ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు విహంగ వీక్షణం!
ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాజెక్టుల తీరుతెన్నులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-12-12 15:02 GMT
విశాఖపట్నంలో శుక్రవారం వివిధ ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పనిలో పనిగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన ఆయా ప్రాజెక్టుల తీరుతెన్నులు, పురోగతిని హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.
విశాఖ రీజియన్ ప్రగతిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మధ్యాహ్నం 12.10 గంటలకు రాజధాని నుంచి హెలికాప్టర్‌లో విశాఖ చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలోని ఐటీ హిల్స్‌పై నిర్మించనున్న తొమ్మిది ఐటీ సంస్థలకు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత రుషికొండ వద్ద ఉన్న ఏ–1 కన్వెన్షన్‌లో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రాజెక్టులపై సమీక్షించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించారు.
ముఖ్యమంత్రి చర్చించిన అంశాలివీ..
ఈ రీజియన్ పరిధిలో 1.65 కోట్ల జనాభా, 38 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 52 బిలియన్ డాలర్ల జీడీపీ, 3,170 డాలర్ల తలసరి ఆదాయంతో పాటు 70 లక్షల వర్క్‌ఫోర్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం విస్తీర్ణం, 23 శాతం జనాభా, 30 శాతం జీడీపీ ఈ వీఈఆర్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఏడు:్రఓత్‌క్ష్రైవర్ల ద్వారా అభివృద్ధి, గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్ జెన్ ఐటీ, అగ్రకల్చర్, టూరిజం, హెల్త్ కేర్ హబ్, ప్రణాళికబద్ధమైన పట్టణీకరణ–హౌసింగ్, అత్యుత్తమ మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ప్రస్తుత ఆపరేషనల్ పోర్టులు విశాఖపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టులున్నాయి. వీటితో పాటు కొత్తగా ఏడు రైల్వే ప్రాజెక్టులు, 77 కి.మీల మేర వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం 12 తయారీ కేంద్రాలు, 18 వ్యవసాయ ప్రాంతాలు, వరల్డ్ క్లాస్ నర్సరీ, ఫుడ్ పార్క్‌లు, ఆక్వా పార్కులు, ఐదు ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ఇంకా అదనంగా 7.5 లక్షల ఇళ్లు, 10 వేల హోటల్ రూమ్‌లు, 20 వరకు మెడికల్, ఐటీ, స్కిల్లింగ్ కాలేజీలు, ఐదు వేల హాస్పిటల్ బెడ్లు, పరిశ్రమలకు 50 వేల ఎకరాలు కేటాయింపు, 50 మిలియన్ చదరపు అడుగుల ఆఫీసు సముదాయం, 60 మిలియన్ అడుగుల గిడ్డంగులు వీఈఆర్ పరిధిలో అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వీటికి సంబంధించిన అంశాలను ఆయన సమీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి వారి సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వీఈఆర్ ప్రణాళికలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబు ఏరియల్ సర్వే ఇలా..
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు. ఉత్తరాంధ్రలో నిర్మితమవుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో స్వయంగా పరిశీలించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను వీక్షించారు. ప్రధానంగా విశాఖ ఐటీ సెజ్ విస్తరించిన కాపులుప్పాడ వద్ద ఐటీ హబ్, జీసీసీ ప్రాజెక్టుల నిర్మాణాలను వీక్షించారు. అలాగే సాగరతీరాన్ని ఆనుకుని భీమిలి వద్ద ఏర్పాటవుతున్న టూరిజం హబ్‌ను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పనుల ప్రగతి, దానికి అనుసంధానంగా టౌన్‌షిప్ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. రాయ్‌పూర్– విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల తాజా పరిస్థితి గురించి అధికారులతో చర్చించారు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.