కుప్పం: దేవా..ఎంత విషాదం మిగిల్చావు..
కుప్పం మండలం దేవరాజపురం వద్ద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు నీటి కుంటలో మునిగి చనిపోయారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-18 17:34 GMT
ఆ కుటుంబంలో ఇద్దరు అక్కలు. వారికి ఓ తమ్ముడు. ఈ మూడు కుటుంబాల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దలకు తగినట్టుగానే పిల్లలు కూడా ఆప్యాయత, ఆత్మీయంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. ఆ కుటుంబంలో ఆదివారం తీవ్ర శోకం నింపింది.
ఇంటి వద్ద ఉన్న నీటి కుంటలో మునిగిన వారి ముగ్గురు పిల్లలు చనిపోయిన విషాద ఘటన కుప్పం నియోజకవర్గంలో జరిగింది.
గ్రామంలో చర్చి నిర్మాణానికి మట్టి కోసం పెద్ద గొయ్యి తవ్వారు. చర్చి నిర్మాణం పూర్తయింది. ఆ గోతిని అలాగే వదిలేశారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆ గుంతలో నీరు నిలిచింది. ఇక్కడ ఆడుకుంటూ ఉన్న ముగ్గురు పిల్లలు నీటి గుంటలో పడి మరణించడం ఆ కుటుంబంలోనే కాదు. గ్రామంలో విషాదఛాయలు నింపింది.
కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన యశోద, వరలక్ష్మి అక్క చెల్లెళ్ళు. వారి తమ్ముడు రాజా. వారిలో యశోద అనే మహిళ తమిళనాడులో ఉంటుంది. ఆమెకు యశ్విన్ (7) కొడుకు. వేసవి సెలవులు కావడంతో సొంత ఊరు దేవరాజపురానికి వచ్చింది.
ఇదే గ్రామంలో ఉన్న చెల్లెలు తిరుపతి, వరలక్ష్మి దంపతుల కూతురు గౌతమి (7, వీరి తమ్ముడు రాజా, సుమతి దంపతుల కూతురు శాలిని (6) వేసవి సెలవులు హాయిగా గడుపుతున్నారు.
ప్రాణం తీసిన గొయ్యి
కుప్పం మండలం దేవరాజపురం గ్రామంలో దళితులు చర్చి నిర్మించుకున్నారు. గోడల నిర్మాణానికి మట్టి కోసం తవ్విన గుంతను అలాగే వదిలి వేశారు. అల్పపీడన ప్రభావం వల్ల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలో వర్షపు నీరు చేరింది. దానిని గ్రామస్తులు పట్టించుకోవడం వదిలేశారు. ఇదిలా ఉంటే..
యశ్విన్, గౌతమి, శాలిని నీటి కుంట వద్ద ఆడుకుంటూ ఉన్నారు. ఈతకు దిగారో లేదా పొరపాటున పడిపోయారో తెలియదు కానీ ఆ ముగ్గురు నీటి గుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద పిల్లల సందడి వినిపించడం లేదు. ఏమిటా అని వారి తల్లిదండ్రులు గాలించగా, నీటి కుంటలో మునిగిన విషయాన్ని గమనించి గుండెలో బాదుకున్నారు. గమనించిన దేవరాజపురం గ్రామంలోని వారు కూడా అక్కడికి చేరుకుని, పరిశీలించే సరికి ముగ్గురు పిల్లలు మిగతాజీవులుగా మారడం గమనించి కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నిలిచింది.