ఏపీపై ఆ ముద్ర పోయేలా చర్చిస్తాం

అమరావతి మీద వైసీపీ దుష్ప్రచారం నమ్మొద్దని మంత్రి నారాయణ అన్నారు.;

Update: 2025-07-25 08:11 GMT

సింగపూర్‌ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ మీద సింగపూర్‌ ప్రభుత్వానికి ఉన్న ముద్ర పోయేలా అక్కడి ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తామని మంత్రి నారాయణ అన్నారు. గురువారం ఆయన అమరావతిలో పర్యటించారు. అమరావతి ప్రాంతమైన నేలపాడులో జరుగుతున్న గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల భవనాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గ్రూప్‌–డి అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణాలు, హ్యాపీనెస్ట్‌ టవర్ల పనులపై ఆయన ఆరా తీశారు. వేగంగా నిర్మాణాల పనులు చేపట్టే విధంగా కాంట్రాక్టు సంస్థలను మంత్రి నారాయణ ఆదేశించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సింగపూర్‌ అధికారులపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిందని, వైసీపీ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్, సింగపూర్‌ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. తమ సింగపూర్‌ పర్యటనలో ఏపీపై ఉన్న ఆ ముద్ర పోయేలా చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.
అమరావతి మీద వైసీపీ, ఆ పార్టీ నేతలు దుష్ప్రచారాలు చేస్తోందని, ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అమరావతిలో నిర్మాణాలు ఏమీ జరగడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, మూడేళ్లల్లో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నాలుగు వేల ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి అవుతుందన్నారు. ఇదే ప్రాంతంలో అధికారుల, ఉద్యోగుల క్వార్టర్స్‌ను పూర్తి అవుతాయని, భవనాలన్నీ పూర్తి అయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత రైతుల రిటర్నబుల్‌ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభిస్తామన్నారు.
Tags:    

Similar News