మహిళలు ఎలా బాధపడ్డారో చరిత్రలో చూశామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్ అన్నారు. మరి ముఖ్యంగా ఈ దేశంలో సతి సహగమనం అనే ఆచారం ఉండేదని, సామాజిక సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ కృషి వల్ల ఆ ఆచారం నిషేధించబడిందన్నారు. అనేక సంవత్సరాలుగా మహిళల బాధలు, వేదనలు తగ్గినప్పటికీ, మహిళాలపై వివక్ష పూర్తిగా తొలగించబడలేదన్నారు. సేఫ్‌గార్డింగ్ ది గర్ల్ చైల్డ్ అంశంపై స్టేట్ లెవల్ స్టేక్‌హోల్డర్స్ కన్సల్‌టేషన్ – 2025 కార్యక్రం ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. దీనికి జస్టిస్ ధీరజ్ సింగ్ థాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కుటుంబాలలో ఒక బాలికను బాధ్యతగా కాకుండా ఒక భారంగా పరిగణిస్తారు. బాలికలు కుటుంబానికి సహకరించలేరని, అందువల్ల వీలైనంత త్వరగా ఆమెకు వివాహం చేయాలనే ప్రయత్నాలు జరుగుతాయన్నారు.
అందువలన బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. బాలికల రక్షణ గురించి చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ఉన్నప్పటికీ, నిజ జీవితంలో అనుకున్నంత స్థాయిలో కార్యరూపం జరగడం లేదన్నారు. ప్రపంచ జాబితా ప్రకారం నేడు 90 మిలియన్ల మంది పిల్లలు లైంగిక హింసను అనుభవిస్తున్నారన్నారు, ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు, పురుషులు వారి బాల్యంలో అలాంటి హింసకు గురయ్యారన్నారు. 1.6 బిలియన్ల మంది పిల్లలు తప్పకుండా వారి ఇంట్లో సంరక్షకుల ద్వారా హింసాత్మక శిక్షను భరిస్తున్నారన్నారు. హింసాత్మక క్రమశిక్షణను అనుభవించే పిల్లలలో మూడింట రెండు వంతులు శారీరక శిక్షకు, మానసిక దూషణకు గురవుతున్నారన్నారు. నలుగురు చిన్న పిల్లల్లో ముగ్గురు తమ సంరక్షకుల ద్వారా క్రమం తప్పకుండా హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలో హింస ఉందని, దాదాపు 130 మిలియన్లు, 13 నుండి 15 సంవత్సరాల వయస్సు గల ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులు బెదిరింపులకు గురవుతున్నారన్నారు.. ప్రపంచంలోని పిల్లలలో 86% మందిని చట్టం ద్వారా శారీరక శిక్ష నుండి పూర్తిగా రక్షించబడలేదన్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో 30 దేశాల్లోని యువకులలో మూడింట ఒక వంతు మంది ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నట్లు నివేదించారు. 2020లో 153,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లు బాల లైంగిక వేధింపుల చిత్రాలను కలిగి ఉన్నట్లు నివేదించబడ్డాయని, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 16% ఎక్కువని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లైంగిక హింస విస్తృతంగా ఉందని, సుమారుగా 15 మిలియన్ల మంది కౌమార బాలికలు 15 నుండి 19 సంవత్సరాల మధ్య బలవంతపు లైంగిక సంబంధాన్ని లేదా ఇతర బలవంతపు లైంగిక చర్యలను వారి జీవితకాలంలో అనుభవించారని తెలిపారు.
అంగవైకల్యాలు కలిగిన పిల్లలు వైకల్యం లేని పిల్లల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ హింసకు గురయ్యే అవకాశం ఉందన్నారు. నేషనల్ క్రై మ్ బ్యూరో నివేదిక ప్రకారం వారిలో 90% మంది కుటుంబానికి తెలిసిన వారిచే దాడికి గురయ్యారని, ఇది చాలా భయంకరమైనదన్నారు. కాబట్టి సరైనది ఏమిటో, తప్పేమిటో తెలియని చిన్న పిల్లలు అర్థం చేసుకోలేని వారు కుటుంబానికి తెలిసిన వారిచే దాడి చేయబడతారు, దోపిడీ చేయబడతారు. వారు దగ్గరి బంధువు కావచ్చు, ఇంట్లో పనిమనిషి కూడా కావచ్చు. కాబట్టి పిల్లలను బయటి వ్యక్తుల నుండి రక్షించడమే కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అంతే కాకుండా విద్యాశాఖ పోక్సో చట్టం గురించి విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని, ముఖ్యంగా తొమ్మిది, 10వ తరగతిలోని బాలురకు పోక్సో చట్టంలోని నిబంధనల యొక్క తీవ్రమైన ప్రభావాల గురించి సున్నితంగా అవగాహనా కల్పించడం చాల అవసరమన్నారు.
ఎందుకంటే పిల్లల్లో చాలా మంది ఆ యుక్తవయసు కాలంలో ఇష్టానికి లోనై, పోక్సో చట్టంలోని కఠినమైన నిబంధనలకి వ్యతిరేకంగా ప్రవర్తించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే అవకాసం ఉందన్నారు. లింగ వివక్ష తగ్గాలని, ఒక బాలిక ఉంటే, ఆమె ఒక మగపిల్లవాడి కంటే ఎక్కువగా తల్లిదండ్రులకు సేవ చేయగలదని అన్నారు. 18 సంవత్సరాల వరకు ఉన్న బాలికలను వారి చదువులను కొనసాగించడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆడపిల్ల పాఠశాలలో కానీ, ఇంట్లో ఇరుగు పొరుగు వారి ద్వారా బాధపడుతుంటే, లైంగిక వేధింపులు జరిగితే, బాలికను రక్షించడానికి హెల్ప్ లైన్ నంబర్ 1981 లేదా 1098 ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.