తిరుపతి: గంగజాతరలో మెరిసిన 'పుష్పా' వేషాలు
తాతయ్యగుంట గంగజాతర తుది ఘట్టానికి చేరింది. బుధవారం వేకువజామున ప్రధాన ఘట్టం జరగనుంది. విభిన్న వేషధారలతో ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నాయి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-13 18:14 GMT
దక్షిణ భారత దేశంలో తిరుపతి తాతయ్యగుంట గంగ జాతర వైవిధ్యమైంది. మహిళల వేషంలో పురుషులు. కంటగింపుగా మారిన పాలెగాడిని అమ్మవారు హతమార్చిన దొర వేషాలు. పుష్ప అలకారంలో యువకులు సందడి చేస్తున్నారు. గంగ జాతరలో మంగళవారం రాత్రి కనిపించిన దృశ్యాలు ఇవి.
ఈ నెల ఆరో తేదీ ప్రారంభమైన తాతయ్య గుంట గంగ జాతర తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం సూర్యోదయానికి ముందు కుడి స్తంభానికి బంకమట్టితో సిద్ధం చేసిన గంగమ్మ ప్రతిరూపం చెంప నరకడంతో వారం రోజుల పాటు నిర్వహించిన సంబురం సమాప్తం కానుంది. దీంతో
ఆలయ పరిసరాలు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కిటకిటలాడుతోంది. తొక్కిసలాటకు ఏమాత్రం ఆస్కారం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసులు అప్రమత్తంగా, యాత్రికులను నియంత్రించి,క్యూలో దర్శనానికి పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు
తిరుమల శ్రీవారి చెల్లెలుగా పరిగణించే తాతయ్యగుంట గంగమ్మ జాతరను టీటీడీ, తిరుపతి నగర పాలక సంస్థ, పోలీసు శాఖలు సమన్వయంతో నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మొక్కుబడులు ఉన్న భక్తలు విభిన్న వేషాలతో కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని మంగళవారం సప్పరాలు సమర్పించారు.
ప్రముఖుల దర్శనం
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, దర్శించుకున్నారు. ఆ తరువాత మాజీ మంత్రి, ఆర్కే. రోజా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి మంగళవారం సాయంత్రం రోజా సారె సమర్పించారు. ఆలయం వెలుపలి మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో పుట్టి పెరిగిన నాకు ఆలయం వద్దకు రాగానే చిన్ననాటి జ్నాపకాలు గుర్తుకు వస్తాయని గతాన్ని నెమరు వేసుకున్నారు.
ఆలయం వద్ద క్యూలు రద్దీగా కనిపించాయి. విభిన్న వేషధారణలతో వచ్చిన పురుషులు అమ్మవారిని దర్శించుకున్నారు.
రాత్రి 11 గంటలు
అమ్మవారికి అలంకరించడానికి తిరుపతిలోని యాదవవీధి నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు 15 కిలోల బరువు ఉన్న ఆభరణాలతో ప్రదర్శనగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికూ సిద్ధంగా ఉంచిన మట్టి ముద్దలు దళితులు (తోటి) అందిస్తుంటే కొడి స్తంభం (విశ్వరూప దర్శన స్తంభం)పై గడ్డితో పేనవేసిన చుట్టిన తాడుకు మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు. తెరచాప వెనుక ఆ కార్యక్రమం పూర్తి చేశారు.
అలంకరించే ఆభరణాలు
తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద కొడి స్తంబానికి అమ్మవారి విశ్వరూప దర్శనానికి మట్టితో ప్రతిమ తయారు చేస్తారు. దాదాపు 15 కిలోల బరువు ఉన్న వివిధ ఆభరణాలతో అలంకరిస్తారు. యాదవవీధి నుంచి విశ్వబ్రాహ్మణ ప్రతినిధులు ఈపూరి దేవరాజచారి, రమేశ్ బాబు, సంఘం ప్రతినిధులతో కలిసి ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వెళ్లారు. ఆ తరువాత అమ్మవారి ప్రతిరూపానికి ఆ ఆభరణాలు అలంకరించారు.
వేకువజామున.. పేరంటాలుగా..
కొడి స్తంభానికి సిద్ధం చేసిన అమ్మవారి విశ్వరూపానికి చెంప నరకడంతో జాతర ముగియనున్నది. మంగళవారం వేకువజామున పేరంటాలుగా వచ్చే కైకాల కుల ప్రతినిధి సాంబయ్య ఎర్రగళ్ల చీర, ఎర్రటి వస్త్రంలో ఒడిబాలు కడతారు. అందులో అక్షింతలు, చవ్వాకు, దువ్వెన, అద్దం నల్లగాజులు, పసుపు కుంకుమ ఉంచుతారు. తలకు నల్లని వస్త్రం కట్టి, కొప్పులా ముడి వేస్తారు. ఆ కొప్పులో పూలు చెక్కి, తలపై బంగారం లాగా అట్లతో చేసిన జడ బిళ్లలు, పట్టీలు వంటి ఆభరణాలతో కట్టకుని, పంబలి వాయిద్యాల శబ్దాలు ఒంటిని గగుర్పొడుస్తుండగా, అవిలాల వద్ద ఉన్న చాటు మండపం వద్దకు వెళ్లే కైకాల కులస్తుడు సాంబయ్య, ఆ తరువాత బేరిశెట్టి ఇంటికి చేరుకుంటాడు. అక్కడి నుంచి ఇంకొన్ని ప్రదేశాల్లో పేరంటాలు పూజలు అందుకున్న తరువాత చిన్నగంగమ్మ చెంపను నరకడం, ఆ వారువాత పెద్ద గంగమ్మ మట్టి ప్రతిమ చెంప నరకనున్నారు. దీంతో ఈ జాతర ముగియనుంది.