కీలకమైన వేళ.. టీటీడీ బోర్డు మీట్ వాయిదా
బ్రహ్మెత్సవాల నిర్వహణపై సమీక్షలు కూడా...;
By : SSV Bhaskar Rao
Update: 2025-09-09 06:07 GMT
శ్రీవారి బ్రహ్మోత్సవాలు 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కీలకమైన సమయంలో ముందుగా నిర్ణయించిన ఈ నెల పదో తేదీ జరగాల్సిన టీటీడీ పాలక మండలి సమావేశం వాయిదా పడింది. టీటీడీ ఈఓ జే. శ్యామలరావు బదిలీ కారణంగానే అని ప్రచారం జరుగుతోంది. కానీ,
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చూసిన "సూపర్ -6 సూపర్ హిట్" పేరిట అనంతపురంలో బుధవారం సక్సెస్ మీట్ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సీఎం నారా చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా హాజరు కానున్నారు. ఈ సభకు హాజరుకావడానికి నేతల తోపాటు టీటీడీ బోర్డు చైర్మన్, బీఆర్. నాయుడు సభ్యులు కూడా హాజరుకానున్నారు. దీంతోనే టీటీడీ బోర్డు మీటింగ్ వాయిదా పడింది.
టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత జీ. భానుప్రకాష్ రెడ్డి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో ఇదే విషయం చెప్పారు.
"అనంతపురంలో జరిగే సభకు మూడు పార్టీల నుంచి నాయకులు హాజరవుతారు. మేము కూడా వెళున్నాం" అని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు.
సింఘాల్ వచ్చాకే...?
టీటీడీ కొత్త ఈఓ అశోక్ కుమార్ సింఘాల బాధ్యతలు స్వీకరించిన తరువాతే బోర్డు మీటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ కు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో, టీటీడీ పాలక మండలిలో తీసుకునే నిర్ణయాలకు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. సుమారు 5,258 కోట్ల రూపాయలతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు తయారు చేసింది. ప్రతి నెలా పదో తేదీ లోపు టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించడం ద్వారా ఆ నెలకు సంబంధించి చేపట్టాల్సిన పనులు, పరిపాలన, యాత్రికుల సదుపాయం, ఇంజినీరింగ్, విద్య, వైద్యరంగాలకు సంబంధించినవే కాకుండా, అత్యవసర పనులకు కూడా ఆమోదం తీసుకుంటారు. అయితే,
14 నెలలకే బదిలీ..
బ్రహ్మోత్సవాలకు ముందు టీటీడీ ఈఓ జే. శ్యామలరావు ఆకస్మికంగా బదిలీ నిర్ణయం ఉద్యోగుల్లో చర్చకు ఆస్కారం కల్పించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన 14 నెలలకే బదిలీ కావడం గమనార్హం. పాలక మండలిలో ప్రధానంగా టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో సఖ్యత కొరవడినట్టు బహిరంగ చర్చ జరుగుతోంది.
టీటీడీ ఈఓగా శ్యామలరావు వచ్చిన 15 రోజుల్లోనే పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా అమలు చేసిన సంస్కరణలు యాత్రికుల నుంచి మన్ననలు అందుకున్నారు. అందులో నిత్యాన్నదానం, శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయించడంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. ఆకస్మిక బదిలీ నేపథ్యంలో బోర్డు మీటింగ్ తో పాటు ఇంకొన్ని కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయని టీటీడీ అధికారుల ద్వారా తెలిసింది.
సమీక్షలు వాయిదా..?
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్యామలరావు మంగళవారం శ్రీవారి ఉత్సవాల నిర్వహణ, యాత్రికుల సదుపాయాలు, అధికారులు, సిబ్బందికి బాధ్యతల వికేంద్రీకరణ వంటి అంశాలపై అధికారులతో సమీక్షకు కార్యక్రమం ముందుగానే ఖరారైంది. ఆయన ఆకస్మిక బదిలీ నేపథ్యంలో ఈ సమీక్షలు కూడా వాయిదా పడినట్లు సమాచారం. ఈఓ సెలవు లేదా ఇతర వ్యక్తిగత పనులపై వెళితే, ఆ బాధ్యతలు అదనపు ఈఓ నిర్వహించేవారు. బాధ్యతలు అప్పగించని స్థితిలో ప్రస్తుత అదనపు ఈఓ సమీక్షలు తిరుమలకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.