మార్చి నాటికి అందుబాటులోకి టిడ్కో గృహాలు
టిడ్కో లబ్దిదారులకు శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ;
By : V V S Krishna Kumar
Update: 2025-09-07 06:04 GMT
రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 163 టిడ్కో గృహ సముదాయాలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మున్సిపల్ శాఖామంత్రి నారాయణ తెలిపారు.టిడ్కో గృహ లబ్ధిదారులకు శుభవార్త తెలిపిన మంత్రి,ఆ గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు,వంటి ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రజల నివాస అవసరాలతో పాటు సమగ్ర జీవన ప్రమాణాలు కల్పించేందుకే ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.
కర్నూల్ పై ప్రత్యేక దృష్టి
జగన్నాథగట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న 3,056 గృహాలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.పదెకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక ఉపాధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ రూ.1 కోటి వ్యయంతో తాగునీటి వసతి, అదనంగా రూ.5 కోట్లు మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.