భారత్‌కు ‘బ్రెయిన్ గెయిన్’ అవకాశమా?

భారతీయ టాలెంట్ ను స్వదేశానికి వినియోగిస్తే ఎలా ఉంటారో చెప్పిన మద్రాస్ ఐఐటీ ఫ్రొఫెసర్

Update: 2025-09-23 08:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల H-1B వీసా రుసుమును పెంచడంతో భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల మధ్య ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని భారత్ సద్వినియోగం చేసుకుని, విదేశాల్లోని భారతీయ టాలెంట్‌ను స్వదేశానికి ఆకర్షించవచ్చని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి సూచిస్తున్నారు. భారత్‌లో వేతనాలు తక్కువ అయినా, జీవన వ్యయం అందుకు తగ్గట్టుగా ఉండటం వల్ల ఇక్కడి జీవితం మరింత సౌకర్యవంతమని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెప్టెంబర్ 21, 2025 నుంచి అమలు చేసిన H-1B వీసా రుసుము పెంపు, విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలనుకునే కంపెనీలకు భారీ భారమవుతోంది. ఈ మార్పు ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో పనిచేసే భారతీయులలో 70 శాతం మంది H-1B వీసాపై ఉన్నారు. ఈ ఫీజు పెంపు వల్ల కంపెనీలు స్థానిక ఉద్యోగులను ప్రాధాన్యం ఇవ్వవచ్చు. దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలని సూచిస్తున్నారు. "అమెరికాలో విద్య ఖర్చు ఎక్కువ కావడంతో, విద్యార్థులు ఉద్యోగాలు చేసి ఆ భారాన్ని భరిస్తారు. కానీ ఇప్పుడు వీసా ఆంక్షలతో తిరిగి రావాల్సి వస్తుంది. భారత్‌లో సెమీకండక్టర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, మెడికల్ టెక్నాలజీ, మెరైన్ ఎకానమీ వంటి రంగాలకు ఈ టాలెంట్ అవసరం" అని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్‌కు 'బ్రెయిన్ గెయిన్' అవకాశమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక భారత్‌లో వేతనాలు తక్కువ అయినా, జీవన వ్యయం అమెరికా కంటే 83 శాతం తక్కువగా ఉండటం ఒక ప్రధాన ప్లస్ పాయింట్. ఉదాహరణకు అమెరికాలో 1 లీటర్ పాలు ధర సుమారు $1 (రూ.83) కాగా, భారత్‌లో రూ.60 మాత్రమే. ఇక్కడి సగటు జీతం అమెరికా కంటే తక్కువ అయినా, పర్చేసింగ్ పవర్ పరిగణనలోకి తీసుకుంటే, జీవనం మరింత సుఖమయమైనది. అమెరికాలో ఇంటి అద్దె, ఆరోగ్య సంరక్షణ, విద్య ఖర్చులు భారీగా ఉంటాయి. అయితే భారత్‌లో అవి తక్కువ.

ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భారత్‌లో వేతనాలు తక్కువ అయినా, ఉద్యోగ అవకాశాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరిశోధన సౌకర్యాలు అమెరికా స్థాయికి చేరుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది. టాలెంట్ తిరిగి రావడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు, ఇన్సెంటివ్స్ అందించాలి. ఉదాహరణకు 'మేక్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం ద్వారా సెమీకండక్టర్ రంగంలో అవకాశాలు పెంచవచ్చు.

మొత్తంగా అమెరికా వీసా ఆంక్షలు భారత్‌కు ఒక అవకాశంగా మారవచ్చు. తక్కువ జీవన వ్యయం, కుటుంబ సామీప్యం, స్వదేశ సేవ వంటి అంశాలు భారతీయులను ఆకర్షిస్తాయి. "భారత్‌లో తక్కువ వేతనాలు ఉన్నా చక్కగా జీవించవచ్చు" అన్న ప్రొఫెసర్ కామకోటి మాటలు ఇక్కడి వాస్తవికతను ప్రతిబింబిస్తాయి. అయితే ఈ టాలెంట్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ప్రభుత్వం, పరిశ్రమల బాధ్యత. లేకుంటే ఇది మరో 'బ్రెయిన్ డ్రెయిన్'కు దారితీయవచ్చు.

Tags:    

Similar News