'చంద్రబాబూ, తుపాన్లపై నీ బిల్డప్ ఆపయ్యా!'
‘మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ ఇచ్చారు’ చంద్రబాబు అంటున్న వైఎస్ జగన్
By : The Federal
Update: 2025-12-04 07:11 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. తుపాన్ల సమయంలో చంద్రబాబు బిల్డప్ చూడలేక చస్తున్నామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి.. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు.
‘‘పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంథా తుపాను ఇంకా కళ్లముందే కదలాడుతోంది. మొంథా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ ఇచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్‌ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూ.1100 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చాం. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమాకు బాబు ఉరేశారు. బాబు పాలనలో కౌలు ైతుల పరిస్థతి దయనీయంగా ఉంది.
..ఇన్‌ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో బాబు చెప్పరు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. బాబు ఇచ్చింది 10 వేలే. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారు. అయినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారు.’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.