వారి రాక ఆలస్యమే.. పేర్ల వెల్లడిలో జాప్యం..
రాష్ట్ర మంత్రివర్గ కూర్పు మంగళవారం రాత్రి ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ పెద్దల కోసం నిరీక్షించడం, సమీక్ష వల్లే జాబితా వెల్లడిలో ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది.
టీడీపీ కూటమికి రోజురోజుకు తలనొప్పులు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. పొత్తులతో పురుడు పోసుకున్న కష్టాలు సీట్ల సర్దుబాటుతో పెరిగి, క్యాబినెట్ కూర్పు వరకు కొనసా...గాయి. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో తేల్చుకోలేని స్థితిలో ఒకే వ్యక్తి కోసం టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు నిశిరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు టీడీపీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనేతలు వచ్చిన తరువాత కూడా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలని అనే విషయంలో తీవ్రంగా చర్చలు సాగడం వల్ల పేర్లు వెల్లడిలో జాప్యానికి కారణమని తెలిసింది. టీవీల్లో కూడా బ్రేకింగ్ రాకపోవడం, పదేపదే కూటమి లెజిస్టేటివ్ మీటింగ్ మాత్రమే తిప్పితిప్పి ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో.. మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేను ఫెడరల్ ప్రతినిధి పలకరించారు. ’అన్నా ఇంకా ఏమీ తెలియలేదు. వెయిట్ చేస్తున్నా. నేనే కాదన్నా... సీనియర్లు చాలా మంది టెన్షన్గా ఉన్నారని చెప్పారు.