానులేప్పా.. మీరు గమ్మనే ఉండిండి. నా పాటికి నేను తాడేపల్లి ఇంట్లోనే ఉంటా. అని జగన్ కూడా సల్లగా ఉండిపోయినాడు.

అంతేబ్బా..

తిరపతిలో ఏమి జరగతాదా.. టీడీపీ నాయకుడు నరసింహ యాదవ్ ఏమి చేస్తాడో సామీ. అని అంతా అనుకున్నారు. ఇదిట్టా ఉంటే...

ఈయనపై మాజీ తిరపతి మాజీ ఎమ్మెల్యే సదవలవాడ కిట్టమూర్తి ఎప్పుడో ఒకమాట చెప్పినట్లు గురుతు.

"నరసింహ యాదవ్ ఇల్లు ఉండే ఈది మొదిట్లోకి పోయ్యి గట్టిగా అరిస్తే. సందేళ దాక బయటికి రాడు" అని కిట్టమూర్తి అప్పుట్లో ఎతగాళి సేసినాడు.

ఇదంతా ఇట్టా ఉంటే..

ఊరికే ఉంటే ఊరా? పేరా? చెప్పినట్టు.. ఎట్టాంటి సంబంధం లేకుండానే హైదరాబాద్ కాడి నుంచి ఒకామె, అదేబ్బా కమలం పువ్వు గుర్తామె కొంపెల్లి మాధవీలత... వచ్చింది. తెలుగోళ్లకు నేనే పెద్ద దిక్కు. అని చెప్పే ఆమె రావడంతో భగవంతుడా? ఏమి జరగతాదో అని అందరూ బిక్కసచ్చినారు. దేవుడి కాడా ఈ రచ్చ ఏంది సామీ అని తిరపతోళ్లంతా ఇదే మాట్లాడుకుంటా ఉండినారబ్బా.

ఎవురికి వోళ్లు. పక్కకు సల్లుకున్నారు. అంతే,

తిరుపతికి జగన్ వచ్చింది లేదు. ఈడ తెలుగుదేశం, జనసేన, బీజేపోళ్లు ఆయనను అడ్డుకునింది లేదు. అంతా సప్పగా... సల్లగా మారిపోయినాది.

దేవుడంటే వోళ్లెవురికి భయం లేదబ్బా. లెక్క.. జమ లేదు. దేవుడి కాడ ఈ చర్చ ఏందిబ్బా.. లేకుంటే అనేవోళ్లు చాలా మంది ఉండారు.

ఎత్తిపొడుపు మాటలు...

ఇదంతా ఇట్టా ఉంటే.. యాడికాడ మల్లా సల్లంగా అయిపోతే మానం పోతాది అనుకుంటా ఉండారో ఏమో...

జగన్ కు దేవుడిపై నమ్మకం లేదబ్బా. కాగితంపై సంతకం చేయాల్సొస్తాదని తిరపతికి రాలేదు అని మళ్లీ కొత్త పాట పాడతా ఉండారు.

సీఎం చంద్రన్న ఏమంటాడంటే..

"జగన్ ను తిరపతికి పోవద్దని మేము చెప్పినామా. ఎవురు చెప్పినారుబ్బా" అని చంద్రబాబే అంటాడు.

"నేను తిరపతికి పోతా అంటే అడ్డుకుంటారప్పా" అని రాజసేఖరరెడ్డి కొడుకు వైఎస్. జగన్ అనబట్టే.

"కాదుబ్బా. వస్తా అనింది నువ్వే. మల్లీ రానులే అనేది నువ్వే" నీకు వకమాట గుర్తు సేయాల...

ఎలచ్చన్లప్పుడు, అంతకుముందు సోనియాగాంధీతో దైర్నంగా కొట్లాడినందుకే కదా నువ్వు హీరో అని అందరూ అనుకుంటిరి? ఇప్పుడేమైందబ్బా నువ్వు బైబుల్ పక్కన పెట్టు, నెత్తిన మన అందేద్కర్ సార్ రాసిన పుస్తకం అదేబ్బా.. రాజ్జాంగం నెత్తిన పెట్టుకుని రా... ఎవురన్నా అడిగితే దాంట్ల ఏమి రాసి ఉండాదో సదివి చెప్పు. సరిపోలా?

ఇంకోమాట చెబుతా..

జగనన్నో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పోలీసోళ్లను పంపించి అడ్డుకుంటివి. అప్పుడు సీఎం చంద్రన్న కొడుకు లోకేసుబాబు ఏమి చేసినాడో గుర్తు చేసుకో... యాడ అడ్డపడినా, రాజ్జాంగం బుక్కు సూపిచ్చి అడగతా ఉంటే పోలీసోళ్లు ఏమి జేస్తిరిబ్బా. నోరు మూసేయలా? నువ్వు కూడా అదే పని ఎందుకు సేయలేదుబ్బా. నీకు తెలియదని కాదులే. మాట వరసకు సెబుతాండా.

ప్రశాంతం... ఆగని చిటపటలు

మొత్తంమీద ఎవరికి వారు సైలెంట్ కావడం కూడా ఆధ్మాత్మిక తిరుపతి ప్రశాంతమైంది. కానీ, లడ్డూ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఏదో రూపంలో ఆరోపణలు ప్రత్యారోణలకు కేంద్రంగానే వాడుకోవడంలో తగ్గేదే లేదంటున్నారు.

"తిరుమలకు వెళ్లడానికి నాకే ఈ పరిస్థితి ఉంటే, దళితుల మాటేంటి" అని జగన్ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ఆక్షేపించారు. ఇందులో దళితకార్డు వాడడం ఏమిటని ప్రశ్నించారు. "నేను దళితబిడ్డనే బైబిల్ బ్యాగులో ఉన్నదనే నా మాటలతో వీడియో వైరల్ కావడం వల్లే నేను బోర్డు పదవిని కూడా వదులుకున్నా" అని గుర్తు చేస్తూనే..

"వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎంతమంది దళితులకు సభ్యత్వం కల్పించారు?" అని కూడా రాష్ట్ర హోంమంత్రి మాజీ సీఎం వైఎస్. జగన్ ను సూటిగా ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే...

లడ్డూ ప్రసాదం వ్యవహారంపై యాత్రికులు ఏమాత్రం పట్టంచుకోవడం లేదనేది సత్యం. అంతా దేవుడిదే భారం అంటూ, కలియుగ దైవాన్ని నమ్ముకున్నారు. అందుకు నిదర్ధనం ఆరోపణలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నెల 22వ తేదీ తిరుమల శ్రీవారిని 82,648 భక్తులు దర్శంచుకున్నారు. అక్కడి నుంచి వరుసగా 67,616 మంది, 77,933 మంది, 61,328మంది, 64,158 మంది దర్శించుకున్నారు. వారి ద్వారా తిరుమల శ్రీవారికి హుండీ కానుకల ద్వారా 22వ తేదీ నుంచి వరుసగా రూ.4.57 కోట్లు, రూ.3.89 కోట్లు, రూ. 3.50 కోట్లు, రూ.3. 84 కోట్లు, రూ. 3.31 కోట్ల ఆదాయం లభించింది. లడ్డూలు కూడా రోజుకు కనీసంగా రెండు లక్షలకు ఏమాత్రం తగ్గకుండా కొనుగోలు చేశారు. అంటే, రాజకీయ నాయకుల మాటలు, ఆరోపణలు యాత్రికులపై ప్రభావం చూపడం లేదనే కాదు. వాటిని విశ్వసించడం లేదనే విషయం స్పష్టం అవుతుంది.

ఈ పరిస్థితుల్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయం నిగ్గు తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ ప్రతిఠీ సారధ్యంలో ఏర్పాటైన సిట్ శనివారం తిరుపతికి వచ్చింది. మొదట సమావేశం ఆదివారం తిరుపతిలో జరింగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయాలను ఇందులో చర్చించనున్నారు. ఎన్ని రోజుల లోపు దర్యాప్తు పూర్తి చేస్తారు? ఏమి తేలుస్తారనేది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News