తెలంగాణ మ్యూజియంలో చిక్కుకు పోయిన ఆంధ్రుల చరిత్ర
తెలంగాణా స్టేట్ మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనవాళ్ళు ఏం వున్నాయో ఓ సారి చూద్దామా...
ఆంధ్రప్రదేశ్ చరిత్ర...తెలంగాణలోని స్టేట్ మ్యూజియంలో చిక్కుకుపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పుష్కర కాలం అవుతున్నప్పట్టికీ పురావస్తుశాఖకు చెందిన ఆస్తుల్ని తీసుకోవడంలో ఆంధ్ర పాలకులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర గ్రంథాలయం, మ్యూజియం నిర్మాణ విషయం తప్ప ఏపి ప్రభుత్వం అన్నింటి గురించి మాట్లాడుతోంది. వివిధ జిల్లాల్లో 14 మ్యూజియాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, అవి దయనీయమైన స్థితిలో ఉన్నాయి. తెలంగాణా నుంచి తెచ్చుకునే చారిత్రక సంపదను భద్రపరచడానికి వాటిలో ఏ ఒక్కటీ సరైన సౌకర్యాలతో లేదనేది బహిరంగ రహస్యం. అమూల్యమైన పురాతన వస్తువుల తరలింపు పెద్ద ఖర్చుతో కూడిన పని కాబట్టి ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. 2015 లో అప్పట్టి ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అయితే ఐఎఎస్ అధికారి వాణి మోహన్ హయాంలో పురావస్తు సంపద విభజన జరగలేదు. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు.
ఇంతకీ తెలంగాణా మ్యూజియంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనవాళ్ళు ఏం వున్నాయో ఓ సారి చూద్దాం..
క్రీ.శ. 3వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు వివిధ రాజ్యాలు జారీ చేసిన 2 లక్షల 95 వేల నాణేల సేకరణను హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో చూడవచ్చు. అయితే శాతవాహనుల కాలం నుంచి 18వ శతాబ్దం వరకు ఆంధ్రుల చరిత్రను చాటి చెప్పే ఆయా కాలాల రాజులకు సంబంధించిన బంగారు, వెండి, రాగి నాణేలు ఇందులో ఉన్నాయి. "ఏపీకి చెందిన నాణేల్ని విభజించి పెట్టాం. ఆంధ్రుల చారిత్రక సంపదనంతా తెలంగాణా మ్యూజియం లాకర్‌లో మూలుగుతోంది. మేం ఇవ్వడానికి సిద్దంగా వున్నాం. తీసుకుని వెళ్ళడానికి ఆంధ్ర వాళ్ళే రావడం లేదు," అని అధికారులు చెబుతున్నారు.
అప్పట్లో అంటే, 1980లో విశాఖపట్నం శివారులోని బావి కొండగుట్టపై జరిపిన తవ్వకాల్లో మహాచైత్యం, బౌద్ధ విహారం వెలుగుచూశాయి. అక్కడ దక్షిణ దిక్కున "చిన్నపాటి రాతి స్థూపం కింద లభించిన మట్టిపాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్న వస్తువులతో పాటు మరో పాత్రలో బూడిద ముక్కలు, చిన్న ఎముక లభించాయి. వీటిని అత్యంత విలువైన బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు గుర్తించి హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. విభజనలో భాగంగా వీటిని ఏపీకి తీసుకుని వెళ్ళాలి. బుద్ధుడి అస్తికలంటే వాటిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తూ వుంటారు. విలువకట్టలేని అమూల్యమైన సంపద అది. అమరావతి రాజధాని అంటూ గొప్పగా చెప్పుకుంటారు కానీ, బుద్ధుడి అస్తికల్ని తీసుకువెళ్ళి మ్యూజియంలో ప్రదర్శించాలనే స్పృహ పాలకుల్లో కనిపించడం లేదు," అని ఏపీ ఆర్కియాలజీ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రులకు సంబంధించిన అద్భుతమైన కళా సంపద, అపురూప శిల్పాలు, పంచలోహ విగ్రహాలు, రాతి విగ్రహాలు, పేయింటింగ్స్, శాసనాలు, కుండలు, జైన, బౌద్ధ గ్రంథాలతో పాటు, ఆంధ్ర దేశ, ఆంధ్ర జాతి ప్రస్తావనకు సంబంధించిన ఆధారాలు ఎన్నో ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఆంధ్ర అనే పదాన్ని జాతి పరంగా, దేశ పరంగా, భాషాపరంగా అనేక రచనలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి శాసనం అశోకుడి 13వ శిలాశాసనం (దౌళి/జౌగాడ శాసనం), దీంతోపాటు 'ఎర్రగుడి', 'రాజుల మందగిరి' శాసనాల్ని ఇక్కడ చూడవచ్చు.
అరుదైన మధ్య యుగపు నాటి అబ్దుల్ రహ్మన్ సోగతాయి పెయింటింగ్స్ ఇక్కడే ఉన్నాయి. గద్వాల సంస్థాన కాలానికి చెందిన కూచిపూడి జడ సహా మధ్యయుగానికి సంబంధించిన అనేక నగలు ఉన్నాయి.
వేల ఏళ్ల ప్రాచీన చరిత్ర ఆంధ్ర నేలకు సొంతం. బౌద్ధ మతం విరాజిల్లిన ప్రాంతం. అలనాటి శిల్పాలు, శాసనాలు బ్రిటీషర్ల కాలంలో బయటపడ్డాయి. ఆ అపురూప కళాఖండాలను బ్రిటీష్ వాళ్ళు లండన్ తరలించుకు పోయారు . 120కి పైగా మార్బుల్ రాయితో తయారుచేసిన కళాఖండాలను, శాసనాలను భద్రంగా లండన్ మ్యూజియంలో ఉంచారు. ఆ అమరావతి ఆనవాళ్లు.. ఇప్పటికీ అక్కడి మ్యూజియంలో చూడొచ్చు. అయితే వాటిని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఆర్కీయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుంది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పక్క రాష్ట్రంలో వున్న ఆంధ్ర ఆనవాళ్లను తెచ్చుకోవడంలో ఆసక్తి చూపక పోవడం దారుణమైన విషయమేమరి.