తిరుమల: ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు
ఈనెల 18 నుంచి మూడు రోజుల రిజిస్ట్రేషన్.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-16 14:49 GMT
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టోకెన్ల కేటాయించే విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది. ఒకసారి టోకెన్ తీసుకున్న యాత్రికుడికి ఆరు నెలల వరకు అవకాశం ఉండదు. డిసెంబర్ నెల కోటా అంగప్రదక్షిణ టోకెన్ల కోసం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని టీటీడీ సూచించింది.
మారిన పద్ధతి
తిరుమలలో అనేక విభాగాల్లో సంస్కరణలు తీసుకుని రావడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి, అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అంగప్రదక్షిణ టోకెన్ల జారీలో కూడా సంస్కరణలు అమలు చేయడానికి మార్గదర్శకాలు రూపొందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయడానికి ఇప్పటి వరకు ముందు వచ్చిన వారికి టికెట్ దక్కేది (First In First Out). దీనికి బదులుగా లక్కీ డిప్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అంగప్రదక్షిణ టోకెన్లు మూడు నెలల ముందే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ కోసం ఈ ఏడాది డిసెంబర్ నెల కోటా టికెట్లు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 20వ తేది వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు ఈ టోకెన్లను కేటాయిస్తారు.
రోజూ 750 టోకెన్లు
తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేయడానికి జారీ చేసే టోకెన్ల కోటా వివరాలు కూడా టీటీడీ ప్రకటించింది. శుక్రవారం మినహా రోజూ 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఒకసారి టోకెన్ తీసుకున్న యాత్రికుడికి మళ్లీ ఆరు నెలల వరకు అంటే 180 రోజుల వరకు అవకాశం ఉండదు. ఇప్పటి వరకు మూడు నెలలు తరువాత టోకెన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. ఈ నిబంధనను కూడా మార్చారు.