ధ్వజస్తంభాల కోసం.. టీటీడీ దివ్యవృక్షాల ప్రాజెక్టు

100 ఎకరాల్లో వనాలు పెంచేందుకు ప్రణాళిక.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-14 02:00 GMT

ఆలయాల్లో మూలమూర్తిని దర్శించుకోవడానికి ముందు మహద్వారానికి ప్రాధాన్యత ఉంది. ఆలయంలోకి వెళ్లగానే ధ్వజస్తంభానికి కూడా విశిష్టత ఉంది. ధ్వజస్తంభం ఏర్పాటుకు ఓ  చరిత్ర ఉంది. ఆలయాల ముందు ప్రతిష్టించే ధ్వంజస్తంభాల కోసం టీటీడీ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది. 

టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద ధ్వజస్తంభాల కోసం దివ్యవృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. 

"దేశంలో మొదటిసారి ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీటం వేశాం. దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం" అని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో పెంచే వనాలు, చెట్లుగా ఎదగడానికి కార్యాచరణ అమలు చేయనున్నట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు.

"ఈ విశిష్ట ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ప్రాచీన, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగామైన హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభాలకు ప్రాధాన్యత ఉంది. ఈ ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచాలని నిర్ణయించింది. వాటిని పరిరక్షించి, వినియోగిస్తాం" అని బీఆర్. నాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని ఆయన చెప్పారు. 
ధ్వజస్తంభం ప్రాధాన్యం
ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది.
ఆగమశాస్త్రాల ప్రకారం, ధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించి, ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు.
ధ్వజస్తంభానికి ఉపయోగించే చెట్టు
ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి.
పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు.
రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాలోన్ని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది.
టీటీడీ దూరదృష్టి
దేశంలో 60కి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో అనేక  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను టీటీడీ పరిగణలోకి తీసుకున్నది.  ఆలయాలకు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దివ్య వృక్షాల ప్రాజెక్టును దూరదృష్టితో ప్రారంభిస్తోందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశార. 
ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో టీటీడీ నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
దివ్యవృక్షాల ప్రాజెక్టు
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.
Tags:    

Similar News