ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ మానవేంద్ర రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయవిద్య అభ్యసించిన తదుపరి 2002 లో జిల్లా జడ్జి క్యాడర్లో నియమితులై వీరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో న్యాయ సేవలు అందజేశారు. 2015 జూలై నుండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా, 2019 జూన్ నుండి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందజేయగా 2023 నవంబర్ లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై సొంత రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.