Sriharikota | అంతరిక్షంలో అద్భుతాలకు నిచ్చెన 'మూడో లాంచ్ ప్యాడ్'

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం ఎంతో దూరంలో లేదు. వ్యోమగాములను పంపించడం, వారి ద్వారా ఉపకరణాలు కూడా చేరవేసేందుకు శ్రీహరికోట సాక్ష్యంగా నిలవనున్నది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-17 12:00 GMT

కక్ష్యలోకి భారీ ఉపగ్రహాల ప్రయోగం. అంతరిక్షంలోనే స్పేస్ స్టేషన్ నిర్మాణం. ఈ లక్ష్య సాధనకు శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో 3,985 కోట్ల రూపాయలతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత అంతరిక్ష ప్రయోగాల్లో 2004 లో ఏర్పాటు చేసిన రెండో లాంచ్ ప్యాడ్ నిచ్చెనలా మారింది. 1989 లో నిర్మించిన మొదటి లాంచ్ ప్యాడ్ తక్కువ బరువు కలిగిన రాకెట్ల ప్రయోగానికి మాత్రమే వీలు కలుగుతోంది. 


నాలుగేళ్ల కాలంలో నిర్మించే మూడో లాంచ్ ప్యాడ్ ద్వారా భవిష్యత్ భారీ వాహకనౌకల ప్రయోగానికి ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాడ్ సహాయకారిగా పనిచేస్తుందని షార్ శాస్త్రవేత్తలు చెబుతున్న సమాచారం. మూడో లాంచ్ ప్యాడ్ ద్వారా అంతరిక్షంలోకి భారీ వాహకనౌకల ప్రయోగంతో పాటు వాటిలో అంతరిక్షయాత్ర సాగించేందుకు మార్గం ఏర్పడుతుంది.

శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఉన్న వనరులతోనే అనేక మైలురాళ్లను అధిగమించింది. మొదట ఆ వివరాలు ఏమిటో చూద్దాం...
దేశానికి రక్షణ అవసరాలు, అభివృద్ధి, ప్రయోగాలు, అంతరిక్ష పరిజ్ఞానం పెంచాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం 1947 లో స్వాతంత్య్రం తరువాత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ అవసరమని భావించి సన్నాహాలు చేపట్టింది.
1957లో రష్యా మొదట స్పుత్నిక్ శాటిలైట్ ప్రయోగించిన తరువాత భవిష్యత్ అవసరాలను గుర్తించారు. అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు పితామహుడిగా భావించే విక్రం సారాభాయ్ ఇదే విషయాన్ని ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వివరించారు. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడు హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (Indian National Committee for Space Research - INCOSPAR) ను ఏర్పరచారు.
సోవియెట్ సహకారంతో..
ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైన భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేసేందుకు కేరళలోని త్రివేండ్రం వద్ద తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) నెలకొల్పి అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. అయితే,
భవిష్యత్తులో ఉపగ్రహాల అవసరాలకు పొరుగు దేశాలు సాయం అందకపోచ్చని ముందు గ్రహించిన విక్రం సారాభాయ్ దేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లకు అవసరమైన విడిభాగాలను తయారు చేసే దిశగా బృందాన్ని సిద్ధం చేశారు. ఆ విభాగమే 1969లో ఇస్రోగా ఏర్పడడానికి ఆయన మార్గం వేశారు.
1969లో ఇన్‌కోస్పార్ ఇస్రోగా రూపొందింది. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడింది. ఆ తరువాతి నుంచి ఉపగ్రహాల తయారీతో పాటు వాటిని ప్రయోగించే సామర్థ్యం కూడా అవసరం అని ఆయన గుర్తించి, ఉపగ్రహ వాహకనౌక తయారీకి రంగంలోకి దిగారు. ఆ కోవలో సిద్ధం చేసిన మొదట శాటిలైట్ లాంచ్ వెహికల్ ( SLV)కు భారత గణిత, ఖగోళ శాస్ర్తవేత్త ఆర్యభట్టు పేరు పెట్టి, 1975 ఏప్రిల్ 19న అప్పటి సోవియెట్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఆ స్ఫూర్తితో..
శ్రీహరికోటలో ప్రయోగం
దేశం ముందు ఉన్న శాస్త్ర, సాంకేతిక సవాళ్లను అధిగమించడానికి రాకెట్ పితామహుడు విక్రం సారాభాయ్ అనేక పాఠాలు ముందుగానే అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. దేశంలో భౌగోళిక పరిస్థితిని అంచనా వేసిన సారాభాయ్ పులికాట్ సరస్సు చెంత, సముద్రం కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకుని శ్రీహరికోట వద్ద ఉన్న దీవిని రాకెట్ ప్రయోగ కేంద్రానికి ఎంపిక చేశారనేది చరిత్ర చెప్పే పాఠం. అందులో భాగంగానే...
1979లో శ్రీహరికోటలో వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించిన సౌండ్ రాకెట్ల స్థాయి నుంచి శాటిలైట్ వాహకనౌకలను ప్రయోగించే స్థాయికి తీర్చిదిద్దారు. ఇక్కడి నుంచి ప్రయోగించిన మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ (SLV ) రెండో దశలో విఫలమై సముద్రంలో కూలిపోయింది. అందులో జరిగిన లోపాలను అధ్యయనం చేసిన విక్రం సారాభాయ్ సారధ్యంలోని శాస్త్రవేత్తలు ( SLV) 1980లో మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఈ ప్రయోగం ఫలించిన తరువాత ఇనుమడించిన ఉత్సాహంతో
1980లో పీఎస్ఎల్వి ( Polar Satellite Launch Vehicle PSLV) వాహక నౌకల ప్రయోగానికి Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. 1987లో, 1988లో ఈ ASLV ప్రయోగాలు రెండూ విఫలమైనా PSLVకి ఉపయోగపడే ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారనేది చరిత్ర చెప్పే విజయాలు. అపజయాలు నేర్పిన పాఠాలతో 1992లో పట్టువదలని విక్రమార్కుల్లా తక్కువ బరువు కలిగిన ASLV ప్రయోగం విజయవంతం చేశారు. మళ్లీ 1993లో PSLV ప్రయోగం విఫలమైంది. తిరిగి 1994లో విజయవంతంగా ప్రయోగించారు. అప్పటి నుంచి భారత ఉపగ్రహాలకు PSLV స్థిరమైన వేదికగా ఈ లాంచ్ ప్యాడ్ ఉపగ్రహాల ప్రయోగాలకు సాక్ష్యంగా నిలిచి, రక్షణ, విద్యా, వ్యవసాయ రంగాలకు విశేషమైన సేవలు అందిస్తోంది.
2001లో మరింత శక్తి సామర్థ్యాలు కలిగిన Geosynchronous Satellite Launch Vehicle (GSLV) నిర్మాణానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. దీనివల్ల 5000 కిలోల బరువు ఉపగ్రహాలను కూడా భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇదే రెండో లాంచ్ ప్యాడ్ నుంచి చంద్రుడిపైకి మనిషిని పంపే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
2022 ఫిబ్రవరి 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 (PSLV-c52) ప్రయోగం విజయవంతమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లిందని గతంలో విజయగర్వంతో ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదో రికార్డు

2024 డిసెంబర్ 30వ తేదీ షార్ కేంద్రం నుంచి రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-60 ఉపగ్రహ వాహక నౌక విజయవంతం చేయడం ద్వారా భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇస్రో శాస్త్రవేత్తలు నిలిపారు. ఇందులో ప్రధానంగా.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ఉపకరణాలను పంపించడం తోపాటు స్పాడెక్స్ (SpaDex) డాకింగ్ ప్రయోగం గురువారం విజయవంతమైంది. దీనివల్ల
గగనయాన్ కు మార్గం..
"స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానించి.. సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చింది" ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా , రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా, ఇది స్పేస్ స్టేషన్, గగన్‌యాన్, చంద్రయాన్-4 ప్రయోగాలకు మార్గం సుగమం చేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
వాటి ఆలంబనగా...
భారీ వాహక నౌకల ప్రయోగం చేయడానికి మూడో లాంచ్ ప్యాడ్ అవసరమని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ (మూడు రోజుల కిందట ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు) కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.
2024 డిసెంబర్ 30వ తేదీ ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 60 విజయవంతమైన తరువాత డాక్టర్ సోమనాథ్ ఏమి చెప్పారంటే..
"2025లో ఇస్రో ద్వారా శ్రీహరికోట నుంచి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో భారీ వాహక నౌకల ప్రయోగంతో పాటు వ్యోమగాములను పంపించడమే కర్తవ్యం" అని చెప్పడం గమనార్హం. జాబిల్లి చెంత స్పేస్ స్టేషన్ నిర్మాణం, యాత్రికులను తీసుకువెళ్లే కలలను సాకారం చేస్తాం" అని కూడా ఆయన ప్రకటించారు. శాస్త్రవేత్తల కలలు, లక్ష్యాలను సాకారం చేసే దిశగా భారీ వాహక నౌకల ప్రయోగానికి అవసరమైన మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు అనువుగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం కూడా ఇస్రో శాస్త్రవేత్తలు లక్ష్యాలు సాధించడానికి బాటలు వేసిందని చెప్పవచ్చు.
అమలు.. వ్యూహం.. లక్ష్యాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట షార్ కేంద్రంలో మూడో లాంచ్ ప్యాడ్ ( Third Lanch Pad - TLP ) లక్ష్యాలు ఇవి. రూ. 3984.86 కోట్ల వ్యయంతో నాలుగేళ్ల కాలపరిమితి లోపు నిర్మించాలనేది లక్ష్యం. దీనికి ప్రస్తుతం ఉన్న రెండో లాంచ్ ప్యాండ్ (SLP) సహాయకారిగా ఉండే విధంగా నిర్మాణం సాగించనున్నారు. కొత్తగా నిర్మించే మూడో లాంచ్ ప్యాడ్ (TLP) నుంచి NGLV (Next Generetion Lanch Vechile) భారీ వాహక నౌకల ప్రయోగం చేయవచ్చు. సెమి క్రయోజెనిక్ స్టేజ్‌తో పాటు NGLV స్కేల్ అఫ్ కాన్ఫిగరేషన్‌ తో ఉన్న LVM3 వాహనాల ప్రయోగానికి కూడా తోడ్పడుతుంది.
ఏమి సాధిస్తుందంటే..
ఈ మూడో లాంచ్ ప్యాడ్ నుంచి భారీ వాహక నౌకలు ప్రయోగిస్తారు. అంటే 25 టన్నుల బరువును అంతరిక్షంలోకి మోసుకుని వెళుతుంది. ఇందులో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అనువైన సామగ్రితో పాటు, అది పూర్తయ్యాక వ్యోమగాములను తీసుకుని వెళ్లి, వారితో పాటు అవసరమైన మరమ్ముతులు చేయడానికి వీలుగా పరికరాలను పంపడానికి అవకాశం ఉంటుందని షార్ పీఆర్ఓ గోపాలకృష్ణ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు. ఈ భారీ వాహక నౌకల ద్వారా అంతరిక్షయానానికి వెళ్ల వ్యోమగాములు అంతరిక్షంలో అన్వేషణ సాగిస్తారు. అవసరమైన యంత్రాలు కూడా అమర్చడానికి మార్గం ఏర్పడుతుంది.
రెండు లాంచ్ ప్యాడ్లే...
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లో భారతీయ అంతరిక్ష రవాణా వ్యవస్థకు రెండు లాంచ్ ప్యాడ్‌ లపైనే ఆధారపడి ఉన్నారు.
1. మొదటి లాంచ్ ప్యాడ్ (FLP) 1989లో ఏర్పాటు చేశారు. అప్పటి ప్రయోగాలకు అనుగుణంగా సుమారు రెండు టన్నులు బరువు ఉన్న వాహకనౌకల ప్రయోగానికి ఇది వేదికగా నిలిచింది.
2. రెండవ లాంచ్ ప్యాడ్ (SLP) 2004లో ఏర్పాటు చేశారు. దీని నుంచి నాలుగు నుంచి ఆరు టన్నుల సామర్థ్యం కలిగిన వాహక నౌకల ప్రయోగానికి వీలుగా ఉంది. ఇదే వేదిక షార్ సాధించిన విజయాల్లో అనేక మైలురాళ్లకు సాక్ష్యంగా నిలిచింది. దీనిని. PSLV రాకెట్ల ప్రయోగం కోసం 30 సంవత్సరాల క్రితం FLP ఏర్పాటు చేశారు. PSLV, SSLV కోసం ప్రయోగాలకు వేదికగా నిలిచింది.
3. ఈ రెండు లాంచ్ ప్యాడ్ ప్రధానంగా GSLV, LVM3 కోసం నిర్మించినా, PSLV కోసం స్టాండ్‌బైగా కూడా పనిచేస్తోంది.
SLP దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తోంది, ఈ ప్లాట్ ఫాం నుంచి చంద్రయాన్-3 మిషన్‌తో సహా PSLV/LVM3, కొన్ని వాణిజ్య మిషన్‌లను ప్రయోగించేందుకు సామర్థ్యాన్ని పెంచారు. రెండో లాంచ్ ప్యాడ్ నుంచి (SLP) కూడా గగన్‌యాన్ మిషన్‌ ద్వారా వ్యోమగాములను పంపడానికి సమాయత్తం అవుతోంది.
ఎప్పటికంటే..
ఇస్రో రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అందులో ప్రధానంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) పూర్తి చేయడం.
2040 నాటికి ఇండియన్ క్రూడ్ లూనార్ ల్యాండింగ్‌తో చేయాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ విస్తరించడానికి కొత్తతరం భారీ ప్రయోగశాలల అవసరాన్ని ప్రధానంగా ఎంచుకున్నది. రానున్న 25 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల్లో అంతరిక్ష యానంలో కొత్తపుంతలు తొక్కించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి మూడో లాంచ్ ప్యాడ్ ద్వారా సుదీర్ఘ స్వప్నం సాధ్యమైనంత త్వరలో సాధించాలని షార్ శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి కేంద్రం అనుమతించిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ ప్యాడ్ (NGLV) ఆలంబనగా ఉంటుందని పీఆర్ఓగోపీకృష్ణ స్పష్టం చేశారు.
Tags:    

Similar News