ఎర్రజెండాల ప్రదర్శనతో.. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం..

తిరుపతి వీధుల్లో రెపరెపలాడిన అరుణపతాకాలు

Update: 2025-12-12 05:46 GMT

తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 25వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ఉదయం మహాప్రదర్శనతో ప్రారంభమైంది. 40 సంవత్సరాల తరువాత తిరుపతిలో ఈ విద్యార్థి సంఘం ఎన్నికలకు తిరుపతి ఆతిథ్యం ఇస్తోంది.

'డ్రగ్స్‌ అంతం.. ఎస్‌ఎఫ్‌ఐ పంతం' అని కీలక పిలుపు ఇవ్వనున్నట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పారు.
రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచికగా తిరుపతి ఎస్‌వి ఆర్ట్స్‌ కాలేజీ నుంచి శుక్రవారం ఉదయం ప్రారంభైన మహార్యాలీ నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌కు చేరుకోనుంది.
"రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాఠశాలలు, యూనివర్సిటీల నుంచి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు" అని Students Federation of India (SFI) రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్‌ తెలిపారు.
తిరుపతి నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించే బహిరంగసభలో అఖిల భారత జాతీయ అధ్యక్ష కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం.సాజి, శ్రీజన్‌ భట్టాచార్య హాజరుకానున్నారు.
మహాసభల కార్యక్రమం ఇదీ..
తిరుపతిలో మహాప్రదర్శన ముగిసిన తరువాత కచ్చపి ఆడిటోరియంలో SFI రాష్ట్ర ప్రతినిధుల మహాసభ శుక్రవారం సాయంత్రం ప్రారంభం అవుతుంది. ఈ సభలో విద్యార్థి సంఘం ప్రతినిధులను ఉద్దేశించి తమిళనాడు హైకోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ కె.చంద్రు, తిరుపతి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం తరువాత విద్యార్థిలోకం ఎదుర్కొంటున్న సమస్యలపై మూడు రోజులపాటు విస్తృతంగా చర్చలు సాగిస్తామని స్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్‌ వెల్లడించారు.
తిరుపతిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఎస్వీయూనివర్సిటీ ప్రధాన భవనంపై ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. వందలాదిమందితో మాబ్‌డ్యాన్స్‌ నిర్వహించారు. తిరుపతి నగరం అంతా ఎస్‌ఎఫ్‌ఐ జెండాలతో ఎరుపుమయంగా మారింది.

 

విస్తృత ఏర్పాట్లు
తిరుపతిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు నగరం మరోసారి ఎరుపెక్కింది. పది రోజులుగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష కార్యదర్శులు అక్బర్‌, భగత్‌రవి సారథ్యంలో నిర్విరామంగా శ్రమించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
2023లో కాకినాడలో జరిగిన 24వ మహాసభలోనే తిరుపతిలో మహాసభ నిర్వహణకు తీర్మానం చేశామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్‌ వెల్లడించారు. 40 ఏళ్ల తర్వాత తిరుపతి నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ 25వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
తిరుపతి వేదికగా జరిగే ఈ 25వ రాష్ట్ర మహాసభలో కూటమి ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. ఒక దఫా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థులు కోల్పోయారని, పెండింగ్‌ బకాయిలు రూ.6,400 కోట్లు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కాలేజీలను గత ప్రభుత్వం సగం సీట్లు ప్రైవేటీకరిస్తే, కూటమి ప్రభుత్వం 10 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌వారికి కట్టబెడుతుందని, దీనివల్ల
పేద, మధ్య తరతగి విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
'డ్రగ్స్‌ అంతం.. ఎస్‌ఎఫ్‌ఐ పంతం'
నెల్లూరు జిల్లాలో సీపీఎం ప్రజానాట్య మండలి యువ కళాకారుడు పెంచలయ్య గాంజా ముఠా చేతిలో దారుణహత్యకు గురికావడం తెలిసిందే. దీంతో 'డ్రగ్స్‌ అంతం.. ఎస్‌ఎఫ్‌ఐ పంతం' నినాదం ఇవ్వడానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు తీర్మానం చేయనున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్‌ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానం ద్వారా విద్యావ్యవస్థ పేదలకు అందకుండా పోతుందన్నారు. విద్యార్థుల్లో పెరుగుతున్న పెడదోరణులు డ్రగ్స్‌, మద్యంను ప్రభుత్వమే నివారించాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య స్ఫూర్తితో 'డ్రగ్స్‌ అంతం.. ఎస్‌ఎఫ్‌ఐ పంతం' అని కీలక పిలుపు ఇవ్వనున్నట్లు చెప్పారు. నెల్లూరు నుంచి బయల్దేరిన పెంచలయ్య స్మారక జ్యోతి గురువారం సాయంత్రం తిరుపతి చేరుకుంది. రాష్ట్ర, జిల్లా నాయకులు 'జ్యోతి'ని విప్లవస్ఫూర్తితో అందుకున్నారు.
Tags:    

Similar News