రాయలసీమ సాగునీటి హక్కులపై దాడి

రాయలసీమలో ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ కాలువలు లేక నీరు పొలాలకు చేరటం లేదు. పాలకులు పట్టించుకోవడం లేదు.;

Update: 2025-09-16 15:43 GMT

బనకచర్ల సాక్షిగా రాయలసీమ సాగునీటి హక్కులపై దాడి ఏ విధంగా జరిగిందో ప్రత్యక్షంగా చూపిస్తూ రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధులకు అవగాహన పెంచే కార్యక్రమాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాయలసీమ ప్రజా సంఘాలు ప్రతినిధులు రాయలసీమలోని ఏఒక్క ప్రాజెక్టు ఆయకట్టుకు కూడా సక్రమంగా నీరు పారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ సాధన సమితీ అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఎకరాలను శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి, srmc, srbc, గాలేరునగరి, హంద్రీనీవా, తెలుగు గంగ కాలువల, రిజర్వాయర్ల నిర్మాణానికి రాయలసీమ రైతాంగం తమ భూములు త్యాగం చేసినప్పటికీ, ప్రాజెక్టుల ద్వారా నేటికీ నీరు చేరకపోవడంతో త్యాగానికి ఫలితంగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ లో వరద ఉన్న 30 రోజుల్లో రోజుకు నాలుగు టిఎంసీ ల చొప్పున 120 టిఎంసి ల కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకునే రిజర్వాయర్లు ఉన్నప్పటికీ, ప్రధాన కాలువల్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించకపోవడం వల్ల 40 టిఎంసీ ల జలాలను కూడా తరలించలేని పరిస్థితి నేటికీ కొనసాగుతూనే ఉందన్నారు. ఈ సంవత్సరం లాంటి అత్యధిక రోజులు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో కూడా 70 రోజుల్లో 90 టిఎంసీ ల నీటిని రాయలసీమ రిజర్వాయర్లకు తరలించినప్పటికీ, పంట కాలువలు లేకపోవడం వల్ల నిర్దేశి ఆయకట్టులో 40 శాతానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది.

రాయలసీమ నీటి హక్కులను గౌరవిస్తూ ఈ ప్రాజెక్టులకు 30 రోజుల్లో వరద జలాలను తరలించడానికి ప్రధాన కాలువలలో ఉన్న చిన్న అడ్డంకులు తొలగించడం, చివరి ఆకట్టుకు నీరు అందించడానికి పంట కాలవలను నిర్మాణం చేపట్టే అంశాలను ప్రభుత్వం విస్మరించిందని బొజ్జ ఆవేదన వ్యక్తం చేశారు.‌

రాయలసీమ హక్కుగా ఉన్న నీటిని కుందూనదికి తరలించడానికి ఎస్సార్ బీసీ రెగ్యులేటర్ ద్వారా గోరకల్లు రిజర్వాయర్ కు నీటిని చేర్చే కాలువకు శాశ్వత అడ్డుకట్ట వేసి, ఆ కాలువ గట్టు తెంచి ఎస్కేప్ ఛానల్ కాలువకు మళ్లించడం రాయలసీమ సాగునీటి హక్కులపై దాడిగా ఆయన అభివర్ణించారు. రాయలసీమ నీటి హక్కులను గౌరవించకుండా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వకుండా, కృష్ణా జలాలను నెల్లూరు వైపు సముద్రానికి తీసుకుపోవడానికి చేపట్టబోతున్న కార్యక్రమాన్ని బొజ్జా దశరథం రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.

రాయలసీమలోని ప్రతి ప్రాజెక్టుకు చివరి ఆయకట్టుకు నీరు ఇచ్చేంతవరకు, రాయలసీమ నుంచి ఏ ప్రాంతానికి నీటిని తీసుకుపోయే ప్రాజెక్టులను చేపట్టరాదని, రాయలసీమ హక్కులను గౌరవించడానికి సాగునీటి బడ్జెట్లో 80% నిధులను కేటాయించి వచ్చే రెండు సంవత్సరాల కాలంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కుందూనదిని కాలువగా మార్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలుపుదల చేసేలాగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమానికి సిద్ధం కావాలని రాయలసీమ ప్రజా సంఘాలకు ఆయన పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాధన సమితి నాయకులు గంగిరెడ్డి, రామకుమార్, భారతీయ కిసాన్ సంఘ నాయకులు సహదేవరెడ్డి, కర్నూలు జిల్లా సాధన సమితి నాయకులు శేషాద్రి రెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సామాజిక రాయలసీమ నాయకులు డాక్టర్ నాగన్న, రాయలసీమ విద్యావంతుల నాయకులు అరుణ్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి నాయకులు రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నాయకులు రామాంజనేయులు, విరసం నాయకురాలు వరలక్ష్మి, బసవేశ్వర రైతు సంఘం నాయకులు ఎంసీ కొండారెడ్డి, కుందూ పోరాట సమితి నాయకులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఆర్బిసి కాల్వ బాధితుల ప్రతినిధులు మహానంది రెడ్డి, శ్రీనివాసులు, కుందూనది వరద బాధితుల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, మహేశ్వర్ రెడ్డి, నిట్టూరి సుధాకర్ రావు, శ్రీహరి, పట్నం రాముడు, బెక్కెం రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News