ధర్మం, జ్ఞానం, సేవ మూల సిద్ధాంతాలు
గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద శంకర ఐ సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్నిసీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ధర్మం, జ్ఞానం, సేవ... మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హిందూ మత పరిరక్షణకు... ఆది శంకరాచార్యులు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు పీఠాలను స్థాపించారని, నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోందని వెల్లడించారు. గుంటూరు సమీపంలోని పెదకాకాని వద్ద ఆదివారం శంకర ఐ సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్నిసీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంకర ఐ ఫౌండేషన్ అవసరమైన వారికి దృష్టిని ప్రసాదిస్తూ మానవాళికి అద్భుతమైన సేవలను అందిస్తోందన్నారు. శంకర సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నాను. మానవ సేవనే మాధవ సేవ అని నమ్ముతుంది కాబట్టే... కంచి పీఠం దేశ వ్యాప్తంగా కంటి ఆస్పత్రులు స్థాపించి... పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందన్నారు.