తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో శ్రీవారి సేవకులకు (Sreevari seva) ఊహించని వరం దక్కింది. శ్రీవారిసేవకు వచ్చే స్వచ్ఛంద సేవకులకు రోజు విఐపి ( VIP Break Darsan) బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. తిరుమలలో శ్రీవారిసేవ ప్రారంభమైన 25 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టిటిడి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది.
"టీటీడీలో శ్రీవారి సేవకు వస్తున్న స్వచ్ఛంద సేవకులకు ఇకపై విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తాం" అని టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు వెల్లడించారు. రానున్న పాలక మండలి సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఆయన మంగళవారం వెల్లడించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో మంగళవారం శ్రీవారిసేవకుల సమావేంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మాట్లాడారు.
"తిరుమలతో పాటు టీటీడీలో శ్రీవారి సేవకులు యాత్రికులకు అందిస్తున్న సహకారం అనిర్వచనీయమైనది" అని బిఆర్. నాయుడు అభివర్ణించారు. శ్రీవారి సేవకులు భవవత్ బంధువులుగా నిలిచారని అన్నారు. యాత్రికులకు సేవకు ప్రముఖులు పోటీ పడుతున్నారని చెప్పారు.
"తిరుమలలో శ్రీవారిసేవల సేవ గడువు ముగియగానే వారికి శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నాం. సేవకుల విశేష సేవలకు ఇది సరిపోదు" అని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రీవారి సేవకులకు వారి సేవ కాలం ముగిశాక శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
"సేవకుల విశేష సేవలకు అది సరిపోదు. ప్రత్యేక ప్రవేశ దర్శన స్థానంలో శ్రీవారిని దగ్గరగా దర్శించుకునేలా అవకాశం కల్పించాలి. టీటీడీ బోర్డులో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం" అని చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు.
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటన కారణంగా శ్రీవారిసేవకు మరింత పోటీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సిఫారసులు, ఒత్తళ్లు, అక్రమాల నివారణకు శ్రీవారి సేవను ఆన్ లైన్ లో దరఖాస్తు విధానాన్ని టీటీడీ అమలు చేస్తోంది. దీనిని టీటీడీ సమాచార పౌరసంబంధాల శాఖలో చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి, ఏపీఆర్ ఓ నీలిమ శ్రీవారిసేవ ఓఎస్డీ ( Officer on Special Duty ఓస్డ్ )గా బాధ్యతలతో పర్యవేక్షిస్తున్నారు. ఆన్ లైన్ ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖల ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. శ్రీవారిసేవకులకు ప్రత్యేక దర్శనం వల్ల టీటీడీ సమాచార విభాగంపై మరింత ఒత్తిడి పెరిగేందుకు ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తోంది.
సేవల్లో మేటిగా..
తిరుమల తోపాటు తిరుపతిలోని టీటీడీ తొమ్మిది అనుబంధ ఆలయాల్లో కూడా శ్రీవారి సేవకులు యాత్రికులకు సేవ చేయడంలో మేటిగా నిలిచారు. ఈ సేవలు ప్రపంచవ్యాపితంగా గుర్తింపు పొందాయి.
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి సేవకుల స్ఫూర్తితో తిరుమలలో శ్రీవారిసేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదే తరహా సేవలు నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబికా సమేత మల్లన్న ఆలయంలో కూడా అమలు చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి సేవకులు యాత్రికులకు తిరుపతి రైల్వే స్టేషన్ లో దిశా నిర్దేశం చేయడంలో సహాయకారిగా టీటీడీలో 2000 సంవత్సరం నవంబర్ ఒకటో తేదీ శ్రీవారిసేవను రెండు వందల మందితో ప్రారంభించారు. అన్నప్రసాదాల పంపిణీ, మంచినీరు, టీ కాఫీ పాలు అందించడంలో అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నారు.
వీఐపీ దర్శనం ఇలా..
తిరుమలలో రోజూ దాదాపు 2,500 మంది శ్రీవారి సేవకులు యాత్రికుల సేవలో ఉంటారు. వారం రోజులు సేవకు వచ్చే వారికి రోజు ఉదయం దశలవారీగా శ్రీవారి వీఐపీ బ్రేక్ విరామ సమయంలో దర్శనం కల్పించడానికి కార్యక్రమం సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారి ఒకరు చెప్పారు.
శ్రీవారి సేవకు 25 సంవత్సరాలు
టీటీడీలో శ్రీవారిసేవ ప్రారంభించి ఈ ఏడాది నవంబర్ నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇప్పటికి శ్రీవారిసేవకులు 17 లక్షల మంది టీటీడీలో యాత్రికులకు సేవలు అందించారు. ఆన్లైన్ రిజిస్రేషన్ ఐదు లక్షలకు పైనే ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా సీరియల్ ప్రకారం వారికి సేవ చేసే అవకాశాన్ని టిటిడి సమాచార విభాగంలోని తిరుమల కార్యాలయంలో పర్యవేక్షించే శ్రీవారి సేవకు ఏపీఆర్ఓ నీలిమ ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.
"తిరుమలలో ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది శ్రీవారి సేవకులు యాత్రికుల సేవలో ఉంటారు" అని చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి చెప్పారు. తిరుమలలో వారం రోజుల ఉచిత సేవ కోసం అనుమతి తీసుకుని వచ్చే మహిళ, పురుష శ్రీవారి సేవకులు నిర్ణీత గంటలు పూర్తయిన స్వచ్ఛంద సేవ చేయడానికి అలుపు లేకుండా పనిచేస్తున్నారు. అందులో శ్రీవారి సేవకులు తిరుమలలో యాత్రికుల క్యూలు క్రమబద్ధీకరించడం, శ్రీవారి ఆలయ సన్నిధి, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదాలు వడ్డించడం, కూరగాయలు తరగడం, పువ్వులు దండలుగా కూల్చడం, మీ ఐ హెల్ప్ యు కేంద్రాల్లో యాత్రికులకు అవసరమైన సేవలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
హోదాలు మరిచి సేవ
గృహిణులు, సామాన్యులతో పాటు దేశంలోని అనే రాష్ట్రాలతో పాటు దేశాల నుంచి కూడా ఉన్నత స్థాయిలోని ఉద్యోగులు కూడా తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి అత్యంత ఆసక్తి చూపిస్తుంటారు. తాము ఉన్న హోదాను కూడా పక్కనపెట్టి సాధారణ వ్యక్తులు తిరుమల శ్రీవారి యాత్రికులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు టీటీడీలో కీలకంగా మారిన నేపథ్యంలో..
"మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని విభాగాల్లో ప్రొఫెషనల్ సేవకులను కూడా స్వాగతించాం" అని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చెప్పారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
"అహ్మదాబాద్ ఐఐఎం సహకారంతో గ్రూప్ సూపర్వైజర్లు ట్రైనర్స్ కు శిక్షణ ఇప్పిస్తున్నాం. వీరి ద్వారా శ్రీవారి సేవకు దరఖాస్తు చేసుకున్న స్వచ్ఛంద సేవలకు వారి ప్రాంతంలో ముందుగానే అవసరమైన శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3,500 శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. వాహనసేవలు చూసేందుకు ఆలయ మాడవీధుల్లో నిరీక్షించే యాత్రికుల నుంచి కూడా శ్రీవారిసేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరించడం ద్వారా సంస్కరణలు తీసుకుని రావడానికి కూడా ప్రయత్నిస్తామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.