శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం వెనుక కథేమిటి?

తిరుమలలో బ్రహ్మోత్సవాలు రేపటితో పరిసమాప్తి. అసాధారణ భద్రత.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-10-01 09:19 GMT
తిరుమలలో చక్రస్నానానికి సిద్ధమైన శ్రీవారి పుష్కరిణి.

అక్టోబర్ రెండో తేదీ ఉద‌యం ఆరు గంటల నుంచి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపటి(అక్టోబర్ 2వ తేదీ) తో ముగియనున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్లార్ కు శాస్త్రోక్తంగా స్నానం చేయించే ఘట్టం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అదే సమయంలో పుష్కరిణిలో మూడు మునకలు వేయడం ద్వారా పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికులు పోటెత్తనున్నారు. చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలు ఆచరించడం అనేది ముక్కోటి దేవతల దర్శన ఫలితం దక్కుతుందనేది యాత్రికుల ప్రగాఢ విశ్వాసం.
శ్రీవారి పుష్కరిణి వద్ద 2500 పోలీసులతో భద్రత తోపాటు ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది, గజఈత గాళ్లను సిద్ధంగా ఉంచారు. అత్యవసరమైతే ఓ బోటును కూడా సిద్ధం చేశారు.
చక్రస్నానం ఎందుకు?
తొమ్మిది రోజుల ఉత్సవాల్లో నిర్వహించిన అన్ని సేవలు సఫలం కావాలని పూజలు చేస్తారు. లోకం క్షమంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులలో ఉండాలని చక్రస్నానం చేయిస్తారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఏమంటారంటే..
"ఉత్సవాలు నిర్వహించడం అనేది ఓ యజ్నం. దీనిలో ప్రధానంగా అవభృతస్నానం చేయిస్తారు. యజ్ణం చేయడంలో జరిగిన చిన్న లోపాల వల్ల జరిగిన దుష్పరిణామాలు తొలకాలని, సంపూర్ణ ఫలాలు దక్కాలని దేవదేవుడిని వేడుకుంటే చేసే క్రతువే చక్రస్నానం" అని దీక్షితులు వివరించారు. చక్రస్నానం అనంతరం అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణం చేయడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. అంతకుముందు శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు, చ‌క్ర‌త్తాళ్వార్‌ ను శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, వరాహస్వామి ఆలయం వద్ద స్న‌ప‌న‌ తిరుమంజ‌నం నిర్వహిస్తారు.
పుష్కరిణిలో ముందస్తు ఏర్పాట్లు..

తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సీవీఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జేఈఓకు సూచనలు ఇస్తున్న టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

తిరుమలలో పుష్కరిణి వద్ద ఏర్పాట్లను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సూచనలు చేశారు.
"బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం. యాత్రికులను క్రమపద్ధతిలో పుష్కరిణిలోకి అనుమతించండి. ఈఘట్టం ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా ఉత్సవాల విజయోత్సవం చేద్దాం" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు కర్తవ్యం గుర్తు చేశారు.
తిరుమలలో పుష్కరిణి వద్ద చ‌క్ర‌స్నానం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పుష్కరిణి ప్రాంతంలోని నలువైపులా జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్వో కె.వి.మురళీకృష్ణతో కలిసి టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ పరిశీలించారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
పుష్కరిణి వద్ద ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ,

"భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ు ఏర్పాటు చేశామన్నారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు సమష్టిగా స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు పటిష్ట ఏర్పాట్లు చేయండి" అని సూచనలు చేశారు.
రోజంతా పవిత్ర ఘడియలే..
శ్రీవారి పుష్కరిణిలో శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హించనున్నారు. అదే సమయంలో యాత్రికులు పోటెత్తనున్నారు. గరుడుత్సోవం తరువాత అంతటి రద్దీ చక్రస్నానం రోజు మాత్రమే ఉంటుంది.
తిరుమల వేద పండితలు చేసిన సూచనలను ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గుర్తు చేశారు.
"చక్రస్నానం ప్రారంభయైన సమయం నుంచి రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయి. భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చు" అని ఈవో సింఘాల్ యాత్రికులకు సూచన చేశారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా యాత్రికులు కూడా సంయమనం పాటించాలని ఆయన కోరారు.
"పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్ర‌వేశించండి. భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించండి. టిటిడి సూచించిన నిబంధనల మేరకు గ్యాలరీలలోని భక్తులు దశలవారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలి" అని కోరారు.
2,500 మందితో భద్రత

శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం సందర్భంగా తొక్కిసలాట, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్ల టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు వివరించారు. గరుడోత్సవానికి ఏమాత్రం తీసిపోని విధంగా క్రౌడ్ కంట్రోల్ వ్యవస్థ పని చేస్తుందని వారు వివరించారు. పుష్కరిణిలో గజఈతగాళ్లతో పాటు బోటు కూడా సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
"చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులతో పాటు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి 1300 మంది విధుల్లో ఉంటారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది రబ్బరు ఎలాంటి ప్రమాదం జరిగిన మెరుపువేగంతో స్పందించడానికి సిద్ధంగా ఉంటారు. ఫైర్, తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేశాం" అని వారు వివరించారు. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఈఓ ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ పుష్కరిణిలో అంతులేని రహస్యాలు
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి నెల రోజుల కిందటే పుష్కరిణిలో నీటిని ఖాళీ చేయించారు. తాత్కాలిక మరమ్మతులు చేసే సమయంలో ఈ పుష్కరిణిలో పాతకాలం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన రహస్యాలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం పుష్కరిణి వద్ద జరుగుతుంది. గురువారం ఉద‌యం ఆరు గంటల నుంచి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత
శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. దీనికోసం కోటి లీటర్ల నీటితో నింపారు.
ఇదిగో రహస్యాలు..

తిరుమల శ్రీవారి పుష్కరిణి అంతుచిక్కని రహస్యాలకు నిలయం అనడంలో సందేహం లేదు. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు కలుస్తాయనేది చారిత్రక నేపథ్యం. వరాహపురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ పుష్కరిణిలో అపురూప దృశ్యాలు ఏడాదిలో నెల పాటు పురాతన కాలం నాటి కోనేరును చూసే అవకాశం దొరుకుతుంది. వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేరులో శతాబ్దాల కిందట తవ్విన మరో రెండు కోనేర్లు కనిపిస్తాయి. ఓ కోనేరులో నీరు ఉబికి వచ్చే దృశ్యం కూడా చూడవచ్చు. ఆలయానికి ఎదురుగా అంటే లడ్డూ ప్రసాదాలు తీసుకునేందుకు మాడవీధిలో వెళ్లే సమయంలో మరో అపురూప దృశ్యం కోనేరులో కనిపిస్తుంది. అందులో ప్రధానంగా పుష్కరిణిలో ఏడుబావులు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో కొన్నింటిని కొన్ని దశాబ్దాల కిందట మూసివేశారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఉన్నట్లు కూడా ఓ కథనం. పుష్కరిణిలోని ఆ బావుల నుంచి నిత్యం నీరు ఉబికిరావడం ఎక్కువ అయినందువల్ల మూసివేయడానికి దారి తీసినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News