విజయనగరం జిల్లాలో వృద్ధురాలు సజీవదహనం
అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె.సీతాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 10 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధురాలు సజీవదహనమైంది.
ప్రమాద వివరాలు
గ్రామానికి చెందిన పాపమ్మ (65) అనే వృద్ధురాలు చలి తీవ్రత నుంచి ఉపశమనం కోసం రాత్రి ఇంట్లో కుంపటి పెట్టుకుని పడుకున్నారు. తెల్లవారుజామున కుంపటి నుంచి వచ్చిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న గడ్డి, ఇతర వస్తువులకు అంటుకుని మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న పాపమ్మ మంటల నుంచి బయటపడలేక సజీవదహనమయ్యారు. మంటలు వేగంగా పక్క పూరిళ్లకు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే 10 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి.
నష్ట పరిహారం
ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.