Unity in TTD | ఐక్యతారాగం ఆలపించిన టీటీడీ చైర్మన్, ఈఓ

తమ మధ్య భేదాభిప్రాయాలు లేవు. టీటీడీపై బురదజల్లే వార్తలు రాసే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు.;

Update: 2025-01-13 09:27 GMT

తిరుమల శ్రీవారి సేవలో అధికారులు, పాలక మండలి సభ్యుల మధ్య సమన్వయంతో పని చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వ్యాఖ్యానించారు. తనకు ఈఓ, అదనపు ఈఓ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీఆర్ నాయుడు చెప్పారు.

వైకుంఠద్వార దర్శనాల సందర్భంగా బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తిరుపతిలోనే సీఎం ఎన్. చంద్రబాబు స్వయంగా సమీక్షించారు. అధికారుల మధ్య సమన్వయం లేదనే విషయంలో సీఎం చంద్రబాబు అధికారులపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు. ప్రజా కోర్టులోనే ప్రశ్నల వర్షం కురిపించి, తీవ్రంగా మందలించారు.
ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనంలో పాలక మండలి సభ్యులు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించిన సందర్భంలో కూడా
"నాకు సంప్రదించకుండానే నిర్ణయాలు అమలు చేస్తున్నారు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆరోపించడం. దీనికి ప్రతిగా ఈఓ జే. శ్యామలరావు కూడా ధీటుగానే ఘాటుగా స్పందించిన వ్యవహారం సీఎం చంద్రబాబు సమక్షంలోనే గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వారిద్దరినీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లు కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలకు మంత్రులు, జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, టీటీడీ సీనియర్ అధికారులే సాక్ష్యం. కాగా, ఆ తరువాత సీఎం చంద్రబాబు ఏ మంత్రం వేశారో కానీ, ఆయన సొంతవూరు నారావారిపల్లెలో ఉండగానే..
తిరుమలలో సంక్రాంతి సందర్భంగా సోమవారం టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు.తొక్కిసలాటలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బోర్డు సభ్యులతో ఏర్పాటు చేసిన రెండు బృందాలు పరిహారం అందజేశాయని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
విబేధాలు లేవు...

"టీటీడీ పాలక మండలి, అధికారుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి" అని కొన్ని ప్రసార, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్. నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా చేతిలో ఉందని ఇస్టానుసారంగా అసత్య వార్తలు ప్రసారం చేస్తే, చర్యలు తప్పవని ఆయన ఆంధ్రజ్యోతి పేరు ప్రస్తావించకుండా హెచ్చరించారు. ఏ పత్రిక, మీడియా అలా రాసింది? ప్రచారం చేసిందనే విషయాన్ని చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.
"తిరుమల కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన ధార్మిక సంస్థ. వార్తలు రాయడం, ప్రసారం చేయడంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుంటే మంచిది" అని కూడా సూచనతో కూడాని సలహా ఇచ్చారు.
ఆధారాలు లేని వార్తలు రాస్తే చర్చలు తప్పవని అన్నారు. అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటే, యాత్రికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నట్లు బీఆర్. నాయుడు చెప్పారు.
ఒత్తిడి వల్ల కుదరలేదు..

తిరుమలపై సామాజిక మాధ్యమాల్లో ఇస్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఈఓ శ్యామలరావు అభ్యంతరం తెలిపారు. వైకుంఠ ద్వర దర్శనం ఏర్పాట్లలో ఉండిపోవడంతో అలాంటి వార్తలు పట్టించుకోలేదని, ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. సమన్వయ లోపం ఉందనడం అర్ధరహితమన్నారు. చైర్మన్ తో విబేధించారనడంలో వాస్తవం లేదన్నారు.
" తిరుపతి లొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి" అని శ్యామలరావు స్పష్టం చేశారు.
టీడీపీ కూటమి వచ్చాక అనధికార వ్యక్తుల ప్రమేయం పెరిగిందనడం సమంజసం కాదన్నారు. వివిధ రంగాల్లో నిపుణులు, అనుభవాలను ఉపయోగించుకోవడానికి సూచనలు తీసుకుంటున్నట్లు శ్యామలరావు వివరించారు. అంతమాత్రాన టీటీడీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారనడం సరైంది కాదని ఆయన అభ్యంతరం తెలిపారు.
Tags:    

Similar News