ఉమ్మడి జిల్లాలను వైసీపీ ప్రభుత్వంలో విభజించారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం ఆ ట్రాప్ లో పడింది. ఎన్నికల వేళ జిల్లాల పునర్వభజన మాటలు అంతవరకు పరిమితం అనే విషయం మరోసారి స్పష్టమైంది. రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయలేమనే విషయాన్ని సీఎం ఎన్. చంద్రబాబు ఒక్క మాటలో తేల్చేడమే. దీనివల్ల రాయలసీమలో మూడు జిల్లాల పునర్విభజన హామీ అటకెక్కినట్టే కనిపిస్తోంది.
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజావేదిక నుంచి స్పందిస్తూ, "మీరు మాకు ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు మీకు జిల్లా ప్రధాన కార్యాలయం కావాలి. మాకు మద్దతు ఇచ్చిన వారికి, నా సమాధానం ఏమిటి? చివరికి, అభ్యర్థి ఎవరైనా పార్టీయే ముఖ్యం" అని వ్యాఖ్యానించారు. దీంతో రాజంపేట జిల్లా ఏర్పాటు కాదనే విషయం తేలిపోయింది. ఈ ప్రభావం చిత్తూరు జిల్లా మదనపల్లెపై కూడా ప్రభావం పడింది. ఈ రెండు ప్రాంతాలను అనుసంధానిస్తున్న రాయచోటి జిల్లా యథాతథంగా కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది.
బ్రిటీష్ కాలంలోనే ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కేంద్రాలు (రాయచోటి, మదనపల్లె) జిల్లా కేంద్రం కోసం గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు అధికార వైసీపీ, కమ్యూనిస్టులు, సంఘాల నేతలు నిరసనలు సాగించారు. ఆ డివిజన్ కేంద్రాల్లో వైసీపీ నిర్ణయాన్ని టీడీపీ స్వాగతించాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జిల్లా కేంద్రాలను మారిస్తే అసంతృప్తి టీడీపీకి నష్టం కలిగే పరిస్థితి అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో
వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన అన్నమయ్య జిల్లా కేంద్రంపై మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి స్పందించారు.
"నా ఊపిరి ఉన్నంత వరకు రాయచోటి జిల్లా కేంద్రాన్ని వదులుకునేది లేదు" అని మీడియా వద్ద స్పష్టం చేశారు. "ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగడం లేదు. పరిపాలనకు చక్కటి కేంద్రం" అని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
"మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయకతప్పని పరిస్థితి" అని వైసీపీ మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి అభిప్రాయపడ్డారు. రాయచోటిని అలాగే ఉంచి పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరుతో మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్ తిప్పారెడ్డి విశ్లేషించారు.
గతాన్ని ఓసారి పరిశీలిస్తే..
2014లో రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా 13 జిల్లాలతో నవ్యాంధ్ర పాలన సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సాగించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం వైఎస్. జగన్ ఎన్నికల హామీగా..
"పార్లమెంట్ కేంద్రాలుగా జిల్లాలుగా ఏర్పాటు చేస్తాం" అని ప్రకటించారు.
2022 ఏప్రిల్ నాల్గవ తేదీ 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 51 రెవెన్యూ డివిజన్లకు అదనంగా తొలివిడతలో 22 కొత్తవి ఏర్పాటు చేశారు. ఆ తరువాత కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. కుప్పం అసెంబ్లీ స్థానంలో రెవెన్యూ డివిజన్ చేశారు.
వైసీపీ ప్రాతిపదిక ఇదే అయినా..
కడప జిల్లాలో రాజంపేట రెవెన్యూ డివిజన్ తోపాటు పార్లమెంట్ స్థానం కూడా. దీనిని వదిలేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసి అన్నమయ్య అని పేరు పెట్టారు. వాస్తవానికి పదకవితా పితామహుడు అన్నమయ్య పుట్టిన ఊరు తాళ్లపాక. ఇది రాజంపేటకుఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని నిరసిస్తూ, రాజంపేట జిల్లా కేంద్రం కోసం పార్టీలకు అతీతంగా సాగిన పోరాటంలో వైసీపీ నేతలు, శ్రేణులు కూడా నిరసనకు దిగాయి.
"అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు.. మిగతా పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దడం కోసమే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాం" అని జగన్ సమర్థించుకున్నారు. అయితే,
2024 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధానంగా ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబు జిల్లాల విభజనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఉమ్మడి జిల్లాలను అశాస్త్రీయంగా విభజించారు" అని ఆ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణ చెప్పారు. ఇదిలావుంటే..
జిల్లా కేంద్రాల ఏర్పాటులో రాజకీయ వివక్ష ప్రదర్శించారని తీవ్ర స్ధాయిలో పోరాటాలు జరిగాయి.
1. కడప జిల్లాలో బ్రిటీషువారి కాలంలోనే ఏర్పాటైన రాజంపేట పార్లమెంట్ స్థానం. రెవెన్యూ డివిజన్. ఆసియాలోనే పెద్దదైన మదనపల్లెను వదిలేశారు. వీటి రెండింటి మధ్యలో ఉన్న రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేశారు
దీనిపై మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి రెండు రోజుల కిందట ఏమన్నారంటే..
"రాయచోటిని ఏ పార్టీ, ఏ వ్యక్తి జిల్లా కేంద్రంగా చేయలేదు. భూగోళికంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరును విభజించారు. ఇటు కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరుకు రాయచోటి కేంద్రంగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు" అని వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు పట్టణంలో జరిగిన సభలో కూడా రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి మండిపల్లి గుర్తు చేశారు. ఇదిలాఉంటే...
2. అనంతపురం జిల్లా హిందూపురం కాకుండా పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయడం.
3. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కాకుండా, అద్దంకి, పరుచూరుతో కలిపి బాపట్లను కేంద్రంగా చేశారు.
4. ప్రకాశం జిల్లా కందుకూరును నెల్లూరులో కలిపారు.
వాటన్నింటిని ప్రస్తావించిన టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు "అధికారంలోకి రాగానే జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్షిస్తా. మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేస్తా." అని కూడా చంద్రబాబు రాజంపేట, మదనపల్లెలో స్పష్టంగా హామీ ఇచ్చారు. దీంతో మదనపల్లె, రాజంపేట, హిందూపురం జిల్లా సాధన కోసం పోరాటాలు సాగించి, కేసులు ఎదుర్కొంటున్న వారికి సాంత్వన లభించింది.
"నాపై 20 కేసులు పెట్టారు" అని మదనపల్లె జిల్లా సాధన సమితి సమన్వయకర్త, సామాజిక ఉద్యమకారుడు, భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ప్రస్తుత మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషాపై కూడా రెండు కేసులు నమోదయ్యాయి.
జిల్లాల విభజన అనేది ఓటు మాట అనడంలో సందేహం లేదని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి వ్యాఖ్యానించారు. ఆయన ఏమంటారంటే..
"గిరిజన జిల్లా ఏర్పాటు మినహా, పనర్వభజన జరిగే అవకాశం లేదనే సమాచారం ఉంది. ఒకటి గమనించాలి. ఉమ్మడి జిల్లా కేంద్రాలు ఉన్నప్పుడు అర్జీదారులతో కిటకిటలాడేవి. కలెక్టర్ కు విన్నవిస్తే సమస్క పరిష్కారం అవుతాయనేది పేదల మనోభావన. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పరిపాలన చేరువ చేశామని పాలకులు చెప్పుకునేందుకు పనికి వస్తోంది. అందుతున్న అర్జీల్లో ఎంతమంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫారసులు లేనిదే పరిష్కారం కావడం లేదు. మొదట ఈ పద్ధతి మారాలి" అని కందారపు మురళీ అభిప్రాయపడ్డారు.
రాజంపేట సభతో...
అధికారంలోకి రాగానే జిల్లాలను పునర్విభజన చేస్తా అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన, అధ్యయనం కోసం ఐదుగురు మంత్రులతో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే
రాజంపేటలో మూడు రోజుల కిందట జరిగిన కార్యక్రమానికి హాజరైన సీఎం ఎన్. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరతీశాయి.
"ఓట్లు, ఎమ్మెల్యేల గెలుపునకు ముడిపెట్టారు. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి అమరనాథరెడ్డి విజయం సాధించారు. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా.. మీరు మాకు ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు మీకు జిల్లా ప్రధాన కార్యాలయం కావాలి. మాకు మద్దతు ఇచ్చిన వారికి, నా సమాధానం చెప్పాలి?" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
"పార్టీ ఎమ్మెల్యేల విజయం కూడా ప్రధానమే" అని తేల్చేశారు. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు గెలవని జిల్లా కేంద్రం మార్పు జరగదనే సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఆ వేదికపైనే మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా (జహా) కూడా ఉన్నారు. మదనపల్లె జిల్లా సాధన కోసం జరిగిన ఆందోళనల్లో మాజీ ఎమ్మెల్యేగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జహాపై కూడా ఇప్పటికి పోలీస్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన టీడీపీ నుంచి మదనపల్లె నుంచి జహా టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"సీఎం చంద్రబాబు చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మదనపల్లెలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి" కదా అని బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ ధర్మసందేహం వ్యక్తం చేశారు.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ ఏమంటున్నారంటే..
రాజంపేట జిల్లా చేయనని సీఎం ఎన్. చంద్రబాబు ఎక్కడా చెప్పలేదు. అలాగని నా నియోజకవర్గం పేరు కూడా ప్రస్తావించని విషయాన్ని మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా (జహా) 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.
"భౌగోళిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని మదనపల్లెను జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇందులో సందేహం లేదు" అని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ వ్యాఖ్యానించారు.
హిందూపురానికి కూడా వర్తిస్తుందా? లేదా?
రాయలసీమలో జిల్లాల పునర్విభజన అంశం ఏ మేరకు ఉంటుదనే ధర్మసందేహాలకు సీఎం చంద్రబాబు ఆస్కారం కల్పించారు.
రాజకీయ ప్రయోజనాలు, వివక్ష వల్ల రాజంపేట, మదనపల్లె తరువాత హిందూపురంపై కూడా చూపించారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. హిందూపురంను కాదని, పుట్టపర్తిని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీధరరెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు 1985 నుంచి 1994 వరకు మూడుసార్లు విజయాలు సాధించారు. 2024 ఎన్నికల వరకు టీడీపీకి కంచుకోటగా నిలిచింది. అందులో1996లో నందమూరి హరికృష్ణ గెలిచారు. 1999లో సీపీ వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, అబ్దుల్ ఘని విజయం సాధించారు. 2014 నుంచి 2004 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించి తండ్రి ఎన్టీఆర్ రికార్డును సమం చేశారు. అందువల్లే హిందూపురంను జిల్లా కేంద్రం కాకుండా అడ్డుపడ్డారని టీడీపీ ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణ.
2024 ఎన్నికల్లో హిందూపురం తోపాటు పుట్టపర్తిలో కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ సీఎం చంద్రబాబు ఏ లాజిక్ వాడతారనేది చర్చకు ఆస్కారం కల్పించింది.
"జిల్లాల పునర్విభజన ప్రక్రియ సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ శ్రేణులు చెక్ పెట్టాలి" అని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వ్యాఖ్యానించారు.
"ఏ మండలాలు ఏ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు మంత్రి మండలి దృష్టికి వచ్చాయి. అందువల్ల ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇంకా జిల్లా పర్యటనలు కూడా ప్రారంభించలేదు. జిల్లాల ప్రక్రియపై సోషల్ మీడియా, వైసీపీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారు" అని మంత్రి మండిపల్లి వివరించారు. రాయచోటి జిల్లా కేంద్రం మార్పు ఉండబోదనే విషయం స్పష్టంగా ప్రకటించారు.
రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం చంద్రబాబు తోపాటు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి మాటలు, ప్రకటనలు జిల్లాల పునర్విభజన ఉండబోదనే విషయం స్పష్టం చేస్తున్నాయి. మండలాల విలీనం మాత్రమే జరిగేందుకు ఆస్కారం ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదుగురు మంత్రుల అధ్యయన కమిటీ పర్యటన తరువాత పరిస్థితి ఎలా ఉండబోతుందనే విషయం స్పష్టం అయ్యే వాతావరణం కనిపిస్తోంది.