టీడీపీ మహానాడులో తెలంగాణకు పెద్దపీట ?

ఇపుడు మహానాడు కమిటీల్లో తెలంగాణ నేతలకు చోటు కల్పించినట్లు గతంలో ఎప్పుడూ కల్పించలేదు;

Update: 2025-05-21 13:11 GMT
Chandrababu

తెలుగుదేశంపార్టీ నిర్వహించబోయే మహానాడులో తెలంగాణ అంశాలకు పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో చంద్రబాబునాయుడు(Chandrababu) ప్రత్యేక వ్యూహాలను అమలుచేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈనెల 27వ తేదీనుండి మూడురోజులు మహానాడు(TDP Mahanadu)ను కడపలో జరపబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కూటమి పెద్దన్నగా టీడీపీనే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తోంది కాబట్టి ఏపీలో పార్టీకి ఎలాంటి ఇబ్బందిలేదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇపుడు సమస్యంతా తెలంగాణ(Telangana)తోనే వస్తోంది. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, తీసుకొస్తానని చంద్రబాబు చాలాసార్లు బహిరంగంగానే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇందులో భాగంగానే మహానాడు నిర్వహణ కమిటిల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. ఆహ్వాన కమిటిలో తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులుకు చోటు దక్కింది. 22 సభ్యులతో తీర్మానాల కమిటిని నియమిస్తే అందులో నన్నూరి నర్సిరెడ్డి, చిలువేరు కాశీనాధ్, సామ భూపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వసతుల కమిటిలో పార్టీ క్రమశిక్షణ కమిటి సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, సనగాల సాంబశివరావు, షేక్ అరిఫ్ ఉన్నారు. మహానాడు వేదిక కమిటిలో నందమూరి సుహాసిని, నన్నూరి నర్సిరెడ్డికి అవకాశమిచ్చారు. భోజనాల ఏర్పాట్ల కమిటిలో కూరపాటి వెంకటేశ్వర్లు, బండిపుల్లయ్య, అజ్మీరా రాజునాయక్, జనగాం నర్సింగరావు సభ్యులుగా ఉన్నారు. సోషల్ మీడియాలో తెలంగాణ నేతలు తిరునగిరి జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, ప్రకాష్ రెడ్డి, ఆర్ధిక వనరుల కమిటిలో గడ్డి పద్మావతి, నెల్లూరి దుర్గాప్రసాద్ కు చోటుదక్కింది. వీళ్ళే కాకుండా ఇంకా అనేక కమిటిల్లో తెలంగాణ నేతలకు చంద్రబాబు ప్రత్యేకించి అవకాశాలు కల్పించారు. అవకాశాలు కల్పించటమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మహానాడులో తీర్మానాలు కూడా చేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

ఇపుడు మహానాడు కమిటీల్లో తెలంగాణ నేతలకు చోటు కల్పించినట్లు గతంలో ఎప్పుడూ కల్పించలేదు. వివిధ కమిటీల్లో తెలంగాణ నేతలకు కల్పించిన అవకాశాలను బట్టే చంద్రబాబు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే విషయంలో గట్టి వ్యూహంతోనే ఉన్నట్లు అర్ధమవుతోంది. మిగిలిన అన్నీవిషయాలను పక్కనపెట్టేసినా పార్టీకి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోను సభ్యత్వనమోదు అయితే నిరంతరంగా జరుగుతునే ఉంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం పార్టీకి సుమారుగా 4 లక్షల సభ్యత్వాలున్నాయి. కడపలో మహానాడు తర్వాత తెలంగాణలో ఎంపికచేసిన సుమారు 50నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఈనియోజకవర్గాలు కూడా పార్టీకి ఒకపుడు గట్టిపట్టున్న రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోనే ఉండబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

ఫిరాయింపుపైనే టార్గెట్టా ?

చంద్రబాబు గనుక తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని వెంటనే డిసైడ్ అయితే బీఆర్ఎస్ ఫిరాయింపులపైనే మొదటి దృష్టిపెట్టే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్(BRS Defected MLAs) నుండి కాంగ్రెస్(Telangana Congress) లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల్లో అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణారావులు ఒకపుడు టీడీపీలోని వారే. అలాగే బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగా ఉన్న కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపినాధ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేమకూరు మల్లారెడ్డితో పాటు మరికొందరు, కాంగ్రెస్ లో ఎంఎల్ఏలుగా ఉన్న వాళ్ళల్లో కొందరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళందరు ఏదో సందర్భంగా చంద్రబాబుతో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. చంద్రబాబు గనుక సీరియస్ గా ప్రయత్నాలు మొదలుపెడితే పైన చెప్పిన వాళ్ళల్లో కొందరు టీడీపీలోకి వెళ్ళినా పార్టీకి ఊపురావటం ఖాయమనే అనిపిస్తోంది. కాకపోతే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి(Revanth) కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టీడీపీ బలోపేతానికి చంద్రబాబు ఏమేరకు ప్రయత్నాలు చేస్తారన్నదే కాస్త అనుమానంగా ఉంది.

Tags:    

Similar News