కూటమి సర్కారూ కౌలు రైతుల కన్నీళ్లు అపలేకపోయింది..!

ఆంధ్రా కౌలు రైతుల స్థితిగతుల మీద సమగ్ర సర్వే

Update: 2025-10-27 11:49 GMT

ప్రభుత్వాలు మారినా కౌలు రైతుల వెతల కు పరిష్కారం లభించే సూచనలు కనిపించటం లేదు. భూ యాజమానుల నుండి సామాజిక వివక్ష ఎదుర్కుంటూనే ఉన్నారు. అవసరాలకు అప్పు అడిగితే నుండి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రం తక్కువ వడ్డీకి ఇస్తున్నారు. ఇది తాజాగా వెలువడిన కౌలు రైతుల సర్వే వెల్లడించిన విషయాలు.

భూయజనమానులకు ఏవైనా సమస్యలు వస్తే ఉచితంగా సేవలు చేయాల్సి వస్తోందని కూడా చాలా మంది కౌలు రైతులు చెప్పారు . కౌలు రేట్ల విషయం లోనూ ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల సంఘం నిర్వహించిన క్షేత్రస్టాయి సర్వే లో వెల్లడి అయ్యింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 20 మధ్య 26 జిల్లాలలో 3,000 ల మందిని సర్వే చేసి ఈ నివేదిక తయారు చేశారు. అనేక విస్తుపోయే విషయాలు సర్వేలో వెల్లడి అయ్యాయి. ఈ అధయ్యనం నివేదికను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. కౌలు రైతుల్లో దాదాపు 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టి లే.

అధికారం లోకి వచ్చిన ఏడాది కాలం లోనే కౌలు రైతులకు ప్రతిబంధకం గా వున్న ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం 2019 స్థానం లో కొత్త చట్టం తెస్తామని చెప్పిన ఎన్డీయే కూటమి ఆ పనిచేయలేకపోయింది. ఈ విషయం మీద కౌలు రౌతుల్లో చాలా అసంతృప్తి ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

కౌలు రైతుల కు ప్రభుత్వం అన్నీ సౌకర్యాలు రాయితీ అందేలా భూయాజమని సంతకం చేయాలనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన ఈ చట్టంలో ఒకప్రధానాంశం. అయితే భూయజమానులు సిద్దంగా లేరు. దీనితో చట్టం అమలు ఉద్దేశం నెరవేరలేదు. 

ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలు రైతులకు హక్కులు వస్తాయనే ఆందోళన భూయజమానులలో ఉంది. దానిని చట్టం తొలగించలేకపోయిందని ఆ సర్వే లో తేలింది.

85.9 శాతం మంది భూయజమానులు ప్రతి సంవత్సరం ఒకే కౌలు దారునికి ఇస్తున్నారు. 12.3 శాతం వారిని కౌలు దారులను మారుస్తున్నారు. 1.8 శాతం అప్పుడప్పుడు అదే పాతకౌలు దారులకు ఇవ్వకుండా మానేస్తున్నారని సర్వేలో వెల్లడయింది.

రాష్ట్రంలో 20 సంవత్సరాలకు పైగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతులు 35.5 ఉండగా, 11 నుండి 20 సంవత్సరాల వరకు కౌలు చేసిన వారు

17.4 శాతం, 6 నుండి 10 సంవత్సరాలు 20 శాతం, 1 నుండి 5 సంవత్సరాల వరకు 27 శాతం మంది ఉన్నారు.

“ఉమ్మడి రాస్ట్రం లో వుండిన భూ అధీకృత సాగుదారుల చట్టం 2011 ను తొలగించి దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019లో తీసుకువచ్చింది. 2011 చట్టం భూయజమానుల ప్రమేయం లేకుండా కౌలు దారులకు గ్రామ సభ జరిపి గుర్తింపు కార్డు యిచ్చే అవకాశం యిచ్చింది. అయితే 2019 లో వచ్చిన చట్టం ఆ వెసులుబాటును తొలగించింది. కొత్త చట్టం అమలు యజమాని సంతకం పైన ఆధార పడటం తో సరిగ్గా అమలుకు నోచుకోలేదు. 2011 చట్టం ప్రకారం 18.6 శాతం మంది కౌలు కార్డులు పొందగా 2019 వచ్చాక కేవలం 8.8 శాతం మాత్రమే వాటిని పొందారని రైతు స్వరాజ్య వేదిక సర్వే లో తేలింది,” అని ఆ సంస్థ యాక్టివిస్ట్ బి. కొండల రెడ్డి పేర్కొన్నారు.

యజమాని సంతకం అవసరం లేకుండా కౌలు దారులకు హక్కులను కల్పించే చట్టం వుండాలని మేధావులు చేసిన సూచనలను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019 లో పెడచెవిన పెట్టింది.

భూ యజమానులు భూమి పత్రాలు, పాస్‌ పుస్తకాలు తదితర రికార్డులు ఇవ్వకపోవడం వలన 91.4 శాతం కౌలు రైతులు ఇ-పంటలో నమోదు చేసుకోలేకపోయారు. ఇ-పంటలో నమోదు కాకపోవటం చేత 96.2 శాతం మంది కౌలురైతులు పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరలకు అమ్ముకోలేక పోతున్నారు. దీనితో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ (Input subsidy) లు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది అని నేటి రిపోర్ట్ వెల్లడించింది.

కౌలు దారుల ఎందురు?

రాష్ట్రంలో కౌలురైతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు కూడా ధృవీకరిస్తున్నాయి. 2016 లో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఒక నిపుణుల కమిటీ అన్ని రాష్ట్రాల కొరకు ఒక నమూనా కౌలు చట్టాన్ని సిద్దంచేయాలని చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లో కౌలు క్రింద 33.75 శాతం భూమి వుందని ఈ కమిటీ తేల్చింది. 2021 లో పార్లమెంటు లో ఒక ప్రశ్నకు సమాధానంగా దేశ వ్యవసాయ మంత్రి రాష్ట్రం లో 2018 జూన్ నుండి 2019 జూన్ మద్యన 42.4 శాతం కౌలురైతులు ఉన్నట్లు చెప్పారు.

జాతీయ స్థాయిలో నూ నీతి ఆయోగ్ 10.1 శాతం భూమి లీజులో వుందని చెబితే, వ్యవసాయ మంత్రి 17.3 శాతం గా వుందని చెప్పారు.

నీతి ఆయోగ్ రిపోర్ట్ 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ద్వారా వచ్చిన కార్డుల సంఖ్య ను దృష్టి లో ఉంచుకుని 2011-12 లో 1.74 మిలియన్లు గా అంచనా వేసి వారిలో 0.68 మిలియన్ మంది రైతులు కార్డులు తీసుకున్నారని వాళ్ళు పంట రుణాలు యితర సౌకర్యాలు పొందారని చెప్పింది. అయితే ఆ కార్డులు పొందిన వారి సంఖ్య 2012-13 లో 0.41 మిలియన్ లకు తగ్గిపోయిందని తద్వారా 24 శాతం మాత్రమే గుర్తింపు పొందారని చెప్పింది.

అమలు కానీ కూటమి ప్రభుత్వ హామీ:

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డయే కూటమి ప్రభుత్వం ‘ప్రజాగళం’ (Praja Galam) పేరిట విడుదల చేసిన ఎన్నికల మానిఫెస్టో లో కౌలు రైతుల కు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాల తో పాటు పంటల భీమా పథకం వర్తింప చేస్తామని హామీ యిచ్చింది. అయితే, 17 నెలలు కావొస్తున్నా అది కార్యరూపం దాల్చకపోవడం తో కౌలు రైతులు అసంతృప్తితో ఉన్నారు.

ఈ పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అవశేష ఆంధ్రప్రదేశ్లో దాకా కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలను ఏ రాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపారు. పట్టించుకుంటున్నారని కేవలం 6.1 శాతం, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.

87.7 శాతం మంది కౌలురైతులకు గుర్తింపు కార్డులను ప్రభుత్వం ఇవ్వలేదని కేవలం 12.3 శాతంకు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.

కౌలు ఒప్పందాలు యిప్పటికి 92.3 శాతం మాట మీద ఆధారపడే జరుగుతున్నాయని కేవలం 3.9 శాతం మాత్రమే రాత పూర్వకంగా జరుగుతున్నాయని, 2.6 శాతం మాత్రమే రెవెన్యూ రికార్డుల లో నమోదు అవుతున్నాయని నేటి సర్వేలో వెల్లడి అయ్యింది.

“కౌలు రౌతులకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో పంట రుణాలు ఇచేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో వడ్డీవ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. అప్పుల భారం పెరుగుతోంది. ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా కౌలు రైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది, దానితో దళారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది,” అని రిపోర్ట్ చెప్పింది.

వర్షాభావం, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు.

వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సంవత్సరానికి ఎంత అవసరమౌతోందని ప్రశ్నించినప్పుడు 60 వేలకు పైన 34.3శాతం మంది చెప్పారు. 40 వేల నుండి 60 వేల వరకు 23.8 శాతం, 25 వేల నుండి 45 వరకు 34,8 శాతం, 10 వేల నుండి 25 వేల వరకు కావలసి వస్తుందని 7.2 శాతం మంది తెలిపారు. ఆ పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్థుల నుండి 38.1 శాతం, రైస్ మిల్లర్లు, దళారులు, వ్యాపారస్థుల నుండి 28.8శాతం, కోఆపరేటివ్ బ్యాంకులు నుండి 13.5 శాతం, భూయజమానుల నుండి 12.7 శాతం, జాతీయ బ్యాంకుల పైన 2.5 శాతం మంది ఆధారపడుతున్నారు.

ఆ డబ్బు పై ప్రైవేట్ వ్యక్తులకు అత్యధిక శాతం అంటే నూటికి 2 రూపాయలు చెల్లిస్తున్నామని 79 శాతం మంది చెబితే, రూపాయిన్నర చెల్లిస్తున్నామని 6.7శాతం, ఒకరూపాయి చెల్లిస్తున్నామని 1.8 మంది చెప్పారు. అత్యతికంగా అంటే 3 రూపాయలు దాకా చెల్లించే వారు 8.2 శాతం దాకా ఉన్నారు.

ఇకపోతే ఎకరానికి పెట్టుబడి 60 వేల పైన 26.5 శాతం, 40 వేల నుండి 60 వేల వరకు 21.5 శాతం, 20 వేల నుండి 40 వేల వరకు 33.8 శాతం, 10 వేల నుండి 20 వేల వరకు 13.3 శాతం పెడుతున్నట్లు వెల్లడైంది.

ఆదాయం ఒక ఎకరానికి 25 వేల పైన ఆదాయం వస్తోందని 28.1, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది తెలుపగా, నష్టం వస్తోందని 15.4 శాతం మంది తెలిపారు. యిందులో కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని కూడా కౌలు రైతులు తెలిపారు. 

 

ఇక వారి అప్పు గురించి ప్రశ్నించగా 5 లక్షల పైన 20.4 శాతం, 3 లక్షల నుండి 5 లక్షల వరకు 14.5 శాతం, లక్షన్నర నుండి 3 లక్షల వరకు 34.6 శాతం, 50 వేల నుండి లక్షా 50 వేల వరకు 21.5 శాతం, 50 వేల కన్నా తక్కువ 9 శాతం మందికి అప్పున్నట్లు వెల్లడైంది.

కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులు పంటరుణాలు పొందలేక పోతున్నారు.

తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు పెరిగిపోవడమని 67.2 శాతం, తెలుపగా అధిక కౌలు వల్ల అని 12.5 శాతం, గిట్టుబాటు ధరలు రాకపోవడం 10.8 శాతం, అధికవడ్డీలతో అప్పులు పెరిగిపోవడం 5.5 శాతం, మార్కెటింగ్ సమస్యల వల్ల 4 శాతం మంది చెప్పారు. ఎరువుల విషయంలో, పంటనష్టం వచ్చినప్పుడు భూయజమాని కౌలుతగ్గించకపోవడం, అకాలవర్షాలు, కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రకటించే అరకొర సహాయం కూడా తమకు అందకపోవడం సమస్య గా చెప్పారు.

సంవత్సరానికి 35 వేల పైన కౌలు చెల్లిస్తున్నామని 5.1 శాతం, 25 వేల నుండి 35 వేలు 8.7 శాతం, 10 వేల నుండి 25 వేలు 27.3 శాతం, 10 వేల కన్నా తక్కువ 22.4 శాతం మంది చెప్పారు. దాని చెల్లింపు ఎకరానికి 20 నుండి 30 బస్తాలు (ధాన్యం) భూయజమానులకు కౌలుకింద పంటలో భాగం ఇస్తున్నామని 13.2 శాతం, 15 నుండి 20 బస్తాలు (ధాన్యం) 8.7 శాతం, 10 నుండి 15 బస్తాలు (ధాన్యం) 14.5 శాతం మంది ఇస్తున్నామని అన్నారు. 10 ఎకరాలకు పైగా కౌలు తీసుకుంటున్న రైతులు 15.9 శాతం, 4 నుండి 10 ఎకరాలు 34.8 శాతం, 1 నుండి 3 ఎకరాలు 43.6 శాతం, ఒక ఎకరం కంటే తక్కువ 5.7 శాతం మంది భూయజమానుల నుండి కౌలుకు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

కౌలు రైతుల డిమాండ్లు:

తమ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏచర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం. గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం తెలిపారు.

రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు. భూ యజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (Scale of financé) ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు.

చాలాచోట్ల గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు రూ 2,000 నుండి రూ 5,000 వరకు పెరిగాయి (సుమారు 43 శాతం) బస్తాల్లో చూస్తే ఒకటి నుండి మూడు బస్తాల వరకు పెంచారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కేవలం 3.4 శాతం మాత్రమే కౌలు రేట్లు కొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తి వేసి దాని స్థానంలో స్వచ్ఛంద పంటల భీమా పథకాన్ని తీసుకొచ్చారు. బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న వారికి మాత్రమే బీమా వర్తిస్తుంది. బ్యాంకు రుణాలు పొందని రైతులు ఫార్మర్స్‌ కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో డబ్బులు కట్టి బీమా పథకంలో చేరాలని చెప్పడంతో ప్రీమియం భారం భరించలేక 99.1 శాతం కౌలు రైతులు బీమాలో చేరలేదు. గుర్తింపు కార్డులు పొందిన ప్రతి కౌలు రైతుకు భూ యజమాని తీసుకున్న పంటరుణాలతో సంబంధం లేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం పంట హామీపై పంట రుణాలు అందించాలి. కౌలురైతులు తీసుకున్న ప్రవేటు అప్పులు మాఫీ చేయడానికి రుణ ఉపశమనం చట్టం తీసుకు రావాలని, ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ప్రధాన కార్యదర్శి పి. జమలయ్యా డిమాండ్ చేశారు.

Tags:    

Similar News