Breaking | తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం, ఇప్పటికి పది రోజులే
ఒక నిర్ణయానికి రాలేక పోయిన .టీటీడీ బోర్డు
Byline : SSV Bhaskar Rao
Update: 2025-10-28 13:58 GMT
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ పాలక మండలి నిర్దిష్టంగా నిర్ణయం తీసుకోలేకపోయింది. మరో పది రోజుల్లో సమీక్షించాలని బోర్డులో నిర్ణయించారు. అయితే టోకెన్ల జారీ మరింత పారదర్శకంగా జారీ చేయడంపై పునరాలోచన చేయాలని నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేశారు.
టీటీడీ అధికారవర్గాల సమాచారం మేరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి, ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
తిరుమల అన్నమయ్య భవన్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు అజెండాలోని 100 అంశాలపై టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో వైకుంఠ ద్వార దర్శనాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బోర్డు మీటింగులో తీసుకున్న నిర్ణయంపై టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు మీడియా సమావేశంలో ఏమన్నారంటే...
ఈ ఏడాది జనవరిలో జరిగిన దర్ఘటన నేపథ్యంలో చర్చించాం" అని చెప్పారు. ఇంకా ఏమి చెప్పారంటే..
"వైకుంఠద్వార దర్శనాలు గతంలో లాగే 10 రోజులు పాటు నిర్వహిస్తాం. వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు జారీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తాం. సాధ్యమైనంత ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.
2020లో వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు అమలు చేయాలని నిర్ణయించిన సమయంలో కూడా టీటీడీ ప్రస్తుత టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ,
"తిరుపతిలో పది కేంద్రాల్లో ఇప్పటి వరకు జారీ చేసిన టోకెన్ల విధానం సరైంది కాదు. దీనిపై సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేయడంపై సమీక్షించాల్సిన అవసరం ఉంది. దీనిపై పది రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తాం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇదిలా వుండగా,
తిరుమల శ్రీవారి సన్నిధిలోని వైకుంఠ ద్వారాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెరిచే ద్వారాలు రెండు రోజు ద్వాదశి ఘడియలు ముగిసే సమయంలో మూసివేస్తారు. ఆ అపూర్వ సందర్భం ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినాలు రానున్నాయి.
తొక్కిసలాటతో అంతర్మథనం
ఈ సంవత్సరం జనవరిలో సామాన్య యాత్రికులకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి తిరుపతిలో టోకెన్ల జారీకి పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో బైరాగిపట్టెడ, టీటీడీ శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం కేంద్రాల వద్ద 9వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 40 మందికి పైగానే మరణించిన సంఘటన దేశవ్యాపితంగా చర్చకు దారితీసింది. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలింది. జనవరి పదో తేదీ సంఘటన స్థలాన్ని సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ వేర్వేరుగా సందర్శించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ( ) పరిపాలనా భవనంలో చైర్మన్ బీఆర్. నాయుడు తోపాటు అప్పటి ఈఓ జే. శ్యామలరావు, అధికారులతో సమీక్షించారు.
"గత ప్రభుత్వం అమలు చేసిన విధానం కొనసాగించాలని ఏముంది? దీనిపై సమీక్షించండి" అని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలోనే మందలించారు. ఆ తరువాత టీటీడీ యంత్రాంగం డోలాయమానంలో పడింది. ఈ నేపథ్యంలో..
పది రోజులపై అంతర్మథనం
శ్రీవైష్ణవ ఆలయాలకు కేంద్రంగా ఉన్న శ్రీరంగం రంగనాథస్వామి ఆలయాన్ని టీటీడీ ఆదర్శంగా తీసుకుంది.
2020 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కువ మంది సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని పది రోజుల పాటు తెరిచి ఉంచే పద్ధతిని వైసీపీ ప్రభుత్వంలో అమలు చేశారు. తిరుమలలో కూడా 32 మంది ఆగమశాస్త్ర పండితులు, మఠాధిపతుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా టోకెన్లు జారీ చేశారు.
2024లో టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత కూడా వైకుంఠ ద్వారాలు పది రోజులు తెరిచి ఉంచడం ద్వారా సామాన్య యాత్రికులకు కూడా చక్కటి దర్శనం కల్పించడం గమనార్హం. తద్వారా ఈ ఏడాది జనవరిలో కూడా 300 రూపాయల శీఘ్రదర్శనం టికెట్లతో పాటు 6.75 లక్షల మందికి పది రోజుల పాటు దర్శనం కల్పించారు.
ఆగమశాస్ర్తం, పండితుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచడానికి మంచి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మంగళవారం కూడా మీడియాకు చెప్పారు.
"సామాన్య యాత్రికులకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించకుండా దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుపై భూమన ఆరోపణ చేశారు. దీంతో గత ఏడు నెలలుగా ఈ విషయంపై టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి మీమాంసలో పడింది. రెండు రోజులకు పరిమితం చేస్తే, ఏడు లక్షల మంది సామాన్య యాత్రికుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందనే విషయంలో సమాలోచలను సాగించింది.
తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన సుదీర్ఘ భేటీలో కూడా నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోయింది. మరింత పకడ్బందీగా నిర్వహించే విధానంపై సమీక్షిస్తామని చైర్మన్ బీఆర:. నాయుడుతో పాటు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కూడా స్పష్టం చేశారు. మొత్తానికి పది రోజులు కొనసాగించేందుకే పాలక మండలి సానుకూలంగా ఉన్నట్లు అధికారుల వర్గాల ద్వారా తెలిసింది.