శ్రీవారి కంఠాన అలరించనున్న అష్టలక్ష్మి చంద్రవంక

రూ. 60 లక్షల విలువైన కానుక సమర్పించిన తెలంగాణ ఎంపీ

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-23 10:35 GMT

అలంకార ప్రియుడైన తిరుమల శ్రేవెంకటేశ్వరస్వామివారి బంగారు ఆభరణాలకు కొదవలేదు. అందులోకి మరో కానుక మంగళవారం చేరింది. తెలంగాణకు చెందిన ఎంపీ 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాములు బరువు ఉన్న చంద్రవంక కంఠిని కానుకగా సమర్పించారు. ఈ భరణాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ద్వారా టీటీడీకి అందించారు.

తిరుమలలో శ్రీవారికి రోజూ 121 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించడం ఆనవాయితీ. ఇప్పటికే తొమ్మది టన్నుల వరకు వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీనికోసం తిరుమల ఆలయంలో ప్రత్యేక బొక్కసం (ఖజానా)ను నిర్వహిస్తున్నారు. దీనికోసం 20 రకాల తిరువాభరణ రిజిస్టర్లు కూడా నిర్వహిస్తోంది. ఆలయ డిప్యూటీ ఈఓ సారధ్యంలో, బొక్కసం ఇన్ చార్జి ఆభరణాలు పర్యవేక్షిస్తుంటారు.
తిరుమల శ్రీవారికి సమయానుసారంగా అలంకరించాల్సిన ఆభరణాల రిజిస్టర్ మేరకు ఖజానా నుంచి వెలుపలికి తీసుకుని వస్తారు. వాటిని శ్రీవారి మూలవిరాట్టుకు ఆపాదమస్తకం అలంకరించిన తరువాత యాత్రికులను దర్శనానికి అనుమతిస్తుంటారు. ఇదిలాఉండగా,

తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మంగళవారం ఉదయం రూ. 60 లక్షల విలువైన చంద్రవంక కంఠిని శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత 535 గ్రాముల బంగారు నగను టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి రంగనాయకులు మండపంలో కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు సమర్పించారు. వారికి వేదపండితుల ఆశీర్చనాలలో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను టీటీడీ అధికారులు అందించారు. శ్రీవారి మూలవిరాట్టు కంఠానికి అలంకరించడానికి ఈ కానుక సమర్పించినట్లు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దంపతులు తెలిపారు.
Tags:    

Similar News