శ్రీనివాసా.. నీ పాదాల చెంత ఈ తంటా ఏమిటి ?
తిరుపతిలో మరో వివాదం. వైసీపీ నేత భూమనపై చర్యలు తప్పవన్న టీటీడీ బోర్డు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-16 14:20 GMT
తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా అలిపిరికి సమీపంలోని వాహనాల పార్కింగ్ వద్ద మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మంగళవారం ఆరోపించారు. దీనిని దేవస్థానం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆ విగ్రహం వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి తీవ్రంగా స్పందించింది.
"టిటిడిపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు" అని బోర్డు చైర్మన్ నాయుడుతో పాటు సభ్యులు కూడా తీవ్రంగా స్పందించారు.
తిరుమలకు వెళ్లే మార్గంలోని అలిపిరికి సమీపంలో రోడ్డు పక్కనే పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు. 23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు. దీంతో పీఠం ఒక చోట, శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం ఇక్కడే వదిలేసి స్థపతులు వెళ్లిపోయారు. దీంతో విగ్రహం అక్కడే ఉండిపోయింది.
భూమన పూజలు
అలిపిరి పాత చెక్ పోస్టు వద్ద ఉన్నది శ్రీమహావిష్ణువు విగ్రహమే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. వైఖానస ఆగమం తెలియని వారు నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈయన ఇంకా ఏమన్నారంటే..
"అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. శంఖుచక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడుది ఎలా అవుతుంది?" అని కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.
టీటీడీ బోర్డు సీరియస్
వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు పాలక మండలిసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలోని చైర్మన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో బోర్డు సభ్యలు ఎంఎస్. రాజు, దివాకరరెడ్డి, పనబాక లక్ష్మి కూడా మాట్లాడారు.
"ఇంట్లో ఆచరించే మత విశ్వాసాలు వేరు. బయట రాజకీయ ఉనికి కోసం, ధనర్జాన కోసం హిందువుడిలా కరుణాకర్ రెడ్డి నట్టిస్తున్నారు" అని టీడీపీ ఎమ్మెల్యే, బోర్డు సభ్యుడు ఎంఎస్. రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ నేత, బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ,
"భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు అబద్దపు, అసత్య ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టడం, తిరుమల పవిత్రత, టీటీడీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారు" అని మండిపడ్డారు.
అలిపిరి దగ్గర గతంలో ఒక ప్రవేటు శిల్పా క్వార్టర్స్ ఉండేది. పట్టు కన్నయ్య అనే శిల్పి....నిర్వహించేవాడు. బెంగళూరు కి చెందిన ఓ భక్తుడు శనీశ్వరుడు విగ్రహం ఆర్డర్ ఇచ్చాడు. శిల్పం తయారీలో లోపం రావడం వల్ల ఆ రాతివిగ్రహం అక్కడ పడేశారు" అని చెప్పారు. స్థపతి కుటుంబీకుడైన గురస్వామిని తిరుమలకు తీసుకుని వెళ్లి, మీడియాతో మాట్లాడించారు.
ఈ వీడియోలో ఆ వివరాలు వినండి