నేతల వేట మొదలైంది... ఆ ఇద్దరినీ వదలం : మంత్రి

రెవెన్యూ రికార్డుల దగ్ధం కేసులో కొరడా ఝుళిపించారు. ఓ మాజీ ఎమ్మెల్యేపై తొలి కేసు నమోదైంది. సమయం వస్తే ఆ ఇద్దరు పెద్దరెడ్లనూ వదలమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇందులో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు.

Update: 2024-07-30 04:21 GMT

రెవెన్యూ రికార్డుల దహనం కేసును వారం లోపల కొలిక్కి తీసుకుని వచ్చారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ఆర్డీఓలు, ఓక సీనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు ఓ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తాజాగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేయడంతో పాటు వారి ఇళ్ల నుంచి విలువైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాగానే రాజకీయ నేతలను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. నివేదిక అందగానే, 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో 21వ తేదీ (ఆదివారం) అర్ధరాత్రి రెవెన్యూ రికార్డులు దగ్ధం కావడం తెలిసిందే. మరుసటి సంఘటన సమాచారం తెలిసిన వెంటనే సీఎం ఎన్. చంద్రబాబునాయుడు సీరియస్గా స్పందించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ను హెలికాప్టర్ లో మదనపల్లెకు పంపించారు. "ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు" అని ప్రాధమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఆ తరువాత రంగప్రవేశం చేసిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా మూడు రోజుల పాటు మదనపల్లెలో మకాం వేసి, దర్యాప్తును పర్యవేక్షించారు. అన్యాక్రాంతం అయిన 21ఏ భూములు, అటవీ, ఈనాం, అసైన్డ్ భూములు, కాలిపోయిన ఫైళ్ల వివరాలు సేకరించి, సోమవారం ఆయన ప్రభుత్వానికి నివేదించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లి సంఘటనపై సీఎం ఎన్ చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ శాఖపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు సంస్కరణలు తీసుకుని వచ్చేవిధంగా ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, రెవెన్యూ శాఖలో ప్రక్షాళన, అసైండ్ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సచివాలయంలో మంత్రి సత్యప్రసాద్ మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు.
ఎవరినీ వదలం
"సమయం వస్తే, పెద్దిరెడ్డి, అయినా సరే. వైఎస్. జగన్ మోహన్ రెడ్డినీ వదిలే ప్రసక్తి లేదు" అని
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు (అన్నమయ్య) జిల్లా మదనపల్లె ఘటనలో గత ఆర్డీఓ హరికృష్ణ, ప్రస్తుత ఆర్డీఓ మరళీ, సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజను సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నా శిక్షార్హులేనని స్పష్టం చేశారు. సబ్ కలెక్టరేట్ పరిధిలో గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. ఆ సంఘటనపై ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ. సిసోడియాతో స్వయంగా మూడు రోజుల పాటు విచారణ చేయించిందని గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక సోమవారం ప్రభుత్వానికి సమర్పించారని చెప్పారు.
"విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్ల జరిగింది కాదు. కుట్ర పూర్వకంగానే జరిగింది" అని ఇప్పటి వరకూ జరిగిన విచారణను బట్టి తెలుస్తోందన్నారు. "ఇంకా విచారణ జరుగుతోంది. దీనితో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు" అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.
రెవెన్యూ శాఖ ప్రక్షాళన
"ఉమ్మడి చిత్తూరు, విశాఖ, నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భూ దందాలు జరిగాయి" అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. "మదనపల్లి లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం" అని ప్రకటించారు. వ్యవస్థల మీద నమ్మకం కల్పించడానికి ఆ ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సీపీఎల్ఏ జీ.జయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పర్యటిస్తారని ఆయన తెలిపారు. మిగతా జిల్లాల్లో కూడా భూ ఆక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తారుమంత్రి అనగాని సత్యప్రసాద్ అని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ విధానంతో 22ఏలో పెట్టడం, తొలగించడం, సర్వే నంబర్లు మార్చడంతో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఎస్సీల నుంచి ఆ భూములు ఎక్కడికి వెళ్ళాయని దానిపై పూర్తి నివేదకలు, 22ఏలో అక్రమాలు బయటికి తీస్తామన్నారు.
అది కుట్రే..
మదనపల్లి సబ్ కలక్టర్ కార్యాలయంలో సంఘటన షార్టు సర్క్యూట్ వల్ల జగిగింది కాదు. వంద శాతం కుట్రపూరితమే అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్పష్టం చేశారు. ఈ ఘటనలో సుమారు 2,445 దస్త్రాలు కాలిపోయాయని ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కొందరు తహసీల్దార్ల ఫొర్జరీ సంతకాలతో కూడిన దస్త్రాలను ఆ ఫైళ్ళ్లలో పెట్టారన్నారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంలో మదనపల్లెలో ఆర్డీవో మురళి కీలకపాత్ర పోషించారని, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. రికార్డుల తారుమారులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కీలకంగా వ్యవహరించాడని సిసోడియా తన నివేదికలో వివరించారు.


మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డుల దహనం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందడమే ఆలస్యం అన్నట్లు పోలీసులు ఎదురు చూస్తున్నారు. 22ఏ, అసైన్డ్ భూముల వ్యవహారంలో రాజకీయ నేతపై తొలి కేసు నమోదైంది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల్లో ఒకరైన మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షేక్ నవాజ్ బాషాపై కేసు నమోదైంది. ఆ వివరాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెలో సోమవారం వెల్లడించారు.
"మదనపల్లె వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేశాం" అని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. నవాజ్ బాషా నివాసంలో కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాగానే 15 రోజుల్లో నిందితులను గుర్తించి, అరెస్ట్ చేస్తామని చెబుతున్న ఆయన మాటల ద్వారా వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ పాటికే కొందరిని విచారణ చేసి, పంపారు. వారిలో ఎంతమందిని నిందితులుగా చేర్చనున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


నా వ్యక్తిగత పనిపై బెంగళూరులో ఉండగా, "నా ఇల్లు తనిఖీ చేయాలి అని" పోలీసులు ఫోన్ చేశారని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోమవారం మధ్యాహ్నం మీడియాకు తెలిపారు. పోలీసుల సమక్షంలోనే నా ఇంటి తలుపు తాళం తీశా. ప్రతి అణువు గాలించారు. ఇంట్లో ఏమీ దొరకలేదు" అని ఆయన చెప్పారు. కర్నూలు రేంజ్ డీఐజీ మాత్రం ఆయన నివాసంలో పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇదిలావుండగా..
అదుపులో ఎవరూ లేరు..
"15 మంది అనుమానితులను విచారణ చేశాం. మా శాఖ అదుపులో ఎవరూ లేరు" అని డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఈ కేసును 15 బృందాలు సీఐడీ అధికారుల సహకారంతో విచారణ చేశాయన్నారు. టెక్నాలజీ సహకారంతో పరిశోధిస్తున్నట్లు ఆయన చెప్పారు. "సెల్ ఫోన్ డాంప్స్ తీశాం. 2000కు పైగా ఫోన్ కాల్స్ డేటా, వాట్సాప్ ఐపీడీఆర్ కూడా మదింపు చేశాం" అని ఆయప వెల్లడించారు. అనుమానితుల నివాసాల నుంచి విలువైన ఆధారాలు సేకరించినట్లు ఆయన చెప్పారు. తమ దర్యాప్తులో "పరిశోధనకు ఉపయోగపడే ఫైళ్లు స్వాధీనం చేసుకున్నాం. వాటికి సంబంధించి, ఎనిమిది కొత్త కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అధికారిక పీఏగా పనిచేసిన శశికాంత్ హైదరాబాద్ నివాసంలో మదనపల్లెకు సంబంధించిన భూముల దస్త్రాలు లభించాయని ఆయన వెల్లడించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మిల్లు మాధవరెడ్డి బెదిరించారని బాధితులు ఫిర్యాదు కూడా చేశారన్నారు.
సాంకేతిక అంశాలపై అందే నివేదిక అనంతరం మరిన్ని అరెస్టులు జరిగేందుకు ఆస్కారం ఉందనే విషయం ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీలో కీలకంగా వ్యవహరించిన నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా, మదనపల్లెకు చెందిన కీలక నేతలు దేశసరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది. అరెస్టుల పర్వం ప్రారంభమయ్యాక, సురక్షితం అనుకుంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి.
Tags:    

Similar News