హమ్మా... డాక్టర్ నమ్రతా? ఇంత పెద్ద మోసమా?

సరోగసీ ముసుగులో శిశు వ్యాపారం, డాక్టర్ నమ్రత మోసాలపై వెల్లువెత్తున్న ఫిర్యాదులు;

Update: 2025-07-31 09:53 GMT
డాక్టర్ నమ్రత, ఆమె ఆస్పత్రి
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన డాక్టర్ అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాళ్ల నమ్రత పేరు ఒక్కసారిగా ఉభయ రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. 'సృష్టి ఫెర్టిలిటీ సెంటర్' పేరిట ఆమె నిర్వహిస్తున్న సంస్థలపై మోసపు ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల నుంచి పెద్ద ఎత్తున బాధితుల ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
రూ.25 లక్షల నమ్మక ద్రోహం...
తాజాగా హైదరాబాద్ శివార్లకు చెందిన ఓ జంట, డాక్టర్ నమ్రత మోసాలపై సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరోగసీ పేరుతో వైద్య పరీక్షలు, విడతల వారీగా మొత్తంగా ₹25 లక్షలు వసూలు చేసినట్టు వారు ఆరోపించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో బిడ్డ దాదాపు జన్మించబోతున్నట్టు నమ్మించి చివరికి శిశువు శ్వాసకోశ సమస్యతో మరణించాడని, మానసిక వేదన భరించలేక ఇద్దరు భార్యాభర్తలు కళ్లనీళ్లు పెట్టుకున్నారు.
అద్దెగర్భాల పేరుతో శిశు వ్యాపారం?
సికింద్రాబాద్‌లో ఉన్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ ద్వారా బలహీన దంపతుల నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి, సరోగసీ ద్వారా బిడ్డ పుట్టించామని చెబుతూ... నిజానికి బేబీలను ఇతర ముఠాల నుంచి కొనుగోలు చేసి బాధితులకు అప్పగిస్తున్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 10 మంది నిందితుల్లో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నమ్రత కుమారుడు జయంత్ కృష్ణపై కస్టడీ పిటిషన్
డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సాగుతోంది. కోర్టు తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే డాక్టర్ నమ్రతపై అనేక కేసులు నమోదై ఉన్నప్పటికీ, ఆమె వ్యాపార మాయాజాలం ఆగలేదని పోలీసులు తెలిపారు.
డాక్టర్ నమ్రత కొత్తగా మళ్లీ మోసాలు?
గతంలో కూడా డాక్టర్ నమ్రత అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె ఇతర వైద్యుల పేరిట కొత్త క్లినికులు తెరిచి మళ్లీ అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మంచి వేతనాలు, కమీషన్లు చూపిస్తూ వైద్యులను ప్రలోభ పెట్టడం, వారి పేర్లను వాడుకుని మోసాలు చేయడం ఆమెకు అలవాటేనని పోలీసులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ముఠా లింకులు 
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా డాక్టర్ నమ్రత మోసాలకు సంబంధించిన ఆసుపత్రులు, డాక్టర్లు, శిశు విక్రయ ముఠాలతో సంబంధాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమశాఖలతో సమన్వయం చేసుకుని ఉత్తర మండలం పోలీసులు ఇప్పటికే అడుగులు వేస్తున్నారు.
Tags:    

Similar News