విశాఖపట్నం ప్రపంచ స్థాయి ఆర్థిక నగరం అవుతుందా?
ప్రపంచ ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ప్రభుత్వ వ్యూహాలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని (VER) ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశ్రమలు, సమాచార సాంకేతికత (ఐటీ), పర్యాటకం, పట్టణాభివృద్ధి, ఆకుపచ్చ ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నాన్ని గుడిసెలు లేని ఆధునిక నగరంగా మార్చడం, అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళికలో కీలక అంశాలు.
ఇందులో భాగంగానే శుక్రవారం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఆ తరువాత అధికారులతో సమగ్ర చర్చలు జరిపారు. ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ, సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అంశంపైనే ఎక్కువ చర్చ జరిగింది.
విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించిన ముఖ్యమంత్రి సమగ్రాభివృద్ధి, రోడ్లు, రైల్వే లైన్లు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు సంబంధించిన 49 ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈ సమావేశం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగులకు స్పష్టమైన సూచికగా కనిపిస్తుంది. 2024లో 52 బిలియన్ డాలర్లుగా ఉన్న VER మొత్తం ఆదాయాన్ని 2032 నాటికి 125-135 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం. మాస్టర్ ప్లాన్ సమర్థవంతంగా అమలైతే 2047 నాటికి ఈ ప్రాంతం 750-800 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడు గ్రోత్ డ్రైవర్లు, పది సహాయక విధానాల ద్వారా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇది యువతకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు దోహదపడుతుందని సీఎం చెబుతున్నారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం తదుపరి మూడు నెలల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు నిర్దిష్ట సూచనలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన దీర్ఘకాలిక దృష్టిని ప్రదర్శించింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీల అభివృద్ధి, అనకాపల్లిలో మెడ్‌టెక్ జోన్-2 ప్రారంభం, టాయ్స్ పార్క్‌లకు ప్రోత్సాహకాలు, డిఫెన్స్ తయారీ సంస్థల ఆకర్షణ వంటి కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తాయి. ఏజెన్సీ ప్రాంతాలను మిగతా భాగాలతో అనుసంధానం చేయడం, రోడ్ల నెట్‌వర్క్ విస్తరణ, ప్రతి శాఖకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించడం ద్వారా సమతుల్య అభివృద్ధిని సాధించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులు సామూహికంగా ముందుకు వచ్చి ప్రైవేటు పారిశ్రామిక పార్కులు స్థాపిస్తే అనుమతులు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో వలసలను అరికట్టవచ్చని ముఖ్యమంత్రి సూచించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మరో ముఖ్యమైన అంశం.
విశాఖ ప్రాంతం వివిధ పంటల సాగుకు అనుకూలమైనదిగా ఉండటం వల్ల, ఆయిల్ పామ్‌తోపాటు కోకో, అరటి, నల్ల మిరియాలు వంటి అంతర పంటలను ప్రోత్సహించడం, అలాగే పౌల్ట్రీ ఫారమ్‌లు స్థాపించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని సీఎం చెబుతున్నారు. ఈ ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు ఉన్నాయి. గ్లోబల్ పోర్ట్, నెక్స్ట్-జెన్ ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్‌కేర్ హబ్, ప్లాన్డ్ అర్బనైజేషన్ & హౌసింగ్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఏడు గ్రోత్ డ్రైవర్లు ఈ అభివృద్ధికి మార్గదర్శకాలుగా ఉంటాయి. ముఖ్యంగా కైలాసగిరి నుంచి భీమిలి వరకు 40 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన పర్యాటక నగరంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్, ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారుస్తుంది.
ఈ ప్రణాళికలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమలు తీరు, పెట్టుబడుల ఆకర్షణపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం ప్రకారం, "విశాఖ ఆర్థిక ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడం ద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతాం" అని తెలిపారు.