పలమనేరు:పల్లె జనం, పంటలకు రక్ణణ కోసం కుంకీ ఏనుగుల వార్ జోన్..
సుక్షిత ఏనుగుల నుంచి గౌరవవందనం స్వీకరించిన పవన్ కల్యాణ్
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-09 15:07 GMT
చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలోని ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగులతో ఏర్పాటు చేసిన వార్ జోన్ ను కమాండో తరహాలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆయనకు ఇది మానసపుత్రిక లాంటిదే. క్యాంపులోని ఏనుగులను పరామర్శించారు. ఘీంకారంతో చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించిన పవన్ కల్యాణ్, విన్యాసాలు తిలకించడంతో పాటు స్వయంగా తన కెమెరాలో చిత్రీకరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు.
పలమనేరు సమీపంలోని కుంకీ ఏనుగుల కేంద్రాన్ని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం సందర్శించారు. అటవీశాఖ ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును శిలాఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రారంభించారు. ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగరవనం, సౌర శక్తితో పని చేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణానికి పునాది వేశారు.
ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, అనంతపురం, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్లు యశోద బాయి, చిత్తూరు డీఎఫ్ఓ సుబ్బురాజు హాజరయ్యారు
కళ్యాణ్ చొరవతో..
రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గానే కాకుండా, అటవీ శాఖ మంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. స్వయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా పై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దశాబ్దాల కాలంగా కర్ణాటక, తమిళనాడు అడవులకు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాలు అడవి ఏనుగులు దాడులతో పంటలు నష్టపోవడం, ప్రాణ నష్టం జరుగుతోంది.
చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాలో పంటలను కాపాడడం, ప్రాణ రక్షణ కోసం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు. ఆ ప్రభుత్వం అందించిన సహకారంతో ఈ సంవత్సరం మే 21వ తేదీ రంజని, దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర పేర్లతో ఉన్న సుక్షిత కుంకి ఏనుగులను ముసలిమడుగు వద్దకు చేర్చారు. ఇవి ఆంధ్ర, తమిళనాడు మావటీలకు అలవాటు పడ్డాయి.ఆకట్టుకున్న విన్యాసాలు
ఘీంకారంతో ఏనుగుల సెల్యూట్
ముసలిమడుగు కుంకీ ఏనుగుల కేంద్రంలోని ఏనుగులతో పాటు, కుప్పం నియోజకవర్గం రామసముంద్రం మండలం ననియాల వద్ద 2006 నుంచి సేవలు అందిస్తున్న వినాయక్, జయంత్ ఏనుగులను కూడా ఆదివారం ముసలిమడుగు కేంద్రానికి తీసుకుని వచ్చారు. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల పరేడ్ ఆకట్టుకుంది. క్రమబద్ధంగా కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేశాయి.
అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువచ్చేది ఏనుగుల చేత ప్రదర్శింపజేశారు. మానవ, ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు మదపుటేనుగుల గుంపు, నివాసాలు, పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన ఆకట్టుకుంది.
మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచి వేస్తారని మావటీలు పవన్ కళ్యాణ్ చూపించారు. మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏనుగులకు ఆయన స్వయంగా బెల్లం ఆహారం అందించారు. గజరాజుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు.
మియావకీ తరహా ప్లాంటేషన్ కి శ్రీకారం
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్ కు, ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్ర వద్ద శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ ను ఏర్పాటు చేశారు. ఉసిరి మొక్కను నాటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దట్టమైన అడవుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీటరకు ఒక్కటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్ ను స్వయంగా మొబైల్ లో వీడియో తీసుకున్నారు. మధ్యన పొదలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మావటీలకి బహుమానం
కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకీ ఏనుగులను స్వీకరించేటప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకుంటామని వన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ విధంగానే పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో మావటీలు.. కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వారి పని తీరు మెచ్చుకుంటూ, పవన్ కళ్యాణ్ రూ.50 వేలు బహుమానంగా అందించారు.