తిరుమల లడ్డూ : తిరుపతిలో 'సిట్' ఏమి చేయబోతోంది..?

తిరుమల లడ్డ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభం కానుంది. దీనికి కోసం ఏర్పాటైన 'సిట్' బృందం తిరుపతిలో ఈ రోజు ఏమిచేయబోతోంది?

Update: 2024-09-28 06:27 GMT

తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభం కానున్నది. అందుకోసం ఏర్పాటైన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) బాధ్యతలు చేపట్టనుంది. 'సిట్' చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠత్రిపాఠి సారథ్యంలోని దర్యాప్తు బృందం శనివారం ( ఈరోజు) తిరుపతికి రానుంది.

లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందనే వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై విచారణకు సీఎం ఎన్. చంద్రబాబు 'సిట్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన 48 గంటల తర్వాత ముగ్గురి సారధ్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అందులో 'సిట్' చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సారధ్యంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి సారధ్యంలో దర్యాప్తులో సహకారానికి తిరుపతి అదనపు ఎస్పి (అడ్మిన్) వెంకటరావు, డీఎస్పీలు జీ. సీతారామారావు, శివ నారాయణస్వామి, అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టీ. సత్యనారాయణ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కే. ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు ఎస్సై ఎం. సూర్యనారాయణను సభ్యులుగా నియమించారు. ఆ 'సిట్' బృందాన్ని అధికారికంగా నియమిస్తూ డీజీపీ రెండు రోజుల క్రితం జీవో జారీ చేశారు. అంతకు ముందు రోజే ముగ్గురు ఉన్నతాధికారులు డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. ఆ తర్వాతే విచారణ కమిటీ పై ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వారిలో గోపీనాథ్ జెట్టి గతంలో టీటీడీ సీవీఎస్ఓ (చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్)గా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయన సహకారం ఈ 'సిట్' బృందంలో దర్యాప్తులో కీలకంగా ఉండే అవకాశం ఉంది.
ఏం చేయబోతున్నారు?
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సారధ్యంలోని సీట్ బృందం ఈరోజు తిరుపతికి చేరుకుంటుంది. మొదట వారు టీటీడీ ఈఓ జే. శ్యామలరావును కూడా కలిసే అవకాశం ఉంది. ఆ తరువాత దర్యాప్తు విషయంలో చర్చించే అవకాశం ఉంది. తిరుపతికి వచ్చే సిట్ బృందం మొదట ఇక్కడ భేటీ కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దర్యాప్తు అధికారులుగా నియమితులైన పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ భేటీలో విచారణ ఎక్కడి నుంచి ప్రారంభించాలని విషయంపైన స్థూలంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా,

"తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ జరిగింది" అనే విషయాన్ని టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. "తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డైరీ మిల్క్ ఫుడ్స్ సంస్థ నుంచి ఈ నెయ్యి అందింది" అనే విషయంపై ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు.
తిరుపతిలో టీటీడీ మార్కెటింగ్ జీఎం ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులను సిట్ బృందం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత దర్యాప్తు ఎక్కడినుంచి ప్రారంభించాలనే అంశం పైన అందరి అభిప్రాయాలు క్రోడీకరించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యికి సంబంధించిన కేసు రికార్డులను సీట్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత దర్యాప్తునకు అవసరమైన సూచనలన్నీ ఇవ్వడం ద్వారా విచారణ అధికారిగా ఒక డిఎస్పి స్థాయి అధికారిని సిట్ చీఫ్ నియమించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సిట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ బృందానికి అవసరమైన భవనాలు మెటీరియల్ టీటీడీ ద్వారానే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తునకు అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చుకున్న తర్వాత షిఫ్ట్ చీఫ్ నుంచి బాధ్యతలు అందుకునే అధికారి ఆయన సారధ్యంలోని బృందం దర్యాప్తులో వేగం పెంచడానికి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా,
"తిరుమలడ్డు లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని సీఎం ఎన్ చంద్రబాబు ఈనెల 18వ తేదీ బట్టబయలు చేశారు.
దీనిపై స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. " టీటీడీ ఈవో రెండు నెలల కిందట చెప్పిన విషయానికి, రాజకీయ జోక్యం పెరిగిన తర్వాత టీటీడీ ఈవో చెప్పిన అంశాలకు మధ్య వైరుధ్యం ఉంది" అని వైయస్ జగన్ వివరాలు వెల్లడించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
ఈ వ్యవహారంలో సిట్ అధికారులు తమ దర్యాప్తులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత టీటీడీకి అందిన నెయ్యి, కల్తీ వ్యవహారానికి పరిమితం అవుతారా? గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాలని కూడా తడిమి చూస్తారా? మొత్తం మీద టీటీడీకి మొదటి నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల వ్యవహారం, ఏ ప్రభుత్వ కాలంలో ఎన్ని ట్యాంకర్ల నెయ్యి అందింది? నాణ్యత లేదనే కారణంగా ఏ సంవత్సరంలో ఎన్ని తిరస్కరించారు అనే అంశాలను కూడా ప్రామాణికంగా తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
టీటీడీ అధికారికంగా చెబుతున్న మాటల్లో ద్వంద విధానాలు కనిపిస్తున్నాయనే విషయం వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ఎత్తిచూపించారు. పూర్తిస్థాయిలో రెండు మూడు రోజుల్లో దర్యాప్తులోకి దిగనున్న సిట్ బృందం ఏమి తీరుస్తుంది అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News