తిరుమల : రక్తం కక్కుకుని చావడమా..? ఇదేమి ప్రార్ధన భూమనా..?

తిరుమలలో మొదటిసారి సత్యప్రమాణం జరిగింది. లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వానికి టీటీడీ మాజీ చైర్మన్ సవాల్ విసిరారు. శ్రీవారికి ఆయన ఏమి నివేదించారంటే...

Reporter :  Dinesh Gunakala
Update: 2024-09-23 13:35 GMT

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కూడా వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. సెంటిమెంట్తి అస్త్రం ప్రయోగించారు. తిరుమల శ్రీవారి క్షేత్రంలోని అఖిలాండం వద్ద ఊహించని విధంగా ప్రమాణం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా సీఎం. ఎన్. చంద్రబాబుకు సవాల్ విసిరినట్లు కనిపిస్తోంది. `ఆయన అనుసరించనున్న ఈ వ్యూహాన్ని పసిగట్టడంలో టీటీడీ, ఆ విభాగం నిఘా విభాగం, పోలీస్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా విఫలమయ్యారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.


ముందస్తు వ్యూహంతో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, తన కొడుకు భూమన అభినయరెడ్డితో కలసి సోమవారం మధ్యాహ్నం మూడు కార్లలో భూమన కరుణాకరరెడ్డి తిరుమలకు చేరుకున్నారు. జీఎన్సీ టోల్గేట్ వద్దే ఆయనను పోలీసులు అటకాయించారు. రాజకీయాలు మాట్లాడవద్దని సూచిస్తూ ముందస్తు నోటీసు కూడా అందించారు. అన్నింటికీ సరే అని సామరస్యంగా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి, వరాహస్వామి ఆలయం సమీపంలోని శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకుని స్నానం చేయడం, అఖిలాండం వద్దకు చేరుకున్నారు.

నివేదన ...

తన పదవీకాలంలోనే కాదు. వైసీపీ పాలనలో ఎలాంటి అపచారం జరగలేదని అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. తిరుపతి వైసీపీ ఎంపీ కుడిపక్కన నిలిచారు. ఎడమ పక్కన ఆయన కుమారుడు భూమన అభినయరెడ్డి నిలబడ్డారు. భూమన కరుణాకరరరెడ్డి ఎడమ చేతిలో కర్పూ హారతి పట్టకున్నారు. ఆయన కొడుకు అందులో కర్పూరం వేస్తుండగా, ఒక దెబ్బకు కొబ్బరికాయ కొట్టి శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నివేదించారు.
అదే సమయంలో తిరుపతి అదనపు ఎస్ఫీ భాస్కర్ అక్కడే ఉండి, వారించడానికి విఫలయత్నం చేశారు. అవన్నీ ఏమి పట్టంచుకోకుండా, భూమన కరుణాకరరెడ్డి నిమిషంపాటు శ్రీవారిని మనసులో ప్రార్ధించారు. అనంతరం హారతి ఇస్తూ, ఇలా నివేదించారు..

"నమో వెంకటేశాయా..
వేదమూర్తికి వేనవేన దండాలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో 91ఏళ్ల టీటీడీ పాలకమండలి చరిత్రలో నాకు మూడుసార్లు పాలకమండలి సభ్యుడిగా, రెండుసార్లు చైర్మన్గా పనిచేసే అవకాశం ఇచ్చిన మహా మూర్తి శరణాగతి తండ్రి.
గత కొన్ని రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టు ఉంది. సర్వజగద్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం కూడా స్వామీ. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ సన్నిధిలో..
దేవదేవా... మీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని, కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే భరించలేకన్నా..."
అంటుండగానే తిరుపతి అదనపు డీఎస్పీ వీరశేఖర్ అడ్డుపడ్డారు.


"మీరు వద్దు అంటే.. ఆగేదేమీ లేదు. ఉండండి" అని సున్నితంగా తన కార్యక్రమాన్ని కొనసాగించడానికి యత్నిస్తూ..
"స్వామీ నేను గనుక తప్పు చేసి ఉంటే... నేను నా కుటుంబం రక్తం కక్కుకుని చావాలి" అని గట్టిగా కేకలు పెడుతు, ప్రమాణం పూర్తి" చేశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్, తిరుమల పోలీసులు భూమన కరుణాకరరెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కుపోయారు. అంతకుముందు
నిరాటంకంగా అలిపిరి దాటి...

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి తిరుమలకు వెళ్లడానికి అలిపిరి వద్దకు చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం "శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కలుషితమైంది" అని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల ప్రకంపనలు ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ తో పాటు వారి పాలనలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరడ్డి సారధ్యంలోని పాలక మండలిలో ఇది జరిగిందనే అపవాదు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమలకు ఇదే సమయంలో బయలుదేరిన నేపథ్యం ఏమి ఉంటుంది అనేది కూడా నిఘా వర్గాలు, ప్రత్యేకంగా టీటీడీ విజిలెన్స్ వర్గాలు గ్రహించలేకపోయాయా.? అనేది చర్చకు వచ్చింది. లడ్డూ వ్యవహారంలో నేషనల్ మీడియా కొండకు వెళ్లకుండా నివారించడానికి విజిలెన్స్ అధికారులు అపసోపాలు పడ్డారు. లేని ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. ఈ పరిస్థితుల్లో భూమన కరుణాకరరెడ్డి పగలే, నిఘా వర్గాలకు కూడా సమాచారం బయటికి పొక్కకుండా, బహిరంగంగానే తిరుమలకు వెళ్లి, తాను అనుకున్న లక్ష్యంగా నెరవేర్చకున్నట్లు కనిపిస్తోంది. అలిపిరి వద్ద కూడా భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేయడానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుపడ్డారు.
తిరుమలలో మొదటిసారి
తిరుమలలో ఈ తరహా సత్యప్రమాణం చేసిన సంఘటన ఇదే ప్రధమం అనడంలో సందేహం లేదు. ఏదైనా సందర్భంలో రాజకీయ సవాళ్లు, చోరీలు జరిగిన సందర్భాల్లో చిత్తూరు జిల్లా కాణిపాకంలో ని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం చెంత ప్రమాణాలు చేస్తుంటారు. "ఈ క్షేత్రానికి సత్యప్రమాణాల దేవుడి"గా పేరు ఉంది. ఇందుకు అక్కడ టికెట్ తీసుకోవాలి. అంటే ఆ దేవస్థానం వద్ద అలాంటి సేవ కూడా ఉంది. ఆ తరువాత పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల వద్ద రాజనాలబండ వద్ద సత్య ప్రమాణాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రమాణం చేయాలని ఎవరిపై అయిన సందేహం ఉంటే, మాత్రం ఆ రోజు సాయంత్రమే బాధితుల ఇంటి ముందు నగలు, లేదా డబ్బు గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి వెళతారు. అంటే ఇదంతా సెంటిమెంట్ తో కూడిన వ్యవహారం.
సెంటిమెంట్ అస్త్రం
లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కలుషితం అయ్యిందనే సీఎం ఎన్. చంద్రబాబు మాటలతో అన్నివర్గాలు తీవ్రంగా కలత చెందాయి. ఇది సెంటిమెంట్ అస్ర్తం అనడంలో సందేహం లేదు. అదే తరహాలోనే "నేను, మా ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలిలో ఎలాంటి తప్పిదాలు జరగలేదు" అని మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కూడా ప్రమాణస్వీకారంతో సెంటిమెంట్ తోనే సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనిని ప్రజలు ఎంత వరకు ఆమోదిస్తారు. ప్రభుత్వం కూడా ఈ సవాల్ ను ఎలా స్వీకరిస్తుందనేది వేచి చూడాలి.
Tags:    

Similar News