ఒకసారి నష్టపరిహారం ప్రకటించిన తర్వాత ఇక పెంచేది ఉండదు
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణను అడ్డుకునేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By : The Federal
Update: 2025-10-01 12:14 GMT
ఒకసారి నష్టపరిహారం ప్రకటించిన తర్వాత ఇక పెంచేది ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న గూగుల్ డేటా సెంటర్ భూసేకరణలో రైతులకు తెలియకుండా కోర్టులో తప్పుడు కేసులు దాఖలు చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ ఎయిర్‌పోర్టులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎంకు స్వాగతం పలికిన తర్వాత, డేటా సెంటర్ భూసేకరణ ప్రగతి, ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎం చంద్రబాబుకు వివరించారు.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఆటంకాలు సృష్టించే ఉద్దేశ్యంతో వైకాపా పెద్దల తరఫున బినామీలు (ప్రాక్సీలు) పని చేస్తున్న విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసులు దాఖలు చేయడం... అందులో మృతి చెందిన రైతు పేరు కూడా ఉండడం... ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలి అని సీఎం చంద్రబాబు వారికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం కల్పించే విషయాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించుకున్నారు. భూసేకరణ ప్రాంతాల్లో ఒకసారి పరిహారం ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడం ఎక్కడా జరగదు. కానీ, ఇక్కడి రైతుల అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ధరలు పెంచాం. దీన్నిరైతులు, ప్రజలు గ్రహించాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని, ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని, వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా పెట్టుకుని, ప్రాజెక్ట్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.