’పుతియ తలైమురై‘ని బంద్ చేసిన తమిళనాడు సర్కార్ కేబుల్ నెట్ వర్క్
టెక్నికల్ సమస్య అంటున్నా, ఇది మీడియా స్వేచ్ఛ మీద దాడిగా ప్రజలు చూస్తున్నారు
తమిళనాడులోని పాపులర్ టీవీ ఛానళ్ళల్లో ఒకటైన ‘పుతియతలై మురై’ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అరసు కేబుల్ నెట్ వర్క్ నుండి మాయమైపోయింది. ఫెడరల్ మీడియా గ్రూపులో పుతియతలై మురై టీవీ బాగా పాపులర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే తమిళనాడు అరసు కేబుల్ టీవీ కార్పొరేషన్ లిమిటెడ్(టీఏసీటీవీ) అలియాస్ అరసు కేబుల్ నెట్ వర్క్ నుండి పుతియతలైమురై ఛానల్ ఆగిపోవటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. టీవీ ఛానల్ హఠాత్తుగా నిలిచిపోవటంపై రాష్ట్రంలోని అన్నీ వర్గాలవాళ్ళు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. రాజకీయంగా టీవీఛానల్ యాజమాన్యం ఎలాంటి పక్షపాతానికి పాల్పడకుండా, ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా ప్రజల అభిప్రాయాలకు విలువిస్తు కార్యక్రమాలను నిర్వహిస్తున్న కారణంగానే జనాల్లో టీవీ ఛానల్ కు ఇంతటి ప్రజాధరణ దక్కింది.
మామూలుగా అయితే అరసు కేబుల్ నెట్ వర్క్ లో పుతియతలై మురై టీవీ 44 నెంబరులో ప్రసారమవుతుంది. అయితే శుక్రవారంనుండి ప్రసారాలు కనిపించటంలేదని ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే మంగళవారం ఉదయం నుండి ప్రసారాలు పూర్తిగా ఆగిపోయాయి. నెంబర్ 44 ఛానల్ పెట్టిన వాళ్ళకు నో సిగ్నల్ లేదా అన్ స్క్రాంబుల్డ్ ఛానల్ అని కనబడటంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రజలనుండి వస్తున్న ఫిర్యాదుల కారణంగా ఛానల్ యాజమాన్యం అరసు నెట్ వర్క్ బాధ్యులకు, సాంకేతిక నిపుణులకు ఈనెల 3వ తేదీనుండి 6వ తేదీవరకు ఎన్నిసార్లు ఫిర్యాదులుచేసినా, మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. తమిళనాడు ప్రజల్లో అశేష ఆధారణ ఉన్న పుతియతలైమురై ఛానల్ ఒక్కసారిగా ఆగిపోవటం ప్రజలను నిశ్చేష్టులను చేస్తోంది.
కొంతకాలంగా అరసు నెట్ వర్క్ ద్వారా ప్రసారమవుతున్న పుతియతలైమురై ఛానల్ ప్రసారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే ప్రతిపక్షాల కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం, నటుడు విజయ్ పార్టీ కార్యక్రమాలను ఎక్కువగా ప్రసారం చేయటంతోనే ప్రభుత్వ పెద్దలకు బాగా మండినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. చెన్నైలోని అన్నా యూనివర్సిటిలో లైంగిక వేధింపుల కేసు, శివగంగలో అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ లాంటి ఘటనలపై ప్రభుత్వాన్ని ఛానల్ నిలదీయటాన్ని ‘పెద్దలు’ సహించలేకపోయినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు ప్రియన్ మాట్లాడుతు ‘‘దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత హయాంలో కూడా మీడియా ఇలాంటి నిర్భందాన్ని ఎదుర్కొన్న విషయా’’న్ని గుర్తుచేశారు. ‘‘డీఎంకే అధికారంలోకి రాగానే దానికి మిత్రపక్షంగా ఉండే ఛానళ్ళకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తు మిగిలిన ఛానళ్ళను వెనక్కు నెట్టేసిన’’ట్లు ఆరోపించారు. ‘‘గతంలో ఏఐఏడీఎంకే హయాంలో కూడా ఇలాగే జరిగింద’’ని ప్రియన్ చెప్పారు. ‘‘7 ఏళ్ళ క్రితం ఏఐఏడీఎంకే పాలనలో కూడా అరసు కేబుల్ ప్రసారాల్లో పుతియతలమురై ఛానల్ కు ఇలాంటి ఇబ్బందులే వచ్చి’’న విషయాన్ని ప్రియన్ గుర్తుచేశారు.
అరసు కేబుల్ నెట్ వర్క్ కు 14.9 లక్షల మంది చందాదారులున్నారు. వీరిలో 12.4 లక్షలమంది సెట్ టాప్ ద్వారా స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) చూస్తున్నారు. అలాగే మరో 2.5 లక్షలమందికి హెచ్ డీ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ డీ కనెక్షన్లు ఉన్నవారికి మాత్రమే పుతియతలై మురై ఛానల్ ప్రసారమవుతోంది. అంటే సుమారు 12 లక్షలమందికి పుతియతలైమురై ప్రసారాలు నిలిచిపోయినట్లు అర్ధమవుతోంది.
ప్రభుత్వ సహించలేకపోతోంది : ఎడపాడి
‘‘రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యతిరేక ప్రచారాన్ని, ప్రసారాలను డీఎంకే ప్రభుత్వం తట్టుకోలేకపోతున్న’’ట్లు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియాను అణగదొక్కాలని డీఎంకే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎడప్పాడి దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వంలోని లోటుపాట్లను మీడియా ఎత్తిచూపినపుడు సరిదిద్దుకోవటానికి బదులు ఎదురుదాడులు చేసి అణిచివేయాలని చూడటం అవివేకమ’’ని అభిప్రాయపడ్డారు.
పుతియతలై మురై ప్రసారాలను హఠాత్తుగా అరసు కేబుల్ నెట్ వర్క్ నిలిపేయటాన్ని చెన్నై ప్రెస్ క్లబ్ ఖండించింది. జనాలకు కావాల్సిన ఛానళ్ళను ప్రసారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆపరేటర్లకు, డీటీహెచ్ ఛానళ్ళకు కూడా ఉన్నట్లు ప్రెస్ క్లబ్ చెప్పింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఛానల్ ప్రసారాలను నిలిపేయటం మీడియా స్వేచ్చకు సంకెళ్ళు వేయటమే అని జర్నలిస్టు సంఘాలు నినదిస్తున్నాయి.
దుర్మార్గ చర్య : నయ్ నార్ నాగేంద్రన్
‘‘పుతియతలై మురై ప్రసారాలను అడ్డుకోవటం డీఎకే ప్రభుత్వ దుర్మార్గ చర్య’’గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయ్ నార్ నాగేంద్రన్ మండిపడ్డారు. ‘‘ఉద్దేశ్యపూర్వకంగానే డీఎంకే ప్రభుత్వం పుతియతలై మురై ప్రసారాలను నిలిపేసి’’నట్లు ఆరోపించారు. ‘‘ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వం లోపాలను బయటపడటాన్ని తట్టుకోలేకపోతోంద’’ని నయ్ నార్ ఎద్దేవా చేశారు. ‘‘కరూర్ లో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయిన ఘటనలో ప్రభుత్వం లోపాలను పుతియతలై మురై ఎత్తిచూపటాన్ని డీఎంకే సహించలేకపోయింద’’ని అన్నామళై చెప్పారు.
‘‘పుతియతలైమురై ప్రసారాలు నిలిచిపోవటం వెనుక ప్రభుత్వం పాత్రుంటే ఖండించాల్సిందే’’ అని టీఎన్ సీసీ చీఫ్ అళగిరి అభిప్రాయపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించాల’’ని అళగిరి డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) అధికార మీడియా తీకత్తీర్ మాజీ ఎడిటర్ ఏ కుమరేశన్ మాట్లాడుతు ‘‘పుతియతలై మురై ప్రసారాలను అడ్డుకోవటం తప్ప’’ని అన్నారు. ఇది కచ్చితంగా మీడియా స్వేచ్చపై దాడి అనే చెప్పారు.