ఏపీలో కార్మిక హక్కులపై కత్తి
ఏపీలో పని గంటల పెంపు బిల్లుకు ఉభయ చట్ట సభలు ఆమోదం తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన 'ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025', 'ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025'లు కార్మిక వర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, ఫ్యాక్టరీలలో రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి, ఫ్యాక్టరీలలో 9 నుంచి 10కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఒకవైపు ఉత్పత్తి పెంపు, పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడుతుందని అధికార వర్గాలు చెబుతుంటే, మరోవైపు కార్మికుల ఆరోగ్యం, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణలు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కార్మిక సంఘాల ఆద్వర్యంలో కార్మికులు తమ హక్కుల కోసం ఇటీవల విజయవాడలో నిర్వహించిన ర్యాలీ
పెంచిన పనిగంటలు, సడలించిన ఆంక్షలు
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రవేశపెట్టిన ఈ బిల్లులు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలలో రోజువారీ పని గంటలు 10కి పెరిగాయి. ఫ్యాక్టరీలలోనూ 10 గంటలు నిర్ణయించారు. అయితే వారానికి మొత్తం 48 గంటల పరిమితి మార్పులేకుండా కొనసాగుతుందని బిల్లులో పేర్కొన్నారు. ఓవర్‌టైమ్ పరిమితిని మూడు నెలలకు 75 నుంచి 144 గంటలకు పెంచారు. మహిళలకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు షిఫ్టులు అనుమతించారు. కానీ భద్రత, రవాణా సౌకర్యాలు యాజమాన్యాల బాధ్యతగా నిర్దేశించారు. ఫ్యాక్టరీలలో ప్రతి 6 గంటలకు అరగంట విరామం తప్పనిసరి, మొత్తం రోజుకు 12 గంటలు మించరాదు. 20 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కానీ భద్రతా నియమాలు తప్పనిసరి చేశారు.
బొత్స సత్యనారాయణ విమర్శ
ఈ బిల్లులు కార్మికులపై దాడిగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. "ఇది దారుణమైన నిర్ణయం. ఎన్నో ఏళ్ల పోరాటాలతో కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారు. 12 గంటల పని విధానం అని అర్థం. ఇంత హడావుడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారు?" అని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ప్రశ్నించారు. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.
బొర్రా గోపిమూర్తి ఆగ్రహం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన మాట్లాడుతూ "కార్మికుల హక్కులను హరించడమే కాకుండా, ఈ సవరణలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రభుత్వం కేవలం యాజమాన్యాల పక్షపాతంగా వ్యవహరిస్తోంది" అని వ్యాఖ్యానించారు. అయితే బొర్రా గోపిమూర్తి విమర్శలు ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు, ఇతర చట్టాలపై కేంద్రీకృతమైనప్పటికీ, ఈ బిల్లుపై ఆయన వ్యతిరేకత ప్రతిపక్ష వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పోరాడి సాధించిన 8 గంటలు ఎక్కడ?
కార్మిక చరిత్రలో 8 గంటల పనిదినం ఒక మైలురాయి. 1886లో అమెరికాలోని చికాగోలో హేమార్కెట్ ఘటనలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు ఇది. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కార్మికులు సమ్మెలు, ఉద్యమాల ద్వారా ఈ హక్కులను సాధించారు. మేడే (మే 1) రోజు ఈ పోరాటాలను స్మరించుకుంటారు. ఇప్పుడు పని గంటలు పెంచడం వల్ల ఆ చట్టాలు బలహీనపడతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ సవరణలు వారానికి 48 గంటలలోపు మాత్రమే అని చెబుతున్నప్పటికీ, రోజువారీ 10 గంటలు 12 గంటల వరకు విస్తరించవచ్చని విమర్శకులు అంటున్నారు.
ఎందుకు పెంచారు? ఉత్పత్తి పెంపా.. లేక పెట్టుబడుల ఆకర్షణా?
ప్రభుత్వం ఈ సవరణలను వ్యాపార స్నేహపూర్వకంగా పరిగణిస్తోంది. పనిగంటలు పెంచడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. పెట్టుబడులు ఆకర్షితమవుతాయి అని వాదిస్తోంది. ఓవర్‌టైమ్ పరిమితి పెంచడం వల్ల యాజమాన్యాలకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కార్మికులకు అదనపు ఆదాయం వస్తుంది. కానీ విమర్శకులు ఇది కేవలం యాజమాన్యాలకు లాభదాయకమే తప్ప, కార్మికుల శ్రేయస్సును పట్టించుకోలేదని అంటున్నారు. ఉదాహరణకు వారానికి 55 పని గంటలు దాటితే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్య, మానసిక కోణం మరిచిన ప్రభుత్వం
పనిగంటలు పెరగడం వల్ల కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి 55 గంటలు దాటితే మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. గుండె జబ్బులు, వెన్నునొప్పి, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ దెబ్బతింటాయి. ఓవర్‌టైమ్ పెంచడం వల్ల లాభాలు, అదనపు ఆదాయం, ఉత్పత్తి పెంపు జరగొచ్చు. అయితే శారీరక, మానసిక ఆరోగ్య హాని, దోపిడీకి అవకాశం ఉందనే విమర్శ కూడా ఉంది. ప్రభుత్వం ఈ అంశాలను కేవలం ఉత్పత్తి కోణంలోనే అంచనా వేసినట్లు కనిపిస్తోంది. ఆరోగ్య ప్రభావాలపై సమగ్ర అధ్యయనం లేదు.
బిల్లు ఉపసంహరించుకునే వరకు ఆందోళన
ఏపీ శాసనసభ, మండలిలో కార్మిక వ్యతిరేక బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఆర్ రవీంధ్రనాధ్ హెచ్చరించారు. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లును నిరసిస్తూ ఆందోళనలు చేసినట్లు తెలిపారు. కార్మికుల రక్తంతో ప్రభుత్వం బతకాలని చూస్తోందని అన్నారు. ఈ విధమైన విధనాలు ఎంతో కాలం కొనసాగించలేరని, మనిషి ఆరోగ్యంగా ఉంటనే ఉత్పత్తి పెరుగుతుందని, పీడిస్తే ఉత్పత్తి పెరగకపోగా సంస్థలు దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు.
సమతుల్యత అవసరం
ఈ బిల్లులు ఆర్థిక వృద్ధికి దోహదపడవచ్చు, కానీ కార్మికుల హక్కులు, ఆరోగ్యాన్ని పరిరక్షించేలా అమలు చేయాలి. చారిత్రక పోరాటాలను మరచి, కేవలం ఉత్పత్తి పెంపును లక్ష్యంగా చేసుకుంటే సామాజిక అసమానతలు పెరుగుతాయి. ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, ఆరోగ్య ప్రభావాలపై సమీక్షలు చేపట్టాలి. లేకపోతే ఈ సవరణలు కార్మిక వర్గంలో అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది.