ల్యాండ్ పూలింగ్‌కు 4 ఎకరాలిచ్చిన రైతు నంబూరి బలరాం

అమరావతి మండలం యండ్రాయిలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ రైతులతో భేటీ అయ్యారు.

Update: 2025-12-04 07:09 GMT

అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ పై ప్రభుత్వం వేగం పెంచింది. ఇందుకోసం మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ యండ్రాయి గ్రామాన్ని సందర్శించి రైతులతో  సమావేశమయ్యారు. గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు కలిసి రైతు ధర్మారావు నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అమరావతి మండలంలోని ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉన్న నాలుగు రెవెన్యూ గ్రామాల రైతులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ చర్చలు జరిపారు. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు ముందే 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను ఆర్డీవోకు అందజేస్తూ రైతు నంబూరి బలరాం ప్రభుత్వం పట్ల విశ్వాసం చూపారు.

 రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే తాను ప్రత్యక్షంగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్‌కు సహకరించాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ రైతులను కోరారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు, ఎయిర్‌పోర్ట్ రావాలి. ఇవి ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచుతాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు స్పోర్ట్స్ సిటీ నిర్మాణ పనులు ఏడాది లోపే ప్రారంభిస్తాం. రైతులకు ఇచ్చే ప్లాట్లలో ముందుగా రోడ్లు వేస్తాం. ఒలింపిక్ స్థాయి పోటీలను నిర్వహించగల 2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ నిర్మించనున్నాం. భూములను ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. 

అందుకే గతంలో మాదిరిగా ల్యాండ్ పూలింగ్ మోడల్‌ను అమలు చేస్తున్నాం. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. గత కొన్ని రోజులుగా గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఎక్కువ మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో పాల్గొనే రైతులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాల పనులను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తున్న రైతులకు ధన్యవాదాలు చెప్పారు. అమరావతి ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోవడానికి రైతుల సహకారం అత్యంత కీలకం అని అన్నారు.

Tags:    

Similar News