శ్రీవారి అన్నప్రసాదాలు ఎన్ని లక్షల మందికి వడ్డించబోతున్నారంటే..

60 ఆలయాలకు విస్తరించడానికి టీటీడీ కార్యాచరణ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-12-12 15:39 GMT
తిరుమల అన్నదానసత్రం (ఫైల్)

తిరుమల శ్రీవారిని దర్శించుకునే యాత్రికులు శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నసత్రంలో అన్నప్రసాదాలు స్వీకరించడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది శ్రీవారి ప్రసాదంగానే భావిస్తారు. ఈ వసతిని టీటీడీ ఆధీనంలోని 60 ఆలయాలకు విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు శుక్రవారం వెల్లడించారు.

టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు దాతలు ఇచ్చిన విరాళాలు నవంబర్ 15 నాటికి 2,316 కోట్ల రూపాయలకు చేరాయి. ఆ వడ్డీసొమ్మొతోనే టీటీడీ నిత్యాన్నదాన సత్రం నిర్వహణలో రుచికరమైన ఆహార పదార్థాలు అందించడంలో రాజీ పడడం లేదు. 

తిరుమలలో ఆకలి అనే మాటకు ఆస్కారం లేదు. ఆహార పదార్థాలు ఎంతరుచిగా ఉన్నాయో అనిపించేతగా నాణ్యమైన పదార్థాలు వడ్డించడానికి టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. ప్రస్తుతం తిరుమలతో పాటు తిరుపతి, కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంతో కూడా కలిపితే రోజుకు రెండు లక్షల నుంచి 2.10 లక్షల మంది  60 ఆలయాలకు అన్నప్రసాదాల విస్తరణ వల్ల రోజూ ఆ సంఖ్య మూడు లక్షల మందికి పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

"తిరుమల తరహాలోనే మిగతా ఆలయాల వద్ద కూడా యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం" అని  టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తిరుమలతో పాటు, తిరుపతి, ఒంటిమిట్ట క్షేత్రాలతో కలిపితే రోజుకు 2.50 లక్షల మందికి అన్నప్రసాదాల వితరణ చేయడానికి టీటీడీ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను నిర్వహిస్తోంది. తిరుమలతో డిప్యూటీ ఈఓ ఈ కార్యక్రమం పర్యవేక్షిస్తుంటారు. 

60 ఆలయాలకు విస్తరణ

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా నిత్యాన్నదానప్రసాదాల పంపిణీ విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఆలయాల వద్ద యాత్రికులకు నాణ్యం, రుచికరమైన అన్నప్రసాద వితరణ చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టిందని చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ సింఘాల్ వెల్లడించారు. అన్నప్రసాద వితరణకు టిటిడి యంత్రాంగం ఏర్పాట్లు సిద్దం చేస్తోందని వారువివరించారు.

రెండు వేల మందితో ప్రారంభమై
తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు 1985 ఏప్రిల్ ఆరో తేదీ టిటిడి శ్రీకారం చుట్టింది. తొలుత ఎస్వీ నిత్య ప్రసాద స్కీం క్రింద రెండు వేల మందికి అన్నప్రసాదరణ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రారంభించారు. ఆ తరువాత 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా
2014 
ఏప్రిల్ ఒకటో తేదీ, పేరు మార్చారు. అన్నదానసత్రంలో పచ్చడి, వేపుడు, నెయ్యి, ఓ తీపిపదార్ధం, వడ,  అన్నం, సాంబారు, రసం, మజ్జిగ వడ్డించడం ద్వారా స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రుచికరమైన ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తోంది.
తిరుపతిలోని దాదాపు 12 ప్రదేశాల్లో సాంబారు అన్నం, పెరుగు అన్నం తోపాటు పాలు, మజ్జిగ, టీ, కాఫీలు అందించడంలో కూడా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.  

తిరుమలలో మొదట కల్యాణకట్ట ఎదురుగా ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీతరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభించారు. నవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు ఈ ట్రస్ట్ కు దాతల నుంచి విరాళాలు అందాయి. 
తిరుమలలో....

తిరుమలలోని శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో మాత్రమే అన్నప్రసాదాల వితరణ జరిగేది. యాత్రికుల కోసం తిరుమలలో వసతి సముదాయాలు ఏర్నాటు చేశారు. దీంతో రాంబగీచ బస్టాండు, ఏఎంసీ, సిఆర్‌వో, పిఏసి-1 వద్ద ఫుడ్‌ కౌంటర్లు, పీఏసీ - 2, పీఏసీ - 4, పీఏసీ - 5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో సాధారణ రోజులలో రోజుకు 1.80 లక్షల నుంచి 1.90 మంది, వారాంతపు రోజులలో రోజుకు రెండు లక్షల నుంచి 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. తిరుమలలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాలలో గరుడసేవ రోజున సరాసరి 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది.
తిరుపతిలో...
తిరుమల తరువాత అన్నప్రసాద వితరణ కేంద్రాలను మలిదశలో తిరుపతిలోని ఆలయాల వద్దకు విస్తరించారు. అందులో తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాదరణ వితరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా, యాత్రికుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన వసతి సముదాయాలు శ్రీనివాసం, విష్ణునివాసం, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులలో, ఒంటిమిట్టలోని శ్రీ కోందరరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఆ కేంద్రాలలో సాధారణ రోజులలో 15 వేల నుంచి 16 వేలకు మంది, వారాంతపు రోజులలో 18 వేల నుండి 20 వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.
త్వరలో 60 టిటిడి ఆలయాలలో....
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఛైర్మెన్ బీఆర్. నాయుడు, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షణలో త్వరలో 60 టిటిడి ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదర చేసేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. అన్నప్రసాద వితరణకు ఇప్పటికే టిటిడి ఈవో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అన్నప్రసాదం వితరణ, తయారీకి ధార్మిక సంస్థలు, మఠాలు ముందుకు వచ్చే వారితో అవగాహణ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.
Tags:    

Similar News