తిరుపతి: వైసీపీ నేత భూమనపై కేసు నమోదు
అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ డిప్యూటీ ఈఓ ఫిర్యాదు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-16 17:25 GMT
అసత్యాలు ప్రచారంతో చేస్తున్నారంటే వైసీపీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ డిప్యటీ ఈఓ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు తిరుపతి నగరం అలిపిరి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన భూమన కరుణాకరరెడ్డిపై 196(1)(a),197(1),299,352,353(2),356(2) r/w 356(1) BNS సెక్షన్ష కింద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి.
తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరికి సమీపంలోనే పాత చెక్ పోస్టు వద్ద శిల్పాలు చెక్కేవారు. 23 సంవత్సరాల కిందట సీఎం నారా చంద్రబాబుపై బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఇక్కడి శిల్పాలు చెక్కే వారిని ఖాళీ చేయించారు. దీంతో పీఠం ఒక చోట, శనేశ్వరుడి తొమ్మిది అడుగుల విగ్రహం ఇక్కడే వదిలేసి స్థపతులు వెళ్లిపోయారు. దీంతో విగ్రహం అక్కడే ఉండిపోయింది.
అలిపిరి సమీపంలో ఉన్న ఈ విగ్రహం శ్రీమహావిష్ణువుది అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం స్పష్టం చేశారు. ఆ విగ్రహాన్ని పట్టించుకోకుండా, టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భూమన ఆరోపించారు. వ్యార్థాలతో ఆ విగ్రహం తోపాటు పరిసరాలు అపవిత్రం అవుతున్నా పట్టించుకోవడం లేదని భూమన ఆ విగ్రహం వద్ద కొంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ వీడియా, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"వైఖానస ఆగమం తెలియని వారు నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు" అని భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.
"అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. శంఖుచక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడుది ఎలా అవుతుంది?" అని కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.
అదే సమయానికి ...
అలిపిరి సమీపంలోని పాత చెక్ పోస్టు వద్ద భూమన పూజలు చేసే సమయానికి అంటే మంగళవారం మధ్యాహ్నం తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం కూడా ప్రారంభం కాబోతోంది. వైసీపీ నేత భూమన వ్యవహారంపై సమాచారం అందుకున్న టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు సభ్యులు కూడా సీరియస్ గా స్పందించారు.
"మనోభావాలతో చెలగాటం ఆడడం. అసత్య ప్రచారం చేస్తే కేసులు తప్పవు" అని ఘాటు హెచ్చరిక జారీ చేశారు.
అన్నట్టుగానే.. కేసు
అసత్య ప్రచారం చేయడంతో పాటు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ టీటీడీ డిప్యూటీ ఈఓ గోవిందరాజు ద్వారా అధికారులు ఫిర్యాదు చేయించారు. ఈ ప్రాంతం అంటే స్థానిక ఆలయాలకు ఆయన పరిధిలోనే ఉంటాయి. అందులో అలిపిరి ప్రాంతం కూడా ఉన్నట్లు సమాచారం. గోవిందరాజులు ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై కేసు నమోదు చేశారు.