నల్లబర్లీ పొగాకు రైతుల జీవితాలను నాశనం చేసిన వ్యాపారులు!
బర్లీ పొగాకు రైతు బతుకు పొగ చూరింది. అప్పుల ఊబిలో కూరుకున్న రైతును ఆదుకోవడంలో ప్రభుత్వ నిస్తేజం ఎందుకు?;
ఆంధ్రప్రదేశ్‌లో నల్ల బర్లీ పొగాకు సాగు రైతులకు ఆర్థింగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కనీస ధరల నిర్ధారణ, వేలంలో తప్పనిసరి పాల్గొనడం వంటి చర్యల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.
పొగాకు బోర్డు నిర్లక్ష్యం రైతుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. బోర్డు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో లోపాలు, సాంకేతిక మద్దతు లేకపోవడం వంటి అంశాలు రైతులను నిరాశ పరుస్తున్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పొగాకు బోర్డు రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి. నాణ్యత మెరుగుదల కోసం సాంకేతిక సహాయం అందించాలి.
అదనంగా పొగాకు సాగు పర్యావరణం, ఆరోగ్యంపై చూపే ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ సమతుల్య పంటలైన పప్పు ధాన్యాలు, నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించాలి. ఇటువంటి చర్యలు రైతులకు స్థిరమైన ఆర్థిక భద్రతను అందించడమే కాక, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సుస్థిరంగా మారుస్తుంది.
నల్ల బర్లీ పొగాకు సాగు విస్తీర్ణం
నల్ల బర్లీ (Southern Black Soil - SBS) ప్రాంతంలో పొగాకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే వేశారు. ఎంత మంది రైతులు నల్ల బర్లీ పొగాకు పండించారనే వివరాలు బోర్డు వారు వెల్లడించలేదు. చాలా మంది రైతులు నల్ల బర్లీ పొగాకును వ్యాపారులను నమ్ముకుని సాగు చేశారు. రైతులు, రైతు నాయకులు చెబుతున్న ప్రకారం నల్ల బర్లీ, తెల్ల బర్లీ కలిపి సుమారు 300 మిలియన్ కేజీల వరకు దిగుబడి వచ్చింది. ప్రకాశం జిల్లా గుళ్లాపల్లి కి చెందిన పొగారు రైతుల నాయకుడు పల్లకి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం నల్ల బర్లీ పొగాకు వ్యాపారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినందున ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో నల్ల బర్లీ పొగాకును రైతులు పండించినట్లు తెలిపారు.
ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు వంటి జిల్లాల్లో సాగైంది. 2023-24 సీజన్‌లో రాష్ట్రంలో 43,125 మంది రైతులు 97,127.07 హెక్టార్లలో FCV పొగాకును సాగు చేశారు. దీని ఫలితంగా 205.5 మిలియన్ కిలోల ఉత్పత్తి సాధించారు.
తగ్గిన నాణ్యత
వర్షాభావం, కరువు, అనుకూలం కాని వాతావరణ పరిస్థితుల వల్ల పొగాకు నాణ్యత ఈ ఏడాది తగ్గింది. ఉదాహరణకు 2019లో పొడి వాతావరణం కారణంగా తక్కువ నాణ్యత గల పొగాకు ఎక్కువగా ఉత్పత్తి అయింది. దీని వల్ల వ్యాపారులు కేజీ పొగాకు కేవలం రూ. 70-80 మధ్య ధరను మాత్రమే ఆఫర్ చేశారు. ఇది రైతులకు నష్టాలను కలిగించింది.
రాష్ట్ర మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామిని కలిసి పొగాకు రైతుల పట్ల వ్యాపారులు అవలంభిస్తున్న వైఖరిని వివరిస్తున్న రైతు ప్రతినిధులు
మార్కెట్ డిమాండ్‌లో హెచ్చుతగ్గులు
అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు డిమాండ్ హెచ్చుతగ్గులు వ్యాపారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. 2020లో కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తక్కువ, మధ్యస్థ నాణ్యత గల 20 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు తిరస్కరించారు. ఎందుకంటే రవాణా, వేలం కేంద్రాలకు పొగాకును తరలించడం సాధ్యం కాలేదు.
పొగాకు బోర్డు నియంత్రణలు
పొగాకు బోర్డు ఉత్పత్తి పరిమితులను విధిస్తుంది. ఇది కొన్నిసార్లు వ్యాపారులను అధిక ఉత్పత్తిని కొనుగోలు చేయకుండా నిరుత్సాహపరుస్తుంది. అయితే 2023-24లో తుఫాను కారణంగా రైతులు అదనపు ఖర్చులను ఎదుర్కొన్నందున, అధిక ఉత్పత్తిపై జరిమానాను కేంద్రం రద్దు చేసింది. పొగాకు సాగు అధిక ఖర్చుతో కూడుకున్నది. తక్కువ ధరలు రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. వ్యాపారులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని తక్కువ ధరలను ఆఫర్ చేస్తారు. లేదా కొనుగోలు నుండి తప్పుకుంటారు.
గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమావేశం
వ్యవసాయ మంత్రి సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు
గత నెల 29 ఏప్రిల్ 2025న గుంటూరులోని ఎన్జీ రంగా వర్సిటీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పొగాకు కొనుగోళ్లపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జరిగింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పొగాకు వ్యాపారులు పాల్గొన్నారు. నల్ల బర్లీ (బ్లాక్ బర్లీ) పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. తక్షణ కొనుగోళ్లు: నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని పొగాకు వ్యాపారులను మంత్రి ఆదేశించారు. షరతులు లేకుండా కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేశారు, తద్వారా రైతులు తమ పంటను త్వరగా విక్రయించుకో గలరని తెలిపారు.
2. రైతుల శ్రేయస్సు కోసం చర్యలు: పొగాకు బోర్డు రైతుల శ్రేయస్సు కోసం సహకరించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ఒంగోలులోని వేలం కేంద్రం సందర్శన సందర్భంగా, "నో బిడ్" సమస్య వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు వ్యాపారులతో సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
3. రవాణా ఖర్చుల భరోసా: పొగాకు బోర్డుతో సంప్రదించి, ప్రభుత్వం రవాణా ఖర్చులను భరించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇది రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన చర్యగా భావించ వచ్చు.
4. అధిక స్థాయి చర్చలు: పర్చూరు నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించడానికి, అవసరమైతే అధిక స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూస్తామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదు?
పొగాకు కంపెనీలు పొగాకును కొనుగోలు చేయకపోతే బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం పొగాకును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలో సుమారు రూ. 500 కోట్ల వరకు నిధి కేటాయించి కొనుగోలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా ఈ విధంగానే కొనుగోలు చేసింది. కంపెనీలు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయిస్తామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు హామీ ఇచ్చి వారం గడిచినా ఆచరణకు నోచుకోలేదు.
బర్లీ పొగాకుకు బోర్డు అనుమతి అవసరం లేదు
నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు పండించేందుకు టొబాకో బోర్డు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల రైతులు పంటను నేరుగా వేస్తున్నారు. బోర్డు వర్జీనియా పొగాకుకు మాత్రమే అనుమతి ఇస్తోంది. తాము వర్జీనియా పొగాకు మాత్రమే వ్యాపారులు, కంపెనీల ద్వారా కొనుగోలు చేయిస్తామని బోర్డు వారు చెబుతున్నారు. బోర్డు అనుమతి లేకుండా వారికి ఇష్టం వచ్చిన పొగాకు ఇష్టానుసారం పండించుకున్నప్పుడు అమ్మునే బాధ్యత కూడా రైతులకే ఉంటుందని బోర్డు వాదిస్తోంది.
మిక్సింగ్ జరుగుతోంది..
రైతులు పండించిన వర్జీనియా, నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకును వ్యాపారులు కొనుగోలు చేసిన తరువాత మిక్సింగ్ చేస్తున్నారు. అన్ని రకాల పొగాకును కలపడం వల్ల బ్రౌన్ కలర్ వచ్చి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతోంది. వ్యాపారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు రేసి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడం ద్వారా టొబాకో కంపెనీలు, వ్యాపారులు బాగు పడుతున్నారు. రైతులు దివాలా తీస్తున్నారు.
వర్జీనియా రేటు ఎంత పలుకుతోందంటే...
వర్జీనియా పొగాకు ధర కేజీ రూ. 370లు ఉంది. అదే బర్లీ పొగాకు ధర కేజీ రూ. 150లు మించడం లేదు. బర్లీ పొగాకును వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వర్జీనియా పొగాకును వేలం కేంద్రాల వద్ద రైతుల నుంచి టొబాకో కంపెనీల వారు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కొనుగోలు చేసిన పొగాకును మిక్స్ చేస్తున్నారు. మిక్సింగ్ వల్ల యావరేజ్ న కేజీ వ్యాపారులకు రూ. 250ల వరకు వస్తుంది. దీని వల్ల రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు పూర్తిగా కొనుగోలు చేయవచ్చు.
నాణ్యత లేదనే కారణం చూపుతున్న వ్యాపారులు
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని పమిడిపాడు గ్రామానికి వెళ్లి జీపీఐ కంపెనీ ప్రతినిధులు నల్లబర్లీ పొగాకు పండించాల్సిందిగా రైతులను కోరారు. పండించిన ప్రతి ఆకూ కొనుగోలు చేస్తామని చెప్పారు. దీంతో కనగాలవారిపాలెం, రెడ్డిపాలెం, రాచపూడి రైతులు భారీగా నల్లబర్లీ పొగాకు వేశారు. ఎక్కువ మంది కౌలుకు పొలాలు తీసుకుని పొగాకు సాగు చేశారు. ఇప్పుడు వ్యాపారులు ముందుకు రావడం లేదు. కొత కోసిన పొగాకు రంగుమారుతున్నా కొనుగోలు చేయడం లేదు. ఎందుకు కొనుగోలు చేయటం లేదని రైతులు ప్రశ్నిస్తే నాణ్యత లేదని చెప్పటం విశేషం. ఎరజెర్ల సుబ్బారావు అనే రైతు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’తో మాట్లాడుతూ నేను 20 ఎకరాల పొలంలో నల్లబర్లీ సాగు చేశాను. ఆకు వలిచి గుచ్చి పందిళ్లకు కట్టాము. కోత కూలీ ఎకరాకు రూ. 55వేలు అయింది. కొనే వ్యాపారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దగంజాం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అర్జీ ఇచ్చనట్లు చెప్పారు. బొమ్మిడాల కంపెనీ వారు కొనుగోలు చేస్తామని మాచేత వేయించి ఇప్పుడు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకుపోయినట్లు రైతులు తెలిపారు.
నాగులుప్పలపాడు మండలం కండ్లగుంట గ్రామానికి చెందిన చింతల వసంతరావు అనే రైతు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా పొగాకు సాగు చేస్తున్నాను. వాళ్లే విత్తనాలు ఇచ్చి సాగు చేయిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా విత్తనాలు ఇచ్చి సాగు చేసి కోత కోసిన తరువాత కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోత కోసి రెండు నెలలైంది. ఎండలు ఎక్కువ కావడంతో ఆకు చెడిపోతోంది. ప్రతి 15 రోజులకు ఒక సారి బేళ్లు ఆరబెట్టాలి. ఆకును తిరగేయాలి. లేకుంటే లోపల గాలి ఆడక ఆకు కుళ్లిపోతుందని తెలిపారు. రంగు మారి పోతుందన్నారు. ఇవ్నీ వ్యాపారులకు తెలుసునని చెప్పారు. మిరప ఖర్చు ఎక్కువవుతోందని దీనిపై ఆసక్తి చూపితే నిండా మునిగామని, తమతో పంట వేయించిన జీపీఐ కంపెనీ వారు పత్తా లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగులుప్పలపాడు మండలం కళ్లగుంట గ్రామానికి చెందిన పాలపర్తి సతీష్ అనే రైతు మాట్లాడుతూ 15 ఎకరాల్లో జీపీఐ కంపెనీ వారు చెబితే పొగాకు సాగు చేసినట్లు చెప్పారు. వారు నాణ్యత లేదని కొనుగోలు చేయకుండా ఆపివేశారని, కూలీలకు ప్రస్తుతం రూ. 5 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. పొగాకు అమ్మిన తరువాత కూలీ డబ్బులు ఇస్తానని చెప్పానని, వాళ్లు రోజూ ఫోన్ చేసి పాగాకు అమ్మారా అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, గుడిమెట్ల గ్రామాలకు చెందిన కూలీలను పిలిపించినట్లు తెలిపారు. కౌలు కూడా రైతులు అడుగుతుంటే ఏమి చేయాలో దిక్కుతోచడం లేదన్నారు. గ్రేడింగ్ చేసి ఇస్తే తీసుకుంటున్నామంటున్నారని, మొదలు వద్ద ఉండే ఆకు కాకుండా పైన పెరిగిన ఆకుకు మాత్రమే ధర పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారన్నారు. ఈ విధంగా గ్రేడ్ చేసి ఇచ్చినా కేజీ రూ. 70లు కూడా ఇవ్వడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.