ఏపీలో పన్ను ఎగవేతలు ఉండొద్దు
విద్యుత్ వినియోగం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పన్ను ఎగవేతలను గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.;
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పన్ను ఎగవేతలు ఉండొద్దని, అలా పన్నుల ఎగవేతలకు అవకాశం లేకుండా చూడాలని జీఎస్టీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేంద్ర– రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఏ బాబు, కేంద్ర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలటిక్స్ లాంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని సూచించారు. అది ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపకరించాలని అన్నారు. దీనికోసం జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర– రాష్ట్రాల అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలన్నారు.